చదువుల తల్లికి భారీ గుడి సరే, చదువు సంగతేమిటి?
x
బాసర జ్ఞాన సరస్వతి గుడి అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి శంకుస్థాపన

చదువుల తల్లికి భారీ గుడి సరే, చదువు సంగతేమిటి?

తెలంగాణలో సంకనాకి పోతున్న విశవిద్యాలయాల చదువు


ఒక పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చదవుల తల్లి సరస్వతీ దేవికి పూజలు చేసి రు.220 కోట్ల వ్యయంతో బాసర ఆలయ్యాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తుంటే మరొక పక్క తెలంగాణలో చదవు సంకనాకిపోతున్నది. విచిత్రమేంటే ఈ పతనం గత ప్రభుత్వం లో అరవై వేలపుస్తకాలు చదివిన బిఆర్ ఎస్ ముఖ్యమంత్రి చంద్రేశఖర్ రావు (కెసిఆర్) హయాంలో మొదలయింది. ఇపుడు జోరుగా సాగుతూ ఉంది.

సోమవారంనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడంతో బాసరలో సరస్వతీ దేవి ఆలయంలో పండగ వాతావరణ నెలకొంది. ఆయన మనవడికి అక్కడే అక్షరాభ్యాసం కూడా జరిగింది. అక్కడే ఆయన రూ.225 కోట్లతో చేపట్టిన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ పునరుద్ధరణ పనులకు భూమిపూజ చేశారు. బాసర సరస్వతీ ఆలయం చాలా పురాతనమయింది. గోదావరి నదిఒడ్డున నిర్మించిన ఈ ఆలయంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు తెలంగాణతో పాటు పరిసర రాష్ట్రాల ప్రజలు కూడా వస్తుంటారు. తమ పిల్లలకు మంచి చదువులు తెలంగాణలో చక్కగా చౌకగా అందుబాటులో ఉండాలని కోరుకునే తల్లితండ్రులు వేల సంఖ్యలో తెలంగాణ నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా బాసరకు వస్తుంటారు.అందువల్ల ఆ ఆలయాన్ని దేశంలోనే విశిష్టాలయంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ భావిస్తున్నారు. గొప్ప ఆశయం. అందుకే ఈ ఆలయ నిర్మాణానిలు ఆయన చాలా ప్రాముఖ్యం ఇచ్చినట్లు ఆయన ఉపన్యాసం వల్ల అర్థమవుతుంది. దేశంలోబాగా పేరున్న మూడు సరస్వతీ ఆలయాలలో బాసర ఒకటి. మిగతా రెండింటిలో ఒకటి కర్నాటకలోని శృంగేరి శారద దేవీ మందిరం ( Shringeri Saradamba Temple), కేరళ కొట్టాయంలోని పనాచ్చిక్కాడు (Panachikkadu Saraswathi Temple) మూడో ఆలయం ఉంది.



ఇలా సరస్వతీ దేవికి ఘనంగాఆలయం తయారువుతున్న రాష్ట్రంలో ఉన్నత విద్య సంకనాకి పోతున్నది. ప్రభుత్వం సిగ్గుపడాల్సిన స్థితిలోఉంది. ఒక పక్క ముఖ్యమంత్రి సరస్వతీ ఆలయానికి భూమి పూజ చేస్తూ ఉంటే అదే సరస్వతీ దేవీ నిలయాలైన విశ్వవిద్యాలయాల మీద, మెడికల్ కాలేజీల మీద దారుణమయిన కథనాలు మీడియాలో వస్తున్నాయి. రాజకీయనాయకుల భక్తికి, వాస్తవానికి ఎంత దూరం ఉంటుందో ఈ కథనాలు చెబుతాయి.

విశ్వవిద్యాలయాల దుస్థితి

తెలంగాణలో 11 విశ్వవిద్యాలయాలున్నాయి. ఇవెలా నడుస్తున్నాయో చదవుల తల్లి సరస్వతీ దేవికి తెలిస్తే ఆమె తలదించుకుంటుంది. ఈ 11 విశ్వవిద్యాలయాలలో టీచర్లు రిక్రూట్ మెంటులేదు. వీటిలో 390 ప్రొఫెసర్ పోస్టులు ఉండాలి, 2024 నవంబర్ 30 నాటికి కేవలం 174 మాత్రమే పనిచేస్తున్నాయి. పనిచేస్తున్న వారిలో ఒక్క ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేసే వారే 147 మందని ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ వెల్లడించారు . ఈ సంవత్సరం పలువురు సీనియర్ ప్రొఫెసర్లు పదవీ విరమణ చేయన్నారు. దీనితో ఈ ఖాళీలు మరింత పెరుగుతాయి.

రాష్ట్రంలో ఉస్మానియా తర్వాత రెండో ముఖ్యమయిన విశ్వవిద్యాలయం వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయం. ఇది పేరు గొప్ప ఊరు దిబ్బ అనే రీతిలో ఉంది. దీనితో పాటు నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, కరీనంగర్ లోని శాతవాహన విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని తెలుగు విశ్వవిద్యాలయం, డా. బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం, బాసర రాజీవ్ గాంధీ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకెటీ) లలో ప్రొఫెసర్లే లేరు. శాతవాహన విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం, ఆర్.జి.యు.కె.టి.ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది, ఈ ‘సరస్వతి నిలయా’లలో అసోసియేట్ ప్రొఫెసర్లు కూడా లేరు. అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు లేరు కాబట్టి రీసెర్చ్ సాగదు. తెలంగాణ విశ్వవిద్యాలయాల్లోరీసెర్చ్ బందయింది. ఈ విశ్వవిద్యాలయాలన్నీ కొంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు. కాంట్రాక్ట్ అకడమిక్ అసిస్టెంట్లతోనే నెట్టుకొస్తున్నాయి. అది సరస్వతీ దేవి సంతోషించే విషయం కాదు.

ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు లేకపోతే ఏమవుతుంది. మొదట విశ్వవిద్యాలయం పరువు పోతుంది. బోధన తరుగుతుంది. రీసెర్చ్ ఆగిపోతుంది. అయినా సరే ప్రభుత్వంలో కదలిక లేదు. మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, 11 విశ్వవిద్యాలయాలలో మంజూరైన సిబ్బంది సంఖ్యలో కేవలం 27 శాతం మాత్రమే ఉన్నారు. 11 విశ్వవిద్యాలయాలలో మంజూరైన 2,817 పోస్టులకు గాను కేవలం 757 మంది సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే 2,060 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది కూడా చదవుల తల్లి గర్వపడే విషయం కాదు.

ఉస్మానియా మరీ దారుణం

హైదరాబాద్ నగరం నడిబొడ్డున వందేళ్ల చరిత్ర ఉన్నా నిర్లక్ష్యం వల్ల వంగిపోతున్న విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం. బయోటెక్నాలజీ, ఫోరెన్సిక్ సైన్స్ విభాగాలతో సహా 12 విభాగాలు గత కొన్నేళ్లుగా ఆచార్యులు అనే వాళ్లు లేకుండా పనిచేస్తున్నాయి. కొన్నింటిలో అసోసియేట్ ప్రొఫెసర్లు కూడా లేరు.

మెడికల్ కాలేజీల పరిస్థితి అంతే...

తెలంగాణలో ఇపుడు 36 ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉన్నాయి. మొదట 1`2 మాత్రమే ఉండేవి. 2021-2024 మధ్య మరొక 24 కాలేజీలు ఏర్పాటుచేయడంతో ఈ సంఖ్య 36 కు చేరింది. ఇదొక గొప్ప పరిణామం. వైద్య విద్యావ్యాప్తి చేందడమే కాకుండా వైద్యులు పెద్ద సంఖ్యలోకి వస్తారు. ఇంతవరకు బాగానే ఉంది. కాలేజీలో వైద్య ఉపాధ్యాయులు లేక చదవు సంకనాకిపోతున్నది.2026 ఏప్రిల్ 1 మేడ్చల్ మల్కాజ్ గిరి మెడికల్ కాలేజీ ప్రిన్పిపాల్ వైద్య విద్య డైరెక్టర్ ఒక లేఖ రాశారని పత్రికల్లో ఒక్ వార్త వచ్చింది. సరస్వతిదేవీకి ఒక బ్రహ్మాండమయిన ఆలయం నిర్మిస్తున్న రాష్ట్రంలో వైద్య విద్య ఎంతదారుణంగా ఉందో ఈలేఖ చెబుతుంది. కాలేజీకి శాంక్షన్ చేసిన 56 పోస్టులలో 49 ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులను వెంటనే దయచేసి నింపండి అని ప్రిన్సిపాల్ డిఎంఇ ని వేడుకున్నారు. జనరల్ మెడిసిన్‌లో ఆరు పోస్టులూ ఖాళీగా ఉన్నాయి. జనరల్ సర్జరీలో కూడా ఆరు. ఓబీజీలో ఎనిమిదింటికి ఏడు. అనస్థీషియాలో నాలుగు ఖాళీలున్నాయి. కళాశాలలో 23 విభాగాలకు గానూ కేవలం ఏడుగురు వైద్యులు మాత్రమే పనిచేస్తున్నారని మీడియా రాసింది.

.జనవరి 2026లో తెలంగాణ రాష్ట్ర రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (TSRDA) జరిపిన ఒక సర్వే ప్రకారం జోగులాంబ గద్వాల్, ఆసిఫాబాద్, కోడంగల్, భూపాలపల్లి, నారాయణపేట జిల్లాల్లోని కళాశాలల్లో ఫాకల్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రాష్ట్రంలోని 36 కళాశాలల్లోని 27 విభాగాలలో బోధనా సిబ్బంది లేనేలేరు అని సర్వే లో వెల్లడయింది. కాలేజీలు వచ్చాయి. విద్య బోధనను గాలికి వదిలేశారు.

తెలంగాణలో ఉన్నత విద్యకు, రీసెర్చ్ కు కేంద్రంగా ఉండాల్సిన యూనివర్శిటీల దుస్థితి మీద పేరు చెప్పేందుకు ఇష్టంలోని ఒక మహిళా ప్రొఫసర్ విచారం వ్యక్తం చేశారు. "15 సంవత్సరాలుగా ప్రొఫెసర్ల నియమాకాల్లేవు. అసోసియేట్ ప్రొఫెషర్లు ప్రమోషన్ మీద ప్రొఫెసర్లు అవుతారు. యూనివర్శిటీలలో 12 సంవత్సరాలుగా రిక్రూట్ మొంట్ లేదు. ఒక సారి లిమిటెడ్ రిక్రూట్ మెంట్ జరిగింది. 2013లో రిక్రూట్ అయిన అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కొందరు అసోసియేట్ ప్రొఫెసర్లు గా ప్రమోట్ అయి రీసెర్చ్ గైడ్ చేస్తున్నారు. ఇది చాలా తక్కువ డిపార్ట్ మెంట్లలోనే ఉంది. యూనివర్శిటీ అంటేనే రీసెర్చ్. ఇది తెలంగాణ యూనివర్శిటీల నుంచి మాయమవూతున్నది," అని ఆమె ఆవెదన వ్యక్తం చేశారు.


Read More
Next Story