
వెలుగుమట్ల బాధితులకు శుభవార్త.. ఇంటి పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు
ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ బాధితులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 412 మందిని అర్హులుగా గుర్తించి ఇంటి పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్కడి నిరాశ్రయులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వెలుగుమట్ల ప్రాంతంలో నివసిస్తున్న వారి పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా ప్రత్యేక సర్వే నిర్వహించారు. భూదాన్ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న వారిలో నిజంగా అర్హులు ఎవరన్న విషయాన్ని అధికారులు పరిశీలించారు. ఈ సర్వేలో మొత్తం 766 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు. వారిలో అర్హులైన కుటుంబాలను ప్రత్యేకంగా గుర్తించి జాబితా సిద్ధం చేశారు.
412 మందికి అర్హత
సర్వే ఫలితాల ప్రకారం 766 మందిలో 412 మందిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది. వీరిలో 311 మందికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. మరో 101 మందికి ఇందిరమ్మ ఇల్లు మాత్రమే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన కుటుంబాలను పిలిపించి రెవెన్యూ అధికారులు టోకెన్లు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.
వెలుగుమట్లలో అర్హులైన కుటుంబాలకు అధికారికంగా పత్రాలు అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పట్టాలు, మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నారు.
వెలుగుమట్ల భూదాన్ భూముల సమస్యపై ఇటీవల నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ నిర్ణయం కీలకంగా మారింది. బాధితులకు నివాస భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యగా దీనిని అధికారులు పేర్కొన్నారు.
అసలు వెలుగుమట్ల భూ వివాదం ఏంటి?
ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల ప్రాంతంలో ఉన్న భూదాన్ భూములపై చాలా ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. భూమి యాజమాన్యం, అక్కడ నివసిస్తున్న పేదల హక్కులు, ప్రభుత్వ చర్యలే ఈ సమస్యకు కారణమయ్యాయి. వెలుగుమట్లలో ఉన్న భూములు భూదాన్ కింద నమోదైనవిగా చెబుతారు. కాలక్రమంలో అక్కడ పేద కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవించడం మొదలుపెట్టాయి. కొందరు మధ్యవర్తులు లేదా నాయకులు ఈ భూములు తమకు కేటాయించబడ్డాయని చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. కానీ అధికారిక పట్టాలు ఇవ్వలేదని బాధితులు చెబుతున్నారు.
వివాదానికి బీజం ఎక్కడ పడింది?
ఫిబ్రవరి 24న అధికారులు ఈ భూములు ప్రభుత్వానికి చెందినవని పేర్కొంటూ అక్కడ నివసిస్తున్న వారిని ఖాళీ చేయించారు. రెవెన్యూ, పోలీసు సిబ్బంది కలిసి గుడిసెలను తొలగించారు. దీంతో అక్కడ నివసిస్తున్న కుటుంబాలు ఒక్కసారిగా నిరాశ్రయులయ్యాయి. ఈ చర్యతో విషయం పెద్ద వివాదంగా మారింది. ఈ భూముల్లో దశాబ్దాలుగా జీవిస్తున్నామని బాధితులు చెబుతున్నారు. తమకు పట్టాలు ఇవ్వకుండా ఇప్పుడు బయటకు పంపడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నివాస హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఈ ఘటన తర్వాత ఖమ్మంలో నిరసనలు జరిగాయి. పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు బాధితులకు మద్దతు ప్రకటించాయి. పలువురు నేతలు అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించారు. దీంతో విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ అంశం రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపడంతో ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఇందులో భాగంగానే మంగళవారం సీఎం రేవంత్ అధ్యక్షతన అధికారులు సమావేశమయ్యారు. అందులో బాధితులకు పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో వెలుగుమట్ల భూ వివాదం కాస్త చల్లబడింది.

