
గట్టికల్ గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తూ ప్రతిన పూనిన ప్రజలు
మద్యానికి గుడ్‌బై: కౌకుంట్ల గ్రామస్థుల నిర్ణయం
మద్యం అమ్మితే లక్ష జరిమానా కౌకుంట్ల వార్నింగ్
ఏప్రిల్ 14వతేదీన రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం కౌకుంట్ల గ్రామంలో ఒక వింత జరుగబోతున్నది.రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ రోజు నుంచి కౌకుంట్ల గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయాలని గ్రామస్థులు నిర్ణయించారు.కౌకుంట్ల గ్రామంలో బెల్టు షాపులు మూసివేసి సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయాలని స్థానిక సర్పంచ్ మల్లారెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి సునీత, పంచాయతీ సభ్యులు, యువజన సంఘాల సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సంపూర్ణ మద్య నిషేధం గురించి గ్రామస్థులు చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని ఎక్సైజ్, పోలీసు అధికారులకు పంపించామని కౌకుంట్ల గ్రామ కార్యదర్శి సునీత చెప్పారు. గ్రామంలో సంపూర్ణ మద్యనిషేధం గురించి టాంటాం వేయిస్తామని ఆమె తెలిపారు.
మద్యం అమ్మితే రూ.లక్ష జరిమానా
కౌకుంట్ల గ్రామం మండల కేంద్రం చేవెళ్లకు సుమారు 18 కిలోమీటర్ల దూరానా ఉంటుంది. ఇది మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సొంత ఊరు కూడా. గ్రామం జనాభా 2500. గ్రామంలో మద్యం అమ్మితే రూ. లక్ష, కొంటే రూ.50వేల జరిమానా విధించాలని గ్రామస్థులు నిర్ణయించారు. మద్యం విక్రయిస్తున్న సమాచారం ఇచ్చిన వారికి రూ.10వేల బహుమతి ఇవ్వాలని గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానించారు.కౌకుంట్ల గ్రామంలో గతంలో రెండు బెల్టు షాపులుండేవని, వీటిని ఏప్రిల్ 14 నుంచి మూసివేపిస్తున్నామని స్థానిక సర్పంచ్ మల్లారెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
బెల్టు షాపులతో నేరాలు
గ్రామాల్లో మద్యం బెల్టు షాపుల వల్ల నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న బెల్టుషాపుల వల్ల తీరని నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో మద్యం విక్రయాలను నిరోధించడానికి బెల్టు షాపులను మూసివేయాలని ఆయన కోరారు. గ్రామాల్లో క్రైంరేటు పెరగడానికి కారణమైన బెల్టు షాపులను మూసివేయిస్తామని చేవేళ్ల పోలీసులు ప్రకటించారు. బెల్టు షాపులపై తమకు ఫిర్యాదులు వస్తే వాటిని మూసివేయిస్తామని ఎక్సైజ్ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
మద్యంతో తగాదాలు
కౌకుంట్ల గ్రామంలో వెలసిన బెల్టు షాపుల గ్రామస్థులకు మద్యం ఎల్ల వేళలా అందుబాటులోకి వచ్చింది. దీనితో మద్యం తాగి పలువురు అనారోగ్యం బారిన పడ్డారు. కొందరైతే ప్రాణాలు కోల్పోయారు. మద్యం మహమ్మారి వల్ల గ్రామంలో పలువురు మృత్యువాత పడటంతో పలు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గ్రామంలో బెల్టు షాపుల వల్ల కూలీలు, యువకులు మద్యం తాగడం వల్ల తరచూ తగాదాలు జరుగుతున్నాయని, గ్రామ ప్రశాంతంగా ఉండేందుకు బెల్టు షాపులు ఎత్తివేయడం చాలా అవసరమని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు జి అనూష చెప్పారు.
బెల్టు షాపుల భరతం పట్టిన చెట్లముకుందాపురం గ్రామం
సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం చెట్ల ముకుందాపురం గ్రామంలో బెల్ట్ షాపుల భరతం పట్టారు. గ్రామంలో ఎక్కువగా ఉన్న కూలీలు చుట్టుపక్కల తండాలో దొరికే నాటుసారా, మద్యానికి బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. దీంతో గ్రామస్థులు మద్యం తాగితే రూ.500, అమ్మినవారికి రూ.10 వేలు జరిమానా, వారిని పట్టించిన వారికి రూ.వేయి బహుమతి అందిస్తామని గ్రామ పెద్దలు తీర్మానం చేశారు. ఈ మేరకు గ్రామస్థులు ప్రమాణం చేశారు.
దుర్గంచెరువులో సంపూర్ణ మద్యపాన నిషేధంపై దండోరా
వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలంలోని దుర్గంచెరువు గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధంపై దండోరా వేశారు. గ్రామస్థుల ఆరోగ్యం, కుటుంబాల ఆర్థిక అభివృద్ధి, శాంతిభద్రతలను మెరుగుపరచడమే లక్ష్యంగా గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తూ పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
గంగాపూర్ గ్రామసభ తీర్మానం
బచ్చన్నపేట మండలం గంగాపూర్ గ్రామంలో ఏప్రిల్ 10వతేదీ నుంచి మద్యపాన నిషేదాన్ని అమలు చేస్తున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ జిల్లెల్ల భాస్కర్ రెడ్డి ప్రకటించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99లో కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో మెజార్టీ ప్రజల ఆమోదం మేరకు నిర్ణయం తీసుకున్నారు.గ్రామంలో ఎన్నో కుటుంబాలు తాగుడుకు బానిసై, చిన్నాభిన్నం అవుతున్నాయని గ్రహించిన ప్రజలంతా ముందుకు వచ్చి, గ్రామంలో మద్యపాన నిషేధానికి నడుం బిగించారు. గ్రామసభ తీర్మానం కాదని గ్రామంలో మద్యం విక్రయించిన వారికి పంచాయతీ ఆధ్వర్యంలో రూ.50 వేల జరిమానా విధిస్తామని సర్పంచ్ హెచ్చరించారు.మద్యం విక్రయిస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టిస్తే రూ.5 వేల నజరానా అందిస్తామని వెల్లడించారు.
దెబ్బతింటున్న ప్రజారోగ్యం : డాక్టర్ లుబ్నా సార్వత్
మద్యం బెల్టు షాపుల వల్ల పల్లె ప్రజలు మద్యం తాగి అనారోగ్యం బారిన పడతున్నారని సామాజిక ఉద్యమకారిణి డాక్టర్ లుబ్నా సార్వత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పలుగ్రామాల్లో బెల్టు షాపులతో తగాదాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో జాతీయ రహదారిపై బెల్టు షాపుల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని మూసివేయించాలని కోరుతూ తాను జిల్లా కలెక్టరుకు తాను లేఖ రాయగా కలెక్టరు వాటిని మూసివేయించారని డాక్టర్ లుబ్నా చెప్పారు. తెలంగాణలోని కొన్ని గ్రామాల్లో ఇటీవల బెల్టు షాపులను మూసివేయించి సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయడం ప్రశంసనీయమని ఆమె చెప్పారు.మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో బెల్టు షాపులను నడిపితే తాము కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల హెచ్చరించారు. మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ముద్దాపురంలో మద్యం బంద్
వలిగొండ మండలం ముద్దాపురం గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని గ్రామపంచాయతీ నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి 26వతేదీ గణతంత్ర దినోత్సవం రోజు నుంచి గ్రామంలో బెల్టు షాపులు, హోటళ్ల ద్వారా మద్యం విక్రయాలను నిషేధించారు. గ్రామంలో ఎవరైనా తీర్మానాన్ని ఉల్లంఘిస్తే రూ.50వేల జరిమానా విధిస్తామని సర్పంచ్ సామ సరస్వతి రాంరెడ్డి చెప్పారు.సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం గట్టికల్ గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తూ ప్రజలు ప్రతిన బూనారు.
మద్యనిషేధం బాటలో పలు గ్రామాలు
మెదక్ జిల్లా మునిపల్లి మండలంలోని పెద్దలోడి (లోనికలాన్)లో మద్యపానంపై సంపూర్ణ నిషేధం విధించారు. సర్పంచ్ హన్మంత్ రాజు అధ్యక్షతన జరిగిన గ్రామసభలో మద్యపానాన్ని నిషేధిస్తూ తీర్మానం చేశారు. రామాయంపేట మండలం రాయిలాపూర్, డీ. ధర్మారం, వెంకటాపూర్, కొల్చారం, సిద్దిపేట జిల్లా అక్బర్ పేట, బొప్పాపూర్ గ్రామపంచాయతీల్లో మద్యాన్ని నిషేధిస్తూ పాలకవర్గాలు తీర్మానాలు చేశాయిసిద్దిపేట జిల్లా బొప్పాపూర్‌లో బెల్ట్ షాప్ నిర్వహిస్తే రూ.లక్ష జరిమానా విధించాలని తీర్మానించారు. రామాయంపేట మండలం డీ.ధర్మారంలో మద్యం అమ్మితే రూ.50 వేల జరిమానా, సమాచారం ఇచ్చిన వారికి రూ.10 వేల నజరానా ఇవ్వాలని నిర్ణయించారు. షాద్ నగర్ మండలంలోని కిషన్ నగర్, జేతురంతండా, తుర్కపల్లిగంగాదేవిపల్లి,సంగారెడ్డి జిల్లా కోర్పోల్ గ్రామాల్లో సంపూర్ణ మద్య నిషేధం అమలు అవుతోంది.
Next Story

