మావోయిస్టు నిప్పు రవ్వ రగిలింది కరీంనగర్ జిల్లాలోనే...
x
ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులు వెనకడుగు

మావోయిస్టు నిప్పు రవ్వ రగిలింది కరీంనగర్ జిల్లాలోనే...

ఉద్యమానికి ఎందరో నేతలను, దళ సభ్యులను అందించింది కరీంనగర్ జిల్లాయే. చరమాంకం నుంచి ఒక వెనుచూపు


నాలుగున్నర దశాబ్దాలుగా అడవుల్లో తుపాకీ మోతలతో సాగిన మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు కీలక మలుపు తిరుగుతోంది. తదుపరి మావోయిస్టు ఉద్యమం స్వరూపం ఎలా ఉంటుందో గాని 1980లో కరీంనగర్ జిల్లా జగిత్యాల పట్టణంలో రగిలిన నిప్పు రవ్వ దావానలం లాగా దండకారణ్యాన్ని అక్రమించుకుంది. ఇపుడు ఆ నిప్పురవ్వ ఆరిపోతున్నదా అనే అనుమానం కలిగించే వాతావరణం ఏర్పడుతూ ఉంది. గత అయిదు దశాబ్దాల మావోయిస్టు రాజకీయాలలో కరీంనగర్ ది ఉజ్వలమైన పాత్ర. ఉద్యమానికి ఈ జిల్లా కార్యకర్తలను అందించింది, నాయకత్వాన్ని అందించింది. అంతేకాదు,ఇక్కడి నుంచే దండకారణ్య కార్చిచ్చు వ్యాపించింది. 1977 ఎమర్జన్సీ తర్వాతి మావోయిస్టు చరిత్ర ను రాస్తే ఒక చాప్టర్ ను కరీంనగర్ కు కేటాయించాల్సి ఉంటుంది.మావోయిస్టు అగ్రనేతల్లో చాలామంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారే. అనేక మంది కార్యకర్తలు మృతి చెందడుం, చాలా మంది సీనియర్ నాయకులు లొంగిపోతూ ఉండటంతో కరీంనగర్ చాప్టర్ క్లోజ్ అవుతున్నట్లు అనిపిస్తుంది.
నాటి పీపుల్స్ వార్ గ్రూప్ నుంచి నేటి మావోయిస్టు వరకు కీలక స్థానాల్లో ఉన్న పలువురు అగ్రనేతలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే. విద్యార్థి ఉద్యమాల నుంచి అడవిబాట పట్టిన వారు, దశాబ్దాల తర్వాత జనజీవన స్రవంతిలోకి రావడం మావోయిస్టు ఉద్యమ చరిత్రలో కీలక పరిణామంగా మారింది. దీనికి కారణం జిల్లాలో నిజాంనాటి భూస్వామ్య పెత్తనం కొనసాగుతూ ఉండటమే. ఎమర్జన్సీ తర్వాతి రోజుల్లో ఈ భూస్వామ్యాన్ని ప్రశ్నించే శక్తులు జిల్లాలో వచ్చాయి. అవే ఉత్తరోత్తర మావోయిస్టు శక్తులయ్యాయి.
మావోయిస్టు పార్టీ (CPI-Maoist) చీఫ్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, కేంద్రకమిటీ సభ్యుడు మల్లా ఆదిరెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ మీసాల సత్తన్న, మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న లు తాజాగా పోలీసుల ముందు లొంగిపోయి మావోయిస్టు పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు. వీరంతా కరీంనగర్ జిల్లా వారే. ఈ నేపథ్యంలో వారి స్వగ్రామాల్లోని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం గ్రామం వదిలి తుపాకీ పట్టి దళాల్లోకి వెళ్లి అజ్ఞాత జీవితం గడిపిన నేతలు లొంగిపోవడం తమ మధ్యకు రావడం ఆనందాన్నిచ్చిందని వారి బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పీపుల్స్ వార్ గ్రూప్ లో కీలక నేతలంతా కరీంనగర్ వాసులే...

జిల్లాలో ఉన్న ఫ్యూడల్ వాతావరణం మొదట రాడికల్ ఉద్యమం బలపడేందుకు దారితీసింది. ఇక్కడ భూమంతా భూస్వాములదే. దున్నేవాడికి ఏమీలేదు. ఇలాంటపుడు 1975లో ఇందిరాగాంధీ 20 సూత్రాల ఆర్థిక పథకం ప్రకటించింది. అందులో దున్నేవాడికి భూమి అన్నది మరొక నినాదం. రాడికల్ విద్యార్థులు ఆనినాదాన్ని అందుకుని అమలుచేయాలన్నారు. ఈ విద్యార్థుల్లో మల్లోజుల కోటేశ్వరరావు కీలకమయిన వ్యక్తి. వీరంతా 1978లో జగిత్యాలలో చరిత్రాత్మ భూస్వామ్య వ్యతిరేకర్యాలీని నిర్వహించారు. 1975-1985 మధ్య జగిత్యాల రైతాంగా పోరాటం పతాకస్థాయికి చేరుకుంది. ఇప్పటిదాకా దండకారణ్యంలో ఉంటూ మావోయిస్టు పార్టీకి నాయకత్వం వహించినవాళ్లంతా ఈ పదేళ్ల కార్ఖానాలో తయారయినవాళ్లే.
1977లో ఎమర్జన్సీ ఎత్తేశాక కొండపల్లి సీతారామయ్య ఆధ్వర్యంలో ఉద్యమ సమీకరణకు అనువైన వాతావరణం ఏర్పడింది. అంతవరకు సీపీఐ(ఎంఎల్) సివొసి, ఆపైన కెఎస్ గ్రూప్ గా ఉన్న పార్టీ 1980లో పీపుల్స్ వార్ గా మారింది. ఆయన స్ఫూర్తితో కరీంనగర్ జిల్లా నుంచి పలువురు యువకులు రాడికల్స్ స్టూడెంట్స్ యూనియన్ లో చేరి పోరాటాలు చేశారు. వందల మంది విద్యార్థులు మిలిటెంట్ లీడర్లుగా తయారయ్యారు. జగిత్యాల సిరిసిల్ల రైతాంగ పోరాటాలు ఉవ్వెత్తున లేచేందుకు తోడ్పడ్డారు. వీటి ప్రభావంతో భూస్వాములు ఊరు వదిలి పట్టణాలకు పరిగెత్తిపోయారు. ఈ రైతాంగ పోరాటం విజయవంతం కావడంతో ఇక్కడి నుంచి ఉద్యమ సందేశాన్ని తీసుకుని ఏడు సాయుధ దళాలు ఉత్తర తెలంగాణ, అక్కడి నుంచి గడ్చిరోలి, మరొకవైపు చత్తీష్ గడ్ లోకి ప్రవేశించాయి. 2004 సెప్టెంబర్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన సిపిఐ(ఎంఎల్-పీపుల్స్ వార్), బీహార్ కు చెందిన మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆప్ ఇండియా ( Maoist Communist Centre of India (MCCI) వీలనమయి సిపిఐ(మావోయిస్టు)గా అవతరించాయి.
అలా నక్సల్ ఉద్యమం మావోయిస్టు ఉద్యమంగా మారడానికి బీజం వేసింది కరీంనగర్ జిల్లాయే. జిల్లాలో ప్రారంభమైన ఈ ఉద్యమం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. స్వీడిష్ రచయిత జాన్ మిర్దాల్ (Jan Myrdal) అపుడు తెలంగాణలో పర్యటించి ఉద్యమం గురించి ప్రపంచ ప్రజల దృష్టికి తీసుకు వెళ్లారు.
నాడు కరీంనగర్ జిల్లా నుంచి ఎక్కువ మంది అజ్ఝాతంలో చేరడంతో వారు దళ సభ్యులుగా ఉంటూ కమాండర్లుగా, పార్టీ అగ్రనేతలుగా ఎదిగారు. 1991లో కేఎస్ ను పార్టీ నుంచి బహిష్కృతం చేయడంతో ఆయన స్థానంలో కరీంనగర్ జిల్లా బీర్పూర్ గ్రామానికి చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి పీడబ్యూజీ కార్యదర్శి అయ్యారు. ఆ తర్వాత పీపుల్స్ వార్ కాస్తా మావోయిస్టు పార్టీగా మారింది. వయోభారం, అనారోగ్యం కారణంగా లక్ష్మణరావు 2018వ సంవత్సరంలో మావోయిస్టు పార్టీ సారథ్యం నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ కేంద్ర కమిటీ కార్యదర్శి అయ్యారు. గత ఏడాది మే 21వతేదీన జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించడంతో మళ్లీ కరీంనగర్ జిల్లాకు చెందిన తిరుపతి అలియాస్ దేవ్ జీ బాధ్యతలు స్వీకరించారు.

ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులు కకావికలం

దేశంలో మావోయిస్టు కార్యకలాపాల నిర్మూలనకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ 2024వ సంవత్సరంలో ఆపరేషన్ కగార్ పేరిట ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. మావోయిస్టులకు కేంద్రంగా ఉన్న అబూజ్ మడ్ అడవుల్లోకి కేంద్ర భద్రతా బలగాలు వెళ్లి పలు ఎదురుకాల్పుల్లో వందలాది మంది మావోయిస్టులను మట్టుబెట్టారు. మావోయిస్టుల స్థావరమైన కర్రెగుట్టల్లో సైతం కేంద్రబలగాలు పాగా వేశాయి. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో , కేంద్రకమిటీ సభ్యులు పోలీసుల కాల్పుల్లో నేలకొరగడంతో పార్టీ కకావికలం అయింది.

అన్న కోసం తమ్ముడి ఆరాటం

తన అన్న మావోయిస్టు కేంద్రకమిటీ కార్యదర్శి దేవ్ జీ కోసం అతని తమ్ముడు గంగాధర్ 42 ఏళ్లుగా కళ్లప్పగించి చూస్తున్నాడు. అడవుల్లో తుపాకీతో జీవించిన నేత, ఇప్పుడు ఊరి గడపకు రాబోతున్నాడు…మావోయిస్టు అగ్రనేతల ఎదుగుదలకు నిలయమైన కరీంనగర్ జిల్లా, ఇప్పుడు వారి లొంగుబాటుకు సాక్షిగా మారుతోంది. ఎపుడో విద్యార్థి ఉద్యమాల నుంచి అడవిబాట పట్టిన వారు, దశాబ్దాల తర్వాత జనం మధ్యకు రావడం మావోయిస్టు ఉద్యమ చరిత్రలో కీలక పరిణామంగా మారింది.
మావోయిస్టు పార్టీ చీఫ్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, కేంద్రకమిటీ సభ్యుడు మల్లా ఆదిరెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ మీసాల సత్తన్న, మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న లు తాజాగా పోలీసుల ముందు లొంగిపోయిన నేపథ్యంలో వారి స్వగ్రామాల్లోని కుటుంబసభ్యులు,బంధువులు, స్నేహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం గ్రామం వదిలి తుపాకీ పట్టి దళాల్లోకి వెళ్లి అజ్ణాత జీవితం గడిపిన నేతలు లొంగిపోవడం తమకు ఆనందాన్నిచ్చిందని వారి బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వయోభారం, అనారోగ్యం కారణంగా లక్ష్మణరావు 2018వ సంవత్సరంలో మావోయిస్టు పార్టీ సారథ్యం నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ కేంద్ర కమిటీ కార్యదర్శి అయ్యారు. గత ఏడాది మే 21వతేదీన జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించడంతో మళ్లీ కరీంనగర్ జిల్లాకు చెందిన తిరుపతి అలియాస్ దేవ్ జీ బాధ్యతలు స్వీకరించారు.

చదువుకుంటూనే దళంలో చేరి...

నాడు చదువుకుంటూనే రాడికల్స్ స్టూడెంట్స్ యూనియన్ లో చేరి అడవి బాట పట్టారు. నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో పనిచేసి జనజీవన స్రవంతిలో కలిశారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన తిప్పిరి వెంకట నర్సయ్య, గంగుబాయిల పెద్దకుమారుడు తిరుపతి. ఇంటర్ మీడియెట్ వరకు కోరుట్లలోనే చదువుకున్నారు. ఆర్ఎస్ యూలో పనిచేస్తున్నపుడు ఏబీవీపీతో గొడవల వల్ల తిరుపతిపై కేసులు నమోదయ్యాయి. 15 ఏళ్ల క్రితమే తిరుపతి తల్లిదండ్రులు మరణించారు. ఆయన సోదరుడు వెంకటి కూడా మరణించాడు.కోరుట్లలో తిరుపతి పెంకుటిల్లు శిథిలావస్థకు చేరింది.

కోరుట్ల నుంచి కేంద్ర కమిటీ వరకూ...

తాను కోరుట్ల ఎస్ఐగా పని చేసినపుడే తిరుపతి పీపుల్స్ వార్ గ్రూపులో చేరాడని మాజీ అదనపు ఎస్పీ నర్సింగరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.1980వ సంవత్సరంలో కరీంనగర్ జిల్లాలో భూస్వాములకు వ్యతిరేకంగా కొందరు యువకులు రాడికల్ సంఘంలో చేరి అడవి బాట పట్టి మావోయిస్టు పార్టీలో కీలకనేతలుగా పనిచేశారని నర్సింగరావు తెలిపారు. తిరుపతి కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతూ 1984వ సంవత్సరంలో రాడికల్స్ స్టూడెంట్స్ యూనియన్ లో చేరి అనంతరం అజ్హాతంలోకి వెళ్లి మావోయిస్టు దళ కమాండరుగా ఎదిగారు. ఈయనకు పార్టీలో ఆయుధాల తయారీలో దిట్ట అనే పేరుంది. దళంలో సభ్యురాలైన నల్లొండ జిల్లాకు చెందిన సృజనను పెళ్లి చేసుకున్నా, ఆమె పోలీసు ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. గత ఏడాది సెప్టెంబరులో తిరుపతి అలియాస్ దేవ్ జీ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి అయ్యారు.

భావోద్వేగానికి గురైన సోదరుడు

తిరుపతి అడవి బాట వదిలి జనజీవన స్రవంతిలో కలవడంతో అతని తమ్ముడు కోరుట్లకు చెందిన గంగాధర్, ఆయన కూతురు సుమ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన అన్నను 42 ఏళ్ల క్రితం చివరిసారి చూశానని, ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నానని గంగాధర్ చెప్పారు. తిరుపతి లొంగిపోయారని వచ్చిన వార్తలతో గంగాధర్ కుటుంబంలో పండుగ వాతావరణం ఏర్పడింది. తన అన్నను చూడాలనే సుదీర్ఘ నిరీక్షణ తీరనుందని గంగాధర్ చెప్పారు.

పెదనాన్నను చూడాలనే ఆరాటం ఫలించింది : సుమ

తాను పెదనాన్నను చూడాలనే ఆరాటం ఫలించిందని తిరుపతి తమ్ముడు గంగాధర్ కుమార్తె, బీటెక్ విద్యార్థిని సుమ చెప్పారు. తన పెదనాన్న మావోయిస్టు పార్టీ కార్యదర్శి అని తెలిశాక అతన్ని చూడాలని సుమ ఆరాటపడ్డారు.‘‘ ప్రజా ఉద్యమం కోసం అడవుల బాట పట్టిన మీరు మా కోసం ఇంటి బాట పట్టాలి’’అని సుమ విన్నవించారు.

ఉద్యోగాన్ని వదిలి అడవి బాట

మల్లా రాజిరెడ్డిది కరీంనగర్ జిల్లాలోని మంథని మండలం శాస్త్రులపల్లి గ్రామం. ఓ కేసులో జైలుకు వెళ్లిన ఈయన ఉద్యమకారుల సాన్నిహిత్యంతో దళంలో చేరారు. సింగరేణిలో ఉద్యోగం వచ్చినా నియామక పత్రాన్ని చింపి దళంలో చేరారు. మల్లా వెంకటరెడ్డి, రాథమ్మ దంపతులకు జర్మించిన రాజిరెడ్డి చదువుకుంటూనే దళంలోకి వెళ్లారు. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులంలో అరెస్టు అయిన రాజిరెడ్డి బెయిల్ వచ్చాక మళ్లీ దళంలోకి వెళ్లారు. మంథని ప్రాంత కాంగ్రెస్ నాయకుడు దుద్దిళ్ల శ్రీపాదరావు హత్య కేసులో రాజిరెడ్డి నిందితుడు. తన అన్న రాజిరెడ్డి లొంగిపోయారన్న వార్త విన్నఅతని సోదరుడు భీంరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రాజిరెడ్డి మేనమామ కూతురు రత్తమ్మను వివాహం చేసుకున్నాడు. రాజిరెడ్డి ఆచూకీ కోసం పోలీసులు వేధిస్తుండటంతో రత్తమ్మ దళంలో చేరింది. ఆ తర్వాత వీరికి స్నేహలత అనే పాప పుట్టింది. స్నేహలత ఆరేళ్ల వయసులో మా వదిన మరణించడంతో పాపను ఎల్ ఎల్ బీ చదివించి మహదేవపూర్ మండలం అంబట్ పల్లిలో ప్రొఫెసర్ ఖాసింకు ఇచ్చి పెళ్లి చేశానని రాజిరెడ్డి సోదరుడు భీం రెడ్డి చెప్పారు.

అగ్రనేత గణపతి ఇల్లు పేల్చివేత

ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి స్వగ్రామం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బీర్ పూర్ గ్రామం. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉద్యోగాన్ని వదిలి అడవి బాట పట్టారు. బీర్ పూర్ లోని గణపతి ఇంటిని గతంలో పోలీసులు బ్లాస్ట్ చేశారు. దేవ్ జీ లొంగిపోవడంతో గణపతి భవితవ్యం ఏమిటనే విషయం చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టు పార్టీ చీఫ్ గా 14 ఏళ్లపాటు పనిచేసిన గణపతిపై రూ.2.5కోట్ల రివార్డు ఉంది. వయోభారంతోపాటు అనారోగ్యం వల్ల గణపతి నేపాల్ దేశంలో తలదాచుకున్నారని వార్తలు వచ్చాయి. మొత్తం మీద కరీంనగర్ జిల్లాకు చెందిన గణపతి మినహా మిగతా అగ్రనేతలంతా లొంగిపోయారు. మహారాస్ట్రలో లొంగిపోయిన మరో అగ్ర నేత మల్లోజుల వేణుగోపాల్ ది కూడా పెద్దపల్లి పట్ణణం.ఈయన సోదరుడు ఆలయ పూజారి.

బీర్పూర్ మందుపాతర పేలుడు

1983వ సంవత్సరంలో కరీంనగర్ జిల్లా బీర్పూర్ ఘాట్ రోడ్డుపై అప్పటి నక్సలైట్లు మందుపాతర పేల్చారు. నాడు బీర్పూర్ లో నక్సలైట్లు ఒకరిని చంపి, పోలీసులను రప్పించి వారిని మందుపాతర ద్వారా చంపాలని వ్యూహం పన్నారని మాజీ అదనపు ఎస్పీ నర్సింగరావు నాటి ఘటన గురించి గుర్తు చేసుకున్నారు. మొట్టమొదటిసారి మందుపాతరను పేల్చిన నక్సలైట్లు జీపులో ప్రయాణిస్తున్న 13మంది చనిపోయారని ఆయన చెప్పారు.

ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో అలజడి

మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ సహా 16 మంది సభ్యులు ఆదిలాబాద్ అడవుల్లో తెలంగాణ పోలీసులకు లొంగిపోయినట్లు వచ్చిన వార్తలతో అలజడి రేగింది. కర్రెగుట్టల నుంచి వచ్చిన కీలక అగ్ర నేతలు లొంగిపోయేందుకు తెలంగాణ అటవీ బాట పట్టారు. ఆపరేషన్ కగార్ కు మార్చి 31వతేదీ గడువుతేదీ కావడంతో ఈ లోగా మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రాణహిత, పెనుగంగా, గోదావరి నదులు, కవాల్ అభయారణ్యం ఉండటంతో లొంగిపోయేందుకు సురక్షిత స్థావరమని మావోయిస్టు అగ్రనేతలు కర్రెగుట్టల నుంచి తెలంగాణ అడవుల్లోకి వచ్చారని సమాచారం.

పోరు వద్దు... ఊరు ముద్దు

రెండేళ్లలో లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం ఏర్పాటు చేయడంతో సగర్వంగా జీవిస్తున్నారని తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి చెప్పారు. పోరు వద్దు..ఊరు ముద్దు అంటూ డీజీపీ పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీలో మిగిలినవారు కూడా ఇదే బాటలో జనంలోకి రావాలని డీజీపీ బి శివధర్ రెడ్డి మరోసారి పిలుపునిచ్చారు.లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరపున కావాల్సిన సాయం అందిస్తామని డీజీపీ తెలిపారు. తెలంగాణ సీఎం ఎ రేవంత్ రెడ్డి పిలుపును అందుకొని గత రెండేళ్లలో రికార్డుస్ధాయిలో అంటే 588 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు.

చివరిదశకు చేరిన ఉద్యమం

ఒకప్పుడు అడవుల్లో సిద్ధాంతాల కోసం తుపాకీ మోసిన నేతలు, ఇప్పుడు సమాజంలో సాధారణ జీవితం వైపు అడుగులు వేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వెలిసిన మావోయిస్టు అగ్రనేతల కథ, ఒక ఉద్యమం ఎలా ఆవిర్భవించిందో… ఎలా క్షీణించిందో చెప్పే చరిత్రగా మిగిలిపోనుంది. ఆపరేషన్ కగార్ తర్వాత ఉద్యమం చివరి దశకు చేరిందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
దశాబ్దాలుగా ఎదురుచూసిన మావోయిస్టు కుటుంబాలకు ఇది పండుగ వేళ. తుపాకీ మోతల మధ్య గడిచిన జీవితాలు, ఇప్పుడు కుటుంబాల కౌగిలిలో కలవబోతున్నాయి. “పోరు వద్దు… ఊరు ముద్దు” అన్న పిలుపు కేవలం నినాదంగా కాకుండా, అడవుల నుంచి ఊర్లకు వస్తున్న అడుగుల్లో ప్రతిధ్వనిస్తోంది. కరీంనగర్ నేల ఒక దశ విప్లవోద్యమానికి సాక్షిగా నిలిచిపోతుంది.
Read More
Next Story