
నా భర్త జాడ కనిపెట్టాలంటూ ప్యాట విజయకుమార్ భార్య జ్యోతి వినతి
కూలీ కోసం వెళ్లి కారాగారం : మలేషియాలో తెలంగాణ కార్మికుల కన్నీటి కథ
ఏజెంట్ల మోసాలు…మలేషియాలో తెలంగాణ కార్మికుల దుర్దశ
కుటుంబానికి మంచి జీవితం అందించాలనే ఆశతో విదేశాలకు వెళ్లిన తెలంగాణ కార్మికుల కలలు మలేషియాలో కష్టాలుగా మారుతున్నాయి. ఉపాధి కోసం వెళ్లిన కొందరు కార్మికులు అనుకోని కేసుల్లో చిక్కుకుని అక్కడి జైళ్లలో మగ్గుతుండగా, మరికొందరు గల్లంతవడం, మరికొందరు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం వంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయాయి.
కూలీగా వెళ్లి కారాగారం పాలయ్యాడు...
సిద్ధిపేట జిల్లా భూంపల్లి అక్బర్ పేట మండలం పోతారెడ్డిపేట గ్రామానికి చెందిన ముహమ్మద్ అబ్దుల్ ఖాదర్ 2018వ సంవత్సరం నుంచి ఉపాధి కోసం వలస వెళ్లి మలేషియా దేశంలో వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. కూలీగా పనిచేసేందుకు వెళ్లిన ముహమ్మద్ అబ్దుల్ ఖాదర్ యువతిపై లైంగిక వేధింపుల కేసులో జైలు పాలయ్యాడు. ఈ కేసులో ఇప్పటికే ఆరుసార్లు విచారణ జరిగింది.
అసలు ఏం జరిగిందంటే...
2025వ సంవత్సరం జనవరి 1వతేదీన మలేషియా దేశంలోని కెదాలోని బాలింగ్ సమీపంలో కూలీ ముహ్మద్ అబ్దుల్ ఖాదర్ దుకాణం నుంచి తిరిగి వస్తుండగా మతి స్థిమితం లేని ఒక యువతి తన చేయి పట్టుకుంది.ఖాదర్ పారిపోయి యువతి నుంచి దూరంగా వెళ్లేందుకు ప్రయత్నించగా యువతి అరుస్తూ తన తండ్రికి ఫోన్ చేసింది. తర్వాత యువతిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై ఖాదర్ ను మలేషియా పోలీసులు 2025 జనవరి 7వతేదీన అరెస్టు చేశారు.
అన్యాయంగా జైలు పాలు చేశారు
ఖాదర్ ను కెదాలోని పోకోక్ సేన, సుంగై జైళ్లలో నిర్బంధించారు.తాను ఏ తప్పు చేయలేదని, మొత్తుకుంటున్నా ఖాదర్ ను జైలులోనే ఉంచారు. తన తండ్రిని అన్యాయంగా జైలులో ఉంచారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కెడా రాష్ట్రంలో జైలులో ఉన్న ఖాదర్ ను మలేషియా భారత కాన్సులర్ ఆర్. ఎస్. చౌహాన్ ఫిబ్రవరి 11వతేదీన కలిసి పరామర్శించారు. మలేషియాలోని కేడా రాష్ట్రంలోని సుంగై పెటాని జైలును సందర్శించిన అధికారి ఖాదర్ గురించి ఆరా తీశారు. తన తండ్రిని జైలు నుంచి విడుదల చేయించాలని అతని కుమారుడు సల్మాన్ ‘ఫెడరల్ తెలంగాణ’చెప్పారు.
విడుదల చేయించండి : కుమారుడు సల్మాన్ అభ్యర్థన
తన తండ్రి ముహమ్మద్ అబ్దుల్ ఖాదర్ ను జైలు నుంచి విడుదల చేయించి భారతదేశానికి తిరిగి పంపించడానికి చట్టపరమైన, దౌత్యపరమైన సహాయాన్ని అందించాలని అతని కుమారుడు షేక్ సల్మాన్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.ఖాదర్ కు భార్యతోపాటు ముగ్గురు పిల్లలున్నారు. తమ కుటుంబ పెద్ద అయిన తండ్రిని స్వదేశానికి తీసుకురావాలని సల్మాన్ అభ్యర్థించారు.తన భర్తను మలేషియా జైలు నుంచి విడుదల చేయించి స్వదేశానికి తరలించాలని ఖాదర్ భార్య సలీమా బేగం కోరారు. ఈ మేరకు తెలంగాణ ప్రజావాణిలో ఆమె ఇటీవల వినతిపత్రాన్ని అందజేశారు. ‘‘కట్టుకున్నోడు కారాగారం పాలయ్యాడు...నాకు కంటినిండా నిద్ర లేదు సీఎం రేవంత్ రెడ్డి, అధికారులు కనికరించి నా భర్తను విడిపించి రప్పించండి’’అంటూ సలీమాబేగం ప్రజావాణిలో మొర పెట్టుకున్నారు. తన భర్తకు సహోద్యోగితో ఘర్షణ జరగడంతో తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపించారని సలీమా బేగం ఆరోపించారు. ఏడాదికి పైగా జైలులో మగ్గుతున్న తన భర్తను విడిపించాలని ఆమె కోరారు.
మలేషియాలో మాయమయ్యాడు
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన ప్యాట విజయకుమార్ (38) 2025 మే నెలలో ఉపాధి కోసం మలేషియా దేశానికి వెళ్లాడు. కూలీగా పనిచేసేందుకు వెళ్లిన విజయకుమార్ వెళ్లిన వారం రోజుల పాటు భార్యతో మాట్లాడాడు. తాను పనిచేస్తున్నానని చెప్పాడు. కానీ తర్వాత మానసికంగా కుంగిపోయి అసహనంతో వ్యవహరిస్తున్నట్లు అక్కడి వారు చెప్పడంతో తన భర్తను తిరిగి విమానం ఎక్కించి పంపించాలని చెప్పి ఏజెంటుకు రూ. 30వేలు పంపించానని విజయకుమార్ భార్య ప్యాట జ్యోతి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. గత ఏడాది జూన్ 6 వతేదీ నుంచి నా భర్త జాడ లేదని జ్యోతి ఆవేదనగా చెప్పారు. తన భర్త ఆచూకీని కనుగొని స్వదేశానికి తిరిగి పంపించాలని కోరుతూ జ్యోతి తెలంగాణ ప్రజావాణికి కూడా ఫిర్యాదు చేశారు. మలేషియాలోని భారత రాయబార కార్యాలయ అధికారులకు తాను ఫిర్యాదు చేసినా ఇంత వరకు తన భర్త జాడ దొరకలేదని జ్యోతి కన్నీళ్లతో చెప్పారు.
పని చేసేందుకు వెళ్లి శవమై వచ్చింది...
ఇంట్లో పనిచేసేందుకు పనిమనిషిగా మలేషియా దేశానికి వెళ్లిన బొమ్మవరం శంకరమ్మ శవమై తేలారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాకు చెందిన శంకరమ్మకు భర్త వికలాంగుడు కాగా ఇద్దరు ఆడపిల్లలున్నారు. మలేషియాలో తల్లి మరణించడంతో వారి ఇద్దరు పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు. శంకరమ్మ గుండె సంబంధ వ్యాధితో మరణించినట్లు మలేషియా వైద్యులు ప్రకటించారు. శంకరమ్మ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం భారతదేశానికి పంపించారు. తన సోదరి మరణించినందున ఆమె కుటుంబానికి నష్టపరిహారం అందజేయాలని శంకరమ్మ సోదరుడు నర్సింహులు అభ్యర్థించారు. శంకరమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
తెలుగు కార్మికుల అవస్థలు
మలేషియాలో ఏజెంట్ల మాటలు నమ్మ డబ్బులిచ్చి ఉపాధిపై ఆశతో వచ్చిన తెలుగు కార్మికులు నానా అవస్థలు పడుతున్నారని ఫెడరేషన్ ఆఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కొందరు కార్మికులు రబ్బరు, పామాయిల్ తోటల్లో పనిచేస్తూ నానా దుర్భర జీవనం గడుపుతున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తెలుగు కార్మికులకు తమ సంఘం అండగా సేవలందిస్తుందని ఆయన వివరించారు.
మలేషియా జైళ్లలో దుర్భర పరిస్థితులు
మలేషియా జైళ్లలో ఉన్న విదేశీ ఖైదీలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న గదుల్లో ఎక్కువమంది ఖైదీలను ఉంచడం, సరైన ఆహారం ఇవ్వక పోవడం, వైద్య సదుపాయాలు తక్కువగా ఉండడం వంటి సమస్యలు ఉన్నట్లు ఖైదీల బంధువులు చెబుతున్నారు. కొందరు ఖైదీలు నెలల తరబడి తమ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం లేకుండా జైలు జీవితం గడుపుతున్నారని తెలుస్తోంది. భాషా సమస్యలు, న్యాయ సహాయం లేకపోవడం వల్ల భారతీయులు, ముఖ్యంగా కార్మికులు మరింత కష్టాలు పడుతున్నారని చెబుతున్నారు. దీంతో జైళ్లలో ఉన్న తెలంగాణ వాసుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.ఖైదీలతో వెట్టిచాకిరి చేయించడంతోపాటు వారిని జైలు అధికారులు కొడుతున్నారని ఖైదీల కుటుంబసభ్యులు చెబుతున్నారు.
మలేషియాలో నిర్మాణ రంగం, ఫ్యాక్టరీలు, ప్లాంటేషన్లలో వేలాది మంది భారతీయులు, ముఖ్యంగా తెలంగాణ కార్మికులు పనిచేస్తున్నారు. అయితే సరైన ఒప్పందాలు లేకపోవడం, మధ్యవర్తుల మోసాలు, యజమానుల దుర్వినియోగం వంటి కారణాల వల్ల కొందరు చట్టపరమైన సమస్యల్లో పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కు చెందిన భారతీయ కార్మికులు మలేషియా లో పనిచేస్తున్నారు, ఇక్కడ ఏజెంట్ల చేతిలో మోసపోయి అక్రమ కార్మికులుగా నివసిస్తున్నారు .
మలేషియా జైళ్లలో ప్రస్తుతం 338 మంది భారతీయులు మలేషియా జైళ్లలో ఉన్నట్లు పార్లమెంటరీ నివేదికలో వెల్లడైంది.మరో ప్రభుత్వ సమాచార ప్రకారం సుమారు 341 మంది భారతీయులు మలేషియా జైళ్లలో ఉన్నారని కూడా పేర్కొన్నారు.ప్రపంచవ్యాప్తంగా 10,000 మందికి పైగా భారతీయులు 80కి పైగా దేశాల జైళ్లలో ఉన్నారని విదేశాంగ శాఖ తెలిపింది.
విదేశాల్లో భారతీయులు జైళ్లలో పడడానికి ప్రధాన కారణాలు:
వీసా నిబంధనలు ఉల్లంఘించడం
డ్రగ్స్ / అక్రమ రవాణా కేసులు
ఉద్యోగ వివాదాలు
స్థానిక చట్టాలపై అవగాహన లేకపోవడం
మధ్యవర్తుల మోసాలు
ముగియనున్న మలేషియా ఆమ్నెస్టీ (క్షమాభిక్ష)పథకం
ఉపాధి కోసం మలేషియా దేశానికి వచ్చి అనివార్యమైన పరిస్థితుల్లో ఇబ్బందుల్లో చిక్కుకొని స్వదేశానికి రాలేని అక్రమ వలసదారులకు మలేషియా ప్రభుత్వం మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) ప్రకటించింది. ఈ పథకం కింద వచ్చే నెల ఏప్రిల్ 30వ తేదీన ముగుస్తుంది.ఈ గడువు లోపు పాస్ పోర్ట్ లేకుండా ఉన్నవాళ్లు ,వర్క్ పర్మిట్ వీసాల గడువు ముగిసినవారు మలేషియా వదిలి వెళ్ళినట్లయితే వారు ఎటువంటిచట్టపరమైన ఇబ్బందులు లేకుండా భారత్‌కు వెళ్ళవచ్చునని ఫెడరేషన్ ఆఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ఈ ఆమ్నెస్టీ ద్వారా తమస్వదేశాలకు వెళ్లే వారు 500 రింగ్గిట్మలేషియా (ఇండియన్ కరెన్సి లో రూ 10000) చెలించాల్సివుంది. అలాగే వారు పాసుపోర్టు,పాసుపోర్టు లేని వారు ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికెట్, సొంతంగావారం రోజుల్లో వెళ్లే విధంగా ఫ్లైట్ టికెట్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆమ్నెస్టీ సంబంధించి ఏదైనా సహాయం కావాల్సిన వారు ఫెడరేషన్ ఆఫ్ ఎన్నారై కల్చరల్అసోసియేషన్స్ , మలేషియాను info@fnca.com.my orwebsite www.fnca.com.my సంప్రదించాలనిప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి కోరారు.
విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన కార్మికులు ఇలాంటి ఇబ్బందుల్లో చిక్కుకోవడం ఆందోళనకర పరిస్థితిని సూచిస్తోంది. సరైన సమాచారం లేకుండా మధ్యవర్తులను నమ్మి విదేశాలకు వెళ్లడం, స్థానిక చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మంది కార్మికులు కష్టాల్లో పడుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మలేషియాలో జైళ్లలో ఉన్న భారతీయులకు న్యాయ సహాయం అందించడం, గల్లంతైన వారి ఆచూకీ కనుగొనడం, మోసపూరిత ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవడం అవసరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విదేశాల్లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చొరవ చూపాలని కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విదేశీ ఉపాధి కోసం వెళ్లే కార్మికులకు సరైన అవగాహన, భద్రత కల్పించే వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ ఘటనలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.
Next Story

