తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇల్లు సీజ్
x

తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఇల్లు సీజ్

ఆస్తి పన్ను కట్టకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు చెప్పిన డిప్యూటీ కమిషనర్.


తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జే. జయలలితకు హైదరాబాద్‌ ఇంటిని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. జయలలిత పేరుతో హైదరాబాద్‌, శ్రీనగర్ కాలనీలో 8-3-1099/ఏ నంబర్‌ ఇల్లు ఉంది. 2017 నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించలేదని డిప్యుటి కమిషనర్ సురేష్ నోటీసు జారీచేశారు. ఎన్నిసార్లు నోటీసు ఇచ్చినా ఎలాంటి స్పందన రాకపోవడంతో మున్సిపల్ చట్టాల ప్రకారం అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ బాలరాజు ఆధ్వర్యంలో ఇంటిని జీహెచ్ఎంసీ సోమవారం సీజ్ చేసింది. మొత్తం బకాయిలు సుమారు రూ.83 లక్షలుగా ఉన్నట్లు సురేష్ చెప్పారు.

జీ ప్లస్ 4 భవనం జయలలిత పేరుతోనే ఉన్నది. గతంలో ఈ భవనంలో ప్రైవేట్ కార్యాలయాలు నడిచినందున కమర్షియల్ కాంప్లెక్స్‌గా పన్ను విధించారని అధికారులు వివరించారు. అయితే, 2017 నుంచి ఈ భవనాన్ని రెసిడెన్షియల్ భవనంగానే ఉపయోగిస్తున్నాము కాబట్టి ఇంటిని కమర్షియల్ నుండి రెసిడెన్షియల్ ప్రాపర్టీగా మార్చాలని జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ జీహెచ్ఎసీకి దరఖాస్తు చేసుకున్నారు.

ఓటీఎస్(వన్ టైమ్ సెటిల్మెంట్) స్కీమ్ కింద బకాయిల చెల్లింపుకు మార్చి 31 వరకు గడువు ఉండగా, వడ్డీపై 90 శాతం మాఫీ అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం ఉన్నప్పటికీ బకాయిలు క్లియర్ చేయలేదు. ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్న నేపధ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు పన్నుల వసూళ్ళపైన బాగా దృష్టిపెట్టారు. ఈ దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న పన్ను బకాయిలకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జయలలిత ఇంటి పన్ను బకాయి విషయం బయటపడిందవి. ఇప్పటికే మూడు కార్పొరేషన్ల పరిధిలో రూ.2,350 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసినట్లు అధికారులు చెప్పారు.

ఇకపై నోటీసులు జారీచేసినా పట్టించుకోని ఆస్తులపై ఇదే విధంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు సురేష్ హెచ్చరించారు. పన్నులు చెల్లించని యజమానులు వెంటనే బకాయిలు క్లియర్ చేయాలని సూచించారు. ఈ పరిణామం నగరంలో పెండింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ళపై మరింత దృష్టిని ఆకర్షించే అవకాశముంది.

Read More
Next Story