ఎక్స్‌రే కిరణాల గుట్టు విప్పే పీఎస్‌ఎల్‌వీ- సీ 58
ఎక్స్-రే మూలాల గుట్టు విప్పేందుకు పీఎస్‌ఎల్‌వీ- సీ 58 బయలుదేరింది. అమెరికా తర్వాత మనమే ఇలాంటి ప్రయోగం చేపట్టాం.
భారతీయ అంతరిక్ష చరిత్రలో ఇస్రో మరో రికార్డ్ సృష్టించింది. పీఎస్‌ఎల్‌వీ సీ 58 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయింది. నూతన సంవత్సర వేళ ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం సక్సెస్ అయినట్టు చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. తిరుపతి జిల్లా సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్-షార్- నుంచి ఎక్స్‌రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను ప్రయోగించారు. పీఎస్‌ఎల్‌వీ- సీ 58 నుంచి మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల ఎక్స్‌పోశాట్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపారు. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్‌పోశాట్ నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది. ఆ తర్వాత రాకెట్‌లో నాలుగో స్టేజ్ అయిన పీఎస్-4... నిర్ణీత కక్ష్య నుంచి దిగువ కక్ష్యకు పంపుతారు. ఇందులో తిరువనంతపురం ఎల్‌బీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజ్ విద్యార్థినులు తయారుచేసిన విమెన్ ఇంజినీర్డ్ శాటిలైట్ సహా వివిధ ఉపకరణాలు ఉన్నాయి. వీటి సాయంతో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు.
ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది...
ఎక్స్‌పోశాట్ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్-రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుంది. గతంలో ప్రయోగించిన శాటిలైట్లన్నీ ఇమేజింగ్, టైం-డొమైన్ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కొపీపై ప్రధానంగా దృష్టి సారించాయి. ఈసారి ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ- సీ 58 మాత్రం ఎక్స్-రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. ఎక్స్-రే మూలాలను అన్వేషించడం ఎక్స్‌పోశాట్ లక్ష్యం. ఇలాంటి ప్రయోగం చేయడం అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తర్వాత భారత్‌దే. అమెరికా 2021లో ఐఎక్స్‌పీఈ పేరిట ఈ తరహా ప్రయోగం నిర్వహించింది. కాంతివంతమైన అంతరిక్ష ఎక్స్‌రే కిరణాల మూలాల సంక్లిష్టతను, అసాధారణ పరిస్థితుల్లో వాటి ప్రభావాన్ని ఎక్స్ పో శాట్ అధ్యయనం చేయనుంది. ఈ అధ్యయనానికి ఎక్స్‌పోశాట్‌లో రెండు అత్యాధునిక సాంకేతికత కలిగిన పేలోడ్‌లను అమర్చారు. ఇవి తక్కువ ఎత్తులో భూ కక్ష్య నుంచి అధ్యయనాన్ని కొనసాగిస్తాయి.
ఎక్స్‌పోశాట్ ఏమి చేస్తుందంటే...
ఎక్స్‌పోశాట్‌లోని ప్రాథమిక పరికరం పోలిక్స్.. మధ్యతరహా ఎక్స్‌రే కిరణాలను వెదజల్లే మూలాలపై పరిశోధన చేస్తుంది. ఇక మిగిలిన ఎక్స్‌స్పెక్ట్ పేలోడ్ అంతరిక్షంలోని బ్లాక్‌హోల్స్, న్యూట్రాన్ నక్షత్రాలు, యాక్టివ్ గలాటిక్ న్యూక్లై, పల్సర్ విండ్, నెబ్యులా నుంచి వెలువడే ఎక్స్‌రే కిరణాల స్పెక్ట్‌రోస్కోపిక్ సమాచారాన్ని అందించనుంది. గడిచిన ఏడాది 2023లో ఇస్రో చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్ 1 ప్రయోగాలతో సంచలనం సృష్టించింది. అదే స్ఫూర్తితో కొత్త సంవత్సరంలో మరిన్ని మిషన్స్ చేపట్టేందుకు సిద్ధమైంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. ఎక్స్‌పోశాట్ జీవితకాలం అయిదేళ్లు. కృష్ణబిలాలను అర్థం చేసుకోవడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. ఎక్స్‌రే ఫొటాన్లు, వాటి పొలరైజేషన్‌పై అధ్యయనం ద్వారా కృష్ణబిలాలు, న్యూట్రాన్ స్టార్ల దగ్గర రేడియేషన్‌కు వివరాలను ఎక్స్‌పోశాట్ బయటపెడుతుంది.