ఫేక్ సర్టిఫికెట్లకు చెక్.. త్వరలో సీఆర్‌ఎస్ అమలు
x

ఫేక్ సర్టిఫికెట్లకు చెక్.. త్వరలో సీఆర్‌ఎస్ అమలు

జీహెచ్ఎంసీలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీకి కొత్త విధానం సిద్ధం. యూనిఫామ్ పోర్టల్ ద్వారా పారదర్శకత పెంపు లక్ష్యం.


జీహెచ్ఎంసీలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల విషయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకుంది. ఫేక్ సర్టిఫికెట్లకు చెక్ పెట్టడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే రాష్ట్రంలో కూడా సివిల్ రిజిస్ట్రేషన్ సర్వీస్(CRS)ను రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ఫిక్స్ అయ్యారు. ఏప్రిల్ నెల రెండో వారం నుంచి కేంద్ర ప్రభుత్వ సీఆర్ఎస్ వ్యవస్థను అమలు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. కోర్ అర్బన్ రీజియన్‌లో కోటిన్నర మందికి పైగా ప్రజలకు సేవలు అందించే జీహెచ్ఎంసీలో ఇటీవల నకిలీ సర్టిఫికెట్లు వెలుగులోకి రావడం కలకలం రేపింది.

కొన్ని సంవత్సరాల క్రితం మూడు నెలల్లో అసాధారణంగా అధిక సంఖ్యలో సర్టిఫికెట్లు జారీ కావడంతో అనుమానం వ్యక్తమైంది. విజిలెన్స్ విచారణలో కొన్ని ఆస్పత్రుల్లో అక్రమ నమోదు జరిగినట్టు బయటపడింది. ఫీల్డ్ పరిశీలన లేకుండానే సిబ్బంది సర్టిఫికెట్లు జారీ చేసినట్టు అధికారులు గుర్తించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనల తర్వాత శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

ఇతర దేశాల్లోని మహానగరాల్లో సీఆర్ఎస్ ద్వారానే సర్టిఫికెట్లు జారీ అవుతున్నట్లు అధికారులు గమనించారు. ఇదే విధానాన్ని అమలు చేయాలని కేంద్ర సీఆర్ఎస్ విభాగంతో పలుమార్లు చర్చలు జరిపారు. అయితే హైదరాబాద్‌లోని పాత నగర ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో సర్టిఫికెట్ల జారీ విధానం భిన్నంగా ఉండటం సమస్యగా మారింది. కొంత ప్రాంతాల్లో మున్సిపల్ కార్పొరేషన్, మరికొన్ని చోట్ల జిల్లా కలెక్టర్లు సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు.

ఒకే అధికారిని యాప్‌లో చేర్చాలన్న కేంద్ర సూచనతో అయోమయం నెలకొంది. దీనిని గుర్తించిన కేంద్ర అధికారులు తమ పోర్టల్‌లో పట్టణ, గ్రామీణ జారీ వ్యవస్థలను అనుసంధానం చేసే మార్పులు చేపట్టినట్లు సమాచారం. ప్రస్తుతం కోర్ అర్బన్ రీజియన్‌లో రెండు వేర్వేరు సిస్టమ్‌ల ద్వారా సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి. పాత జీహెచ్ఎంసీలో సీజీజీ పోర్టల్ ద్వారా, విలీనమైన ప్రాంతాల్లో ఎన్ఐసీ ద్వారా సేవలు అందిస్తున్నారు.

ఇటీవల మూడు కార్పొరేషన్లుగా విభజన తర్వాత కూడా ఈ రెండు విధానాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితికి ముగింపు పలుకుతూ యూనిఫామ్ పోర్టల్ ద్వారా సేవలు అందించేందుకు అధికారులు కసరత్తు పూర్తి దశకు తీసుకెళ్లారు. రెండు విధానాలను రీ-మ్యాపింగ్ చేసి కేంద్ర సీఆర్ఎస్‌లో చేర్చేందుకు చర్యలు చేపట్టారు.

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ వివరాల ప్రకారం, కొత్త విధానంలో 16 అంకెల యూనిక్ నెంబర్‌తో సర్టిఫికెట్లు జారీ అవుతాయి. దీంతో దేశంలోని ఇతర నగరాల నుంచి కూడా ఈ సర్టిఫికెట్లు సులభంగా పొందే అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు. మొత్తంగా, ఈ మార్పులు పౌర సేవల్లో పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా అమలవుతున్నాయి.

Read More
Next Story