మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు
x
Medaram Sammakka and Saralamma

మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు

జాతరకు సుమారు 3 కోట్లమంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేసింది.


ఈనెల 28వ తేదీన మొదలవబోతున్న మేడారం జాతర సమ్మక్క-సారలమ్మకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం(Revanth) భారీ ఏర్పాట్లు చేస్తోంది. 28వ తేదీనుండి 31వ తేదీవరకు జరగబోయే జాతరకు సుమారు 3 కోట్లమంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేసింది. (Telangana)తెలంగాణతో పాటు ఛత్తీస్ ఘడ్, ఝార్ఖండ్, ఒడిస్సా, మహారాష్ట్ర, ఏపీ, అస్సాం తదితర రాష్ట్రాలనుండి కూడా పెద్దఎత్తున గిరిజనులు జాతరకు హాజరవుతారు. (Medaram Festival)జాతరలో పాల్గొనేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 21శాఖల్లోని 42,027 మంది సిబ్బంది 24 గంటలూ విధుల్లో ఉండబోతున్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా 2 వేలమంది ఆదివాసీ వాలంటీర్లను కూడా ప్రభుత్వం రంగంలోకి దింపబోతోంది. పరిపాలనా విభజన కోసం మేడారం ప్రాంతాన్ని 8 జోన్లు, 42 సెక్టార్లుగా రేవంత్ ప్రభుత్వం విభజించింది. నిరంతర కమ్యూనికేషన్ కోసం 27 శాశ్వత మొబైల్ టవర్లను ఏర్పాటుచేసింది. అలాగే తాత్కాలికంగా మరో 33 మొబైల్ టవర్లను కూడా ఏర్పాటుచేసింది. 450 వీహెచ్ఎఫ్ సెట్లను కూడా అందుబాటులో ఉంచుతోంది.

వందల ఎకరాల్లో పార్కింగ్


రవాణా-పార్కింగ్ కోసం 42 పార్కింగ్ స్ధలాలను ఏర్పాటుచేసింది. 1418 ఎకరాల్లో వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లను చేసింది. 4 వేల బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొస్తోంది. అన్నీ బస్సులు కలిపి సుమారు 51 వేల ట్రిప్పులు తిరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్టీసీకి చెందిన 10,441 మంది సిబ్బందిని యాజమాన్యం విధుల్లో ఉంచబోతోంది. భక్తులకు మంచినీటి సౌకర్యం కోసం 5482 కొళాయిలను ఏర్పాటుచేసింది. జంపన్నవాగు దగ్గర భక్తులు స్నానం చేసిన తర్వాత డ్రెస్సింగ్ గదులను కూడా ఏర్పాటుచేసింది.

పారిశుధ్యం కోసం ప్రభుత్వం మొత్తం మేడారం ప్రాంతాన్ని 285 బ్లాకులుగా విభజించింది. 5700 టాయిలెట్లను ఏర్పాటుచేసింది. 5 వేలమంది పారిశుధ్య సిబ్బంది విధుల్లో ఉండబోతున్నారు. వాడుకనీరు, మంచినీటికి 150 ట్యాంకర్లు, 150 ట్రాక్టర్లను అందుబాటులోకి తెచ్చింది. చెత్తను ఊడ్చేందుకు 18 స్వీపింగ్ మెషీన్లు, 12 జేసీబీలు, 40 స్వచ్చ ఆటోలు, 16 డోజర్లను అందుబాటులోకి తెచ్చింది.

వందల ట్రాన్స్ ఫార్మార్లు

నిరంతర విద్యుత్ కోసం 196 ట్రాన్స్ ఫార్మార్లను బిగించింది ప్రభుత్వం. 24 గంటలూ విద్యుత్ సౌకర్యంకోసం 911 విద్యుత్ స్తంభాలను, 65.75 కిలోమీటర్ల నిడివి విద్యుత్ లైన్లను వేసింది. 350 మంది విద్యుత్ సిబ్బందిని అందుబాటులో ఉంచింది. ఎందుకైనా మంచిదనే ముందుచూపుతో బ్యాకప్ కోసం 28 భారీ జనరేటర్లను కూడా ఏర్పాటుచేసింది. జాతర జరిగే ప్రాంతమంతా వేలాది హై పవర్ లైట్లతో వెలిగిపోనున్నది.

జాతరలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సేవలు అందించేందుకు 5,192 మంది వైద్య సిబ్బందిని పోస్ట్ చేసింది. 30 అంబులెన్సులు, 50 పడకల సామర్ధ్యంతో ప్రధాన ఆసుపత్రిని ఏర్పాటుచేసింది. ప్రతిరోజు 30 మెడికల్ క్యాంపులను కూడా నిర్వహించబోతోంది. జంపన్నవాగు సమీపంలోనే ఉండటంతో ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా ముందుజాగ్రత్తగా 210 మంది గజ ఈతగాళ్ళను, 12 సింగరేణి రెస్క్యూ బృందాలను, 100 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను, 15 ఫైర్ బ్రిగేడ్ వాహనాలు, 268 మంది ఫైర్ ఫైటర్లను కూడా ప్రభుత్వం అందుబాటులోకి ఉంచింది.

కంట్రోల్ రూములు


ఆలయ ప్రాంగణం, గద్దెలు, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్, ఊరట్టం, శివరాం సాగర్, నర్లాపూర్, వడిగాపూర్ వంటి కీలక ప్రాంతాల్లో కంట్రోల్ రూములు, మిస్సింగ్ పర్సన్స్ క్యాంపులు, అత్యవసర స్పందనల కోసం కంట్రోల్ రూములను కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసింది. రోడ్లు, ఇంటర్నల్ రోడ్లతో పాటు కల్వర్టులను కూడా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేయించింది. ఏర్పాట్లను, జాతర పనులను గిరిజన సంక్షేమ, పంచాయితీ రాజ్ శాఖల మంత్రి, ములుగు ఎంఎల్ఏ ధనసరి అనసూయ @ సీతక్క దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

Read More
Next Story