మేం పంపించినపుడు నెయ్యి స్వచ్ఛంగానే ఉంది: ఎఆర్ ఫుడ్స్
తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె ఉన్నాయని ల్యాబ్ రిపోర్టు రావడంతో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
తిరుమల లడ్డుపై ఏపీ రాజకీయాలు కేంద్రీకృతమయ్యాయి. లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి ఉన్నాయని గుజరాత్‌కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ) కాఫ్ లిమిటెడ్ నివేదిక ఇవ్వడంతో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిని తమిళనాడు రాష్ట్రం దిండిగల్‌లోని ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సరఫరా చేస్తుంది. తాము పంపే నెయ్యిలో ఎలాంటి కల్తీలేదని సంస్థ సమర్థించుకుంటోంది.
మేం పంపిన నెయ్యిలో ఏ కల్తీ లేదని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ), అలాగే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) సర్టిఫై చేశాయని ఏఆర్ డైరీ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అధికారులు ఫెడరల్‌కు తెలిపారు. సంస్థ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ లెని మాట్లాడుతూ ‘‘తిరుమలకు నెయ్యి కంటెయినర్లను పంపడానికి ముందు, తిరుమలకు కంటైనర్లు చేరుకున్న తర్వాత నెయ్యిని పరీక్షిస్తారు. నెయ్యి నాణ్యతకు సంబంధించి NABL ధృవీకరించిన సర్టిఫికెట్‌ను కంటెయినర్లతో పంపుతాం. తిరుమలకు చేరుకున్న కంటెయినర్ల నుంచి మళ్లీ కొంత నెయ్యిని టీటీడీ వారు పరీక్షిస్తారు. వారు కూడా కల్తీ లేదని సర్టిఫై చేస్తారు. ఆ రిపోర్టులన్నీ మా దగ్గర ఉన్నాయి.’’ అని చెప్పారు. ఏఆర్ ఫుడ్స్‌లోని మరో క్వాలిటీ కంట్రోల్ అధికారి కన్నన్ మాట్లాడుతూ..‘‘ FSSAI మా నెయ్యిని పరీక్షించి ఎలాంటి కల్తీ లేదని సర్టిఫై చేసింది.అగ్మార్క్ టీం కూడా నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదని ధృవీకరించింది’’ అని పేర్కొ్న్నారు.