
వర్కింగ్ ప్రొఫెషనల్స్ కు రేవంత్ ప్రభుత్వం శుభవార్త
రాష్ట్రంలోని 12 ఇంజనీరింగ్ కాలేజీల్లో 2026-27 విద్యాసంవత్సరం నుండే అడ్మిషన్లు మొదలుపెట్టేట్లుగా ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది
పాలిటెక్నిక్ కళాశాల్లో డిప్లొమా పూర్తిచేసిన వారికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అదేమిటంటే నైట్ కాలేజీల్లో పార్ట్ టైమ్ గా ఇంజనీరింగ్ చదవుకోవచ్చు. రాష్ట్రంలోని 12 ఇంజనీరింగ్ కాలేజీల్లో 2026-27 విద్యాసంవత్సరం నుండే అడ్మిషన్లు మొదలుపెట్టేట్లుగా ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. పార్ట్ టైమ్ బీటెక్ కోర్సులను నిర్వహించేందుకు 12 కాలేజీలు ముందుకొచ్చాయి. అనుమతులు పొందిన కాలేజీల్లో జేఎన్టీయూకి అనుబంధంగా ఉన్న 7 కాలేజీలు, ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా 5 కాలేజీల్లో ప్రస్తుత విద్యాసంవత్సరం నుండే తరగతులు ప్రారంభం అవబోతున్నాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్ట్ టైమ్ బీటెక్ కోర్సుల్లో చదివేందుకు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కు అవకాశం ఇచ్చిన కాలేజీలన్నీ ప్రైవేటు కాలేజీలు మాత్రమే. జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీల పరిధిలో ఉన్న ప్రభుత్వ కాలేజీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా పార్ట్ టైమ్ బీటెక్ నిర్వహించేందుకు ముందుకు రాకపోవటం విచిత్రంగానే ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల ఫీజుల్లో బాగా వ్యత్యాసాలు ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. పై రెండు యూనివర్సిటీల పరిధిలోని ప్రభుత్వ కళాశాలల్లో ఏడాది బీటెక్ ఫీజు రు. 50 వేలుంటే ప్రైవేటు కాలేజీల్లోని ఫీజులు సుమారు రు. 1.5 లక్షల నుండి రు. 2 లక్షలుంటుంది.
పార్ట్ టైమ్ బీటెక్ కోర్సుల నిర్వహణకు టీచింగ్ స్టాఫ్ కొరతను సాకుగా చూపించి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు పార్ట్ టైమ్ బీటెక్ కోర్సుల నిర్వహణకు పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం. నిజంగానే టీచింగ్ స్టాఫ్ ను నియమించుకోవాలంటే పెద్ద కష్టంకాదు. అన్నీ అర్హతలు ఉన్న ప్రొఫెసర్లు చాలామందే దొరుకుతారు. అయినా ఏవో కారణాల వల్ల పార్ట్ టైమ్ బీటెక్ కోర్సుల నిర్వహణను వద్దనుకున్నాయంతే.
వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి, సెయింట్ పీటర్స్, సిద్దార్ధ ఇనిస్టిట్యూట్, ఎంజీఐటి, జయప్రకాశ్ నారాయణ, అనుబోస్, అబ్దుల్ కలాం, ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్, మెథడిస్ట్, స్టాన్లీ ఉమెన్స్ కాలేజీ, సీబీఐటీ, మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీల్లో పార్ట్ టైమ్ బీటెక్ కోర్పులు మొదలవబోతున్నాయి. అవకాశాన్ని బట్టి ఈ కాలాజీల్లో సీఎస్ఈ, త్రిబుల్ ఈ, సివిల్, మెకానికల్, ఈసీఈ, ఈసీ, డేటాసైన్స్, సీఎస్ఈ కోర్సుల్లో 15 నుండి 30 సీట్ల భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. వివిధ కంపెనీలు, ప్రభుత్వ శాఖల్లో డిప్లొమా, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల భర్తీలోను, జీత, బత్యాలు, ప్రమోషన్లలో చాలా తేడాలుంటాయని అందరికీ తెలిసిందే. అన్నింటిలోను మొదటి ప్రాధాన్యతగా బీటెక్ చదివినవారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని తెలిసిందే.
ఇంజనీరింగ్ చదవలేక పాలిటెక్నిక్ తో సరిపెట్టుకున్న వారికి ఉద్యోగం చేసుకుంటు పార్ట్ టైమ్ బీటెక్ చదువుకోవటం అన్నది చాలామంచి అవకాశమనే చెప్పాలి. మరి ఎంతమంది సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.

