గోల్డ్‌ రష్‌.. ఎల్లుండి నుంచే!
x

గోల్డ్‌ రష్‌.. ఎల్లుండి నుంచే!

మరోసారి బంగారు బాండ్లు తెరపైకి వచ్చాయి. గతంలో విడుదల చేసినప్పుడు ఎంతో ఆదరణ పొందిన ఈ గోల్డ్‌ బాండ్లను మరోసారి విడుదల చేయాలని రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్ ఇండియా నిర్ణయించింది.


మరోసారి బంగారు బాండ్లు తెరపైకి వచ్చాయి. గతంలో విడుదల చేసినప్పుడు ఎంతో ఆదరణ పొందిన ఈ గోల్డ్‌ బాండ్లను మరోసారి విడుదల చేయాలని రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ఫిబ్రవరి 12 నుంచి 16వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సబ్‌స్క్రిప్షన్‌ అందుబాటులో ఉంటుంది. ఒక్కో గ్రాము ధరను రూ.6,263గా ఆర్‌బీఐ నిర్ణయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వస్తున్న నాలుగో సిరీస్‌ (2023-24 సిరీస్‌ IV) ఇది. ఈ ఏడాది జూన్‌, సెప్టెంబర్, డిసెంబర్‌లో మూడు విడతలుగా బాండ్లను విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌ ఇస్తారు. అంటే ఒక్కో గ్రాము రూ.6,213కే లభిస్తుంది.

2015లో వచ్చిన పథకం ఇది...

దేశంలో బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న ఉద్దేశంతో 2015 నవంబర్‌లో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. సబ్‌స్క్రిప్షన్‌ ముందు వారం చివరి మూడు పనిదినాల్లో 999 స్వచ్ఛత కలిగిన బంగారానికి ఇండియా బులియన్‌ అండ్‌ జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌ నిర్ణయించిన సగటు ధర ఆధారంగా గ్రాము రేటును నిర్ణయిస్తారు. కనీసం 1 గ్రాము ఒక యూనిట్‌ కింద కొనుగోలు చేయాల్సిఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు గరిష్ఠంగా 4 కేజీల వరకు కొనుగోలు చేయొచ్చు. ట్రస్టులైతే 20 కేజీల వరకు కొనొచ్చు. ఈ బాండ్‌ పీరియడ్‌ 8 ఏళ్లు. గడువు ముగిశాక అప్పటి ధరను చెల్లిస్తారు. ఐదేళ్ల తర్వాత కావాలంటే వైదొలగవచ్చు. భౌతిక బంగారం కొనుగోలుకు ఉన్న కేవైసీ నిబంధనలే దీనికీ వర్తిస్తాయి.

స్టాక్‌ ఎక్స్చేంజీల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి...

షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు, పోస్టాఫీలు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, క్లియరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, గుర్తింపు పొందిన స్టాక్‌ ఎక్స్చేంజీల (NSE, BSE) ద్వారా SGB కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిపై వడ్డీ ఇష్యూ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. బాండ్‌ నామమాత్రపు విలువపై సంవత్సరానికి 2.50% ఫిక్స్‌డ్‌ రేటుతో అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. బాండ్ల కాలవ్యవధి 8 ఏళ్లు. బాండ్ల మెచ్యూరిటీపై వచ్చే మూలధన లాభాలపై SGB పన్ను మినహాయింపును అందిస్తుంది. మూడేళ్ల ముందు బాండ్లను విక్రయిస్తే.. స్వల్పకాలిక మూలధన లాభాల కింద మీకు వర్తించే శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. భౌతిక బంగారంతో పోలిస్తే సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ కొనుగోలులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బంగారం కొనుగోలులో సాధారణంగా వర్తించే మేకింగ్‌, జీఎస్టీ వంటి అదనపు ఛార్జీలు గోల్డ్‌బాండ్ల విషయంలో ఉండవన్నది గమనించాలి. చోరీ భయం అసలే ఉండదు. కాబట్టి బంగారంలో పెట్టుబడి పెట్టేవారు గోల్డ్‌ బాండ్లను పరిశీలించొచ్చు.


ఆన్‌లైన్‌లో కొనుగోలు ఎలా?

మీ నెట్‌బ్యాంకింగ్‌కు (ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పీఎన్‌బీ, ఐసీఐసీఐ బ్యాంక్‌) లాగిన్‌ అవ్వండి. మెనూలో ఈ సర్వీసెస్/ ఇన్వెస్ట్‌మెంట్‌ అనే సెక్షన్‌లో ‘సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌’ ఆప్షన్‌ ఎంచుకోండి. (స్కీమ్‌ అందుబాటులో ఉన్నప్పుడు ఈ విండో తెరుచుకుంటుంది). టర్మ్స్‌ అండ్‌ కండీషన్స్‌ చదివి తర్వాత ప్రొసీడ్‌పై క్లిక్‌ చేయండి. సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌కు అవరమైన వివరాలు ఇచ్చి డిపాజటరీ పార్టిసిపేట్‌ (ఎన్‌ఎస్‌డీఎల్‌ లేదా సీడీఎస్‌ఎల్‌)ను ఎంచుకోండి. తర్వాత రిజిస్ట్రేషన్‌ ఫారాన్ని సమర్పించండి.

రిజిస్ట్రేషన్‌ తర్వాత పర్చేజ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న యూనిట్లు, నామినీ వివరాలు ఇవ్వాలి. మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయడం ద్వారా ప్రక్రియ పూర్తవుతుంది.

ఇలా కూడా చేయొచ్చు..

నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా మాత్రమే కాకుండా ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ వెబ్‌సైట్‌, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (SHCIL), స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి కూడా కొనుగోలు చేయొచ్చు. ఒకవేళ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయలేనివారు దగ్గర్లోని బ్యాంక్‌ శాఖ, ఎంపిక చేసిన పోస్టాఫీసుకు వెళ్లి ఫారాన్ని నింపాల్సి ఉంటుంది. మీకు కావాల్సిన యూనిట్లను అందులో పొందుపరిచి చెక్‌, డీడీ రూపంలో పేమెంట్‌ పూర్తి చేయాలి. ఆధార్‌, పాన్‌ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.

Read More
Next Story