మత్తుగొలిపే గజల్స్ మిగిలించి పంకజ్ ఉదాస్ వెళ్లిపోయాడు...
ప్రముఖ గజల్ గాయకులు పంకజ్ ఉదాస్ ఈ రోజు మరణించారు.ఆయనని స్మరిస్తూ !
గజల్ గంధర్వుడు పంకజ్ ఉదాస్ ఫిబ్రవరి 26న చనిపోయాడు. గజల్ ప్రియులందరికి పూరించ లేని లోటు కలిగిస్తూ వెళ్లిపోయారు. ఆయన వయసు 72. కొంత అస్వస్థతతో బాధపడుతూ ఉన్నారు. ఈ ఉదయం పదకొండుగంటలకు ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. కొద్ది రోజులు కిందట ఆయన క్యాన్సర్ జబ్బు వచ్చిందని తేలింది. అప్పటి నుంచి ఆయన ఎవరినీ కలవడం లేదు. రేపు అంత్యక్రియలు జరుగుతాయి.
అతని గొంతులో ప్రేయసిని తలపోసే వియోగ దుఃఖం..తాగుబోతు లెక్కలేని తనం,మనిషి చేసే నమ్మక ద్రోహపు దిగ్భ్రాంతి... నిస్సహాయత..దూరాన ఉన్న బంధువుల పలకరింపుల పలవరింతలు అద్భుతంగా పలుకుతాయి... అతనే పద్మశ్రీ పంకజ్ ఉదాస్.
ఈ గోడలతో కలిసి దుఃఖంచడమే బాగుంది ! (గజల్)
(దీవారో సే మిల్ కర్ రోనా అచ్చా లగ్తా హై)
కవి-ఖైసర్ -ఉల్-జాఫ్రీ.
తెలుగు అనుసృజన : గీతాంజలి
అవును ..గోడలని పట్టుకుని...గోడలతో కలిసి...గోడలని కౌగలించుకుని ఏడవడమే బాగుంది !
కానీ నేను పిచ్చివాణ్ణి అయిపోతానేమో అనే భయం కూడా వేధిస్తుంది !
ఈ భూగోళమంతటి అంతేలేని జ్ఞాపకాలు నన్ను పలకరించడానికి నా ఇంటికి వస్తాయా...
సంధ్య వాలితే చాలు.. శూన్యం నిండిన నా ఇల్లంతా నీ స్మృతుల జాతరతో నిండిపోతుంది.!
ఎన్నాళ్ల నుంచీ దాహంతో అలమటిస్తున్నానో...నీకేం తెలుస్తుందిలే .. దోస్త్ కొంచెం ఆలోచించు !
గడ్డి పరక మీది మంచు బిందువు కూడా నా దాహం తీరడానికి సరి పోతుందనిపిస్తుందంటే ఆశ్చర్యం ఏముంది చెప్పు?
ఇక నేను ఎవరిని రాళ్లతో కొట్టాలో అది కూడా నువ్వే చెప్పు దోస్త్ ! ఇక్కడ పరాయివాళ్లంటూ ఎవరున్నారని ?
ఈ అధ్దాల మేడలో కనిపించే ఒక్కో మొఖం నా వాళ్లవే
ఏం చేయను మరి ?
అందుకే.. ఒంటరిగా నిలబడే ఈ గోడలని కావలించుకుని వెక్కి ..వెక్కి ఏడవడమే బాగుంటుంది నాకు !
మీరే చెప్పండి..ఏం చేయాలో ?