
ప్రైవేటు స్కూళ్ళ ఫీజులపై ప్రభుత్వం కీలక నిర్ణయం ?
ఫీజుల విషయంలో యాజమాన్యాలు విచ్చలవిడిగా వ్యవహరిస్తుండటంపై తల్లి, దండ్రుల్లో తీవ్ర ఆగ్రహం చాలాసార్లు బయటపడింది
ప్రైవేటు స్కూళ్ళలో ఫీజులపై సమాజంలోని చాలా వర్గాల్లో తీవ్రమైన అసంతృప్తి ఉన్న విషయం తెలిసిందే. విద్యను ఫక్తు వ్యాపారంగా మార్చేసిన యాజమాన్యాలు ఫీజుల విషయంలో తమిష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఫీజుల విషయంలో యాజమాన్యాలు విచ్చలవిడిగా వ్యవహరిస్తుండటంపై తల్లి, దండ్రుల్లో తీవ్ర ఆగ్రహం చాలాసార్లు బయటపడింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలు వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించాలని డిసైడ్ అయ్యింది. ఫీజులపై తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్టుతో పాటు వివిధ వర్గాలతో పాటశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించారు.
వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారం తర్వాత రెండేళ్ళకు ఒకసారి 8 శాతం మాత్రమే ఫీజులను పెంచాలని డిసైడ్ చేసింది. అయితే ప్రైవేటుస్కూళ్ళ యాజమాన్యాలేమో ప్రతి ఏడాదీ 10శాతం ఫీజుల పెంపుకు అనుమతి ఇవ్వాలని ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నాయి. రెండేళ్ళకు 8 శాతం ఫీజుల పెంపు నిర్ణయంపై తొందరలోనే అసెంబ్లీలో బిల్లుపెట్టి చట్టం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిపై ప్రైవేటు యాజమాన్యాలు భగ్గుమంటున్నాయి. విదేశీ పర్యటన నుండి రేవంత్ తిరిగిరాగానే సమావేశం అవ్వాలని ప్రైవేటు యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే చాలాకాలంగా ప్రైవేటు స్కూళ్ళల్లో ఫీజుల విషయమై పిల్లల తల్లి, దండ్రులు చాలా ఆందోళనలు చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంట ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలు మూడురకాలు. మొదటిదేమో బడ్జెట్ స్కూళ్ళు. రెండో రకం ఏమో కార్పొరేట్ స్కూళ్ళు. మూడోరకం ఇంటర్నేషనల్ స్కూళ్ళు. బడ్జెట్ స్కూళ్ళంటే రు. 10 వేల నుండి 40 వేల రూపాయల వరకు ఫీజులను వసూళ్ళు చేసేవి. కార్పొరేట్ స్కూళ్ళంటే రు. 50 వేల నుండి లక్షరూపాయల వరకు ఫీజులను వసూలుచేసేవి. ఫైనల్ గా ఇంటర్నేషనల్ స్కూళ్ళంటే లక్ష రూపాయల నుండి 3 లేదా 4 లక్షల రూపాయల ఫీజులను వసూళ్ళు చేసేవి.
10 వేల బడ్జెట్ స్కూళ్ళు
పైమూడురకాల స్కూళ్ళల్లో బడ్జెట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రం మొత్తంమీద బడ్జెట్ స్కూళ్ళు సుమారు 10 వేలవరకు ఉంటాయి. ఇపుడు విషయం ఏమిటంటే పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం తదితరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏడాది ఫీజులను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటు బడ్జెట్ స్కూళ్ళ యాజమాన్యాలు ప్రభుత్వాన్ని చాలాకాలంగా కోరుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం పెద్దగా సానుకూలంగా స్పందించలేదు. స్పందించకపోగా తమ అనుమతిలేకుండా యాజమాన్యాలు ఫీజులను పెంచేందుకు లేదని ఆదేశాలు జారీచేసింది. ఒకవేళ తమకు తెలియకుండా ఫీజులను పెంచుకుంటే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.
ప్రభుత్వ హెచ్చరికతో ఏమిచేయాలో తోచక తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్(ట్రాస్మా) పలుమార్లు సమావేశమైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. పీజుల పెంపు విషయమై ప్రభుత్వం 2024 జూలైలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ తో ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది. ఇదే విషయమై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా కమిషన్ ను కూడా నియమించింది. ఫీజుల నియంత్రణపై అధ్యయనంచేసిన కమిషన్ తెలంగాణ ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూల్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ పేరుతో ముసాయిదాను సిద్ధంచేసి ప్రభుత్వానికి అందించింది.
కమిషన్ అందించిన ముసాయిదాను మంత్రివర్గ ఉపసంఘం చర్చించి ప్రభుత్వానికి ఒక సిఫారసుచేసింది. అదేమిటంటే రెండేళ్ళకు ఒకసారి 8 శాతం ఫీజులను పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించాలని. అయితే దీన్ని ట్రాస్మా వ్యతిరేకిస్తోంది. ప్రతి ఏడాది తాము ఫీజులు పెంచుకునేందుకు అంగీకరించాల్సిందే అని పదేపదే డిమాండ్లు చేస్తోంది. రేవంత్ ను కలవటానికి ప్రయత్నిస్తే బిజీగా ఉన్న కారణంగా అపాయిట్మెంట్ దొరకలేదు. రేవంత్ దావోస్ కు వెళ్ళి అక్కడినుండి అమెరికాకు వెళ్ళి ఫిబ్రవరి మొదటివారంలో హైదరాబాద్ కు తిరిగొస్తారు. రేవంత్ తిరిగిరాగానే కలవాలని ట్రాస్మా ముఖ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఫీజులు పెంపుకు అనుమతివ్వాలి : శివరాత్రి
ప్రతి ఏడాది ఫీజులు పెంచుకునేందుకు తమకు అనుమతి ఇవ్వాలని ట్రాస్మా రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి చెప్పారు. తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న ఈరోజుల్లో రెండేళ్ళకు ఒకసారి ఫీజులు పెంచుకోవాలనే ఆదేశాల వల్ల తమకు చాలా ఇబ్బందులు వస్తాయి’’ అని అన్నారు. ‘‘ట్రాస్మాలో బడ్జెట్ స్కూళ్ళు సుమారు 10 వేల వరకు ఉన్నాయి’’ అని తెలిపారు. ‘‘ఫీజులను 10శాతంకు పెంచుకునే వెసులుబాటు ప్రతి ఏడాది ఇవ్వకపోతే ఉపాద్యాయులకు సరైన జీతాలను ఇవ్వలేమని, పిల్లలకు సౌకర్యాలను కల్పించలేము’’ అని అన్నారు. ‘‘కాబట్టి ప్రస్తుత పరిస్ధితులను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏడాది ఫీజులను పెంచుకునే వెసులుబాటు కల్పించాలి’’ అని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ‘‘విదేశీ పర్యటన నుండి ముఖ్యమంత్రి రేవంత్ తిరిగిరాగానే ట్రాస్మా ముఖ్యులం కలిసి తమ సమస్యలను వివరిస్తాము’’ అని చెప్పారు. 10వేల బడ్జెట్ స్కూళ్ళల్లో సుమారుగా 35 లక్షలమంది విద్యార్ధులు చదువుతున్నట్లు శివరాత్రి యాదగిరి తెలంగాణ ఫెడరల్ కు వివరించారు.

