
ప్రయాణీకులకు ‘సంక్రాంతి’ గుడ్ న్యూస్
ఇతర జిల్లాలకు అలాగే ఇతర రాష్ట్రాలకు ప్రయాణీకులు వెళ్ళటానికి యాజమాన్యం 6,431 బస్సులను ఏర్పాటుచేసింది
సంక్రాంతి పండుగకు సొంతూళ్ళకు వెళ్ళేవాళ్ళకు టీజీఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సందర్భంగా పెరగబోయే రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ(TGRTC) యాజమాన్యం సుమారు 6 వేల బస్సులను అందుబాటులోకి తెచ్చింది. జనవరి 9వ తేదీనుండి 13వ తేదీమధ్య అలాగే జనవరి 18,19 తేదీల్లో ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండబోతున్నాయి. హైదరాబాద్(Hyderabad) నుండి ఇతర జిల్లాలకు అలాగే ఇతర రాష్ట్రాలకు ప్రయాణీకులకు వెళ్ళటానికి యాజమాన్యం 6,431 బస్సులను ఏర్పాటుచేసింది. అయితే ఇక్కడే యాజమాన్యం చిన్న మెలిక పెట్టింది. అదేమిటంటే మామూలు ఛార్జీలకు అదనంగా టికెట్ పై 50శాతం అదనపు చార్జీలు వసూలు చేయబోతున్నట్లు తెలిపింది.
హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరామ్ గఢ్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయినపల్లి, గచ్చిబౌలి తదితర స్టేషన్ల నుండి ప్రత్యేకబస్సులు బయలుదేరుతాయని యాజమాన్యం తెలిపింది. ప్రయాణీకుల సౌకర్యార్ధం తాగునీటి వసతి, మొబైల్ టాయ్ లెట్స్, కూర్చునేందుకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు, బస్సు రాకపోకలు తెలిసేలా అనౌన్స్ మెంట్ వ్యవస్ధలను సిద్ధం చేసింది. ప్రయాణీకుల కోసం కొన్ని స్టేషన్లలో తాత్కాలిక షెల్టర్లను కూడా యాజమాన్యం ఏర్పాటుచేసింది. సంక్రాంతి సందర్భంగా మహిళలకు ఇప్పుడున్నట్లే ఉచిత సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
ఇక పండుగలకు సొంతూళ్ళకు వెళ్ళే వాళ్ళు ఇళ్ళకు తాళాలను జాగ్రత్తగా వేసుకోవాలని పోలీసులు సూచించారు. దొంగల విషయంలో అందరు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పండుగల సమయంలో పోలీసు పెట్రోలింగును కూడా పెంచుతున్నట్లు పోలీసులు తెలిపారు. కాలనీల్లో సీసీటీవీలను ఏర్పాటుచేసుకోవాలని, గస్తీ ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసు అధికారులు జాగ్రత్తలు తెలిపారు.

