జీహెచ్‌ఎంసీ విభజనకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
x

జీహెచ్‌ఎంసీ విభజనకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

సైబరాబాద్, మల్కాజిగిరి కొత్త కార్పొరేషన్లు. 1955 చట్టం ప్రకారం ఉత్తర్వులు. జయేష్ రంజన్ ప్రత్యేక అధికారి. కమిషనర్ల నియామకం.


హైదరాబాద్ నగర పరిపాలనలో కీలక మార్పు అమల్లోకి వచ్చింది. జీహెచ్‌ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం మూడుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం నుంచి కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చింది. 2007 ఏప్రిల్ 16న 12 మున్సిపాలిటీల విలీనంతో 150 వార్డులుగా జీహెచ్‌ఎంసీ ఏర్పడింది. తరువాత డీలిమిటేషన్‌తో 300 డివిజన్లకు విస్తరించింది. పాత పరిధిలోని 150 డివిజన్లు 243కి పెరిగాయి. విలీన ప్రాంతాల్లో 57 డివిజన్లు ఏర్పడ్డాయి. ఇప్పుడు అదే జీహెచ్‌ఎంసీని మూడు వేర్వేరు కార్పొరేషన్లుగా విభజించారు.

జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడ్డాయి. జీహెచ్‌ఎంసీ చట్టం-1955 సెక్షన్ 3(1) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లను కలిపి సైబరాబాద్ కార్పొరేషన్ రూపొందించారు. ఐటీ, అభివృద్ధి చెందిన పట్టణ ప్రాంతాల నిర్వహణ కోసం ఈ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజిగిరి జోన్లతో మల్కాజిగిరి కార్పొరేషన్ ఏర్పడింది. వేగంగా పెరుగుతున్న నివాస ప్రాంతాలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సికింద్రాబాద్, ఖైరతాబాద్, గోల్కొండ, చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లతో జీహెచ్‌ఎంసీ కొనసాగనుంది.

కొత్త కార్పొరేషన్లకు కమిషనర్లను నియమించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్ కొనసాగనున్నారు. సైబరాబాద్‌కు శ్రీజన, మల్కాజిగిరికి వినయ్ కృష్ణారెడ్డి నియమితులయ్యారు. మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగే వరకు జయేష్ రంజన్‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు పరిపాలనా వ్యవహారాలన్నింటిని ఆయన పర్యవేక్షించనున్నారు.

గత పుష్కర కాలంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీ అభివృద్ధి పనులు జరిగాయి. ఎస్సార్‌డీపీ, ఎస్‌ఎన్‌డీపీ పథకాల కింద వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు అమలయ్యాయి. సుమారు రూ.24 వేల కోట్లతో 23 ఫ్లైఓవర్లు సహా దాదాపు 40 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. బాండ్ల ద్వారా రుణాలు సేకరించిన కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ గుర్తింపు పొందింది.

ఇంటింటి చెత్త సేకరణ, పార్కులు, ఎల్‌ఈడీ వీధి దీపాలు వంటి కార్యక్రమాలు అమలయ్యాయి. నగర విస్తరణ, జనాభా పెరుగుదల, పరిపాలన సౌలభ్యం దృష్ట్యా ఈ విభజన చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కొత్త నిర్మాణంతో హైదరాబాద్ నగర పరిపాలనలో కొత్త దశ ప్రారంభమైంది. ఎన్నికల అనంతరం ప్రజాప్రతినిధులు బాధ్యతలు స్వీకరించనున్నారు.

కమిషనర్లు వీళ్లే..

మూడు కార్పొరేషన్లకు నియమితులైన కమిషనర్లు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ నిర్ణయంతో జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడ్డాయి. గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్‌గా ఆర్‌వీ కర్ణన్ యథాతథంగా విధులు కొనసాగిస్తున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా సృజన బాధ్యతలు చేపట్టారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా వినయ్ కృష్ణారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు.

ఇక మూడు కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ నియమితులయ్యారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఆయన అదనపు బాధ్యతలు స్వీకరించారు. కొత్త పరిపాలనా నిర్మాణంలో అధికారులు బాధ్యతలు చేపట్టడంతో నగర పాలన కొత్త దశలోకి అడుగుపెట్టింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ వ్యవస్థ కొనసాగనుంది.

Read More
Next Story