జీహెచ్ఎంసీ విస్తరణకు అసలు కారణం చెప్పిన కేటీఆర్
x

జీహెచ్ఎంసీ విస్తరణకు అసలు కారణం చెప్పిన కేటీఆర్

మర్చంట్ బ్యాంకర్ బ్రోకర్ చెప్పినట్లు రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారంటూ కేటీఆర్ ఆరోపణలు.



జీహెచ్ఎంసీ విస్తరణపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదంతా కూడా డబ్బుల కోసం చేస్తున్నదేనని ఆరోపించారు. మర్చంట్ బ్యాంకర్ బ్రోకర్ ఏది చెప్తే రేవంత్ కూడా అదే చేస్తున్నారని అన్నారు. సోమవారం మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీహెచ్‌ఎంసీని అడ్డగోలుగా విభజిస్తున్నారని విమర్శించారు. జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా డబ్బుల కోసమే చేపడుతున్నారని ఆరోపించారు. మర్చంట్ బ్యాంకర్, బ్రోకర్ చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ‘ఫోర్త్ సిటీ’ అని పేరు పెట్టారని, త్వరలో దాన్నీ మరో కార్పొరేషన్‌గా మార్చినా ఆశ్చర్యం లేదని ఎద్దేవా చేశారు. ఏ నిర్ణయమైనా శాస్త్రీయంగా ఉండాలన్నారు. ఇష్టమొచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటే ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.

జీహెచ్‌ఎంసీ డివిజన్ల విభజన అంశాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చర్చ జరిగితే అన్ని అంశాలపై తాము మాట్లాడతామని తెలిపారు. జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్, ఎంఐఎం ఏం చేసుకుంటాయో, ఎవరికీ లాభం చేకూర్చేలా వ్యవహరిస్తాయో వాళ్ల ఇష్టమని వ్యాఖ్యానించారు. అయితే 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలు చారిత్రాత్మకమని, అలాంటి ఎన్నికలు గతంలోనూ లేవని, భవిష్యత్తులోనూ రావని అన్నారు. ఓల్డ్ సిటీలో కూడా బీఆర్ఎస్ రెండు సీట్లు గెలిచిందని గుర్తు చేశారు. గతంలో బీఆర్ఎస్ గెలిచిన సీట్లు ఇప్పటికీ ఎవరూ గెలవలేకపోయారని పేర్కొన్నారు.

అసెంబ్లీలో కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షేక్‌హ్యాండ్ ఇవ్వడంపై కూడా కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ పట్ల గౌరవం ఉంటే చాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడిగా కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజలందరిలో గౌరవం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రికి సభలో కలిసేంత సంస్కారం ఉంటే సరిపోతుందని, అదే సంస్కారం బయట మాటల్లోనూ ఉంటే మరింత బాగుండేదని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రత్యర్థులు పరస్పరం పలకరించుకునే సానుకూల వాతావరణం ఉండటం మంచిదేనని కేటీఆర్ అన్నారు.

Read More
Next Story