జిహెచ్ ఎంసి కౌన్సిల్ కధకి నేటి తో ముగింపు
x

జిహెచ్ ఎంసి కౌన్సిల్ కధకి నేటి తో ముగింపు

ప్రత్యేకాధికారి పాలనలోకి జిహెచ్ ఎంసి


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కౌన్సిల్ పదవీకాలం ఫిబ్రవరి 10, 2026తో ముగియనుంది. 2020 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల అనంతరం ఏర్పాటైన ఈ కౌన్సిల్, ఐదేళ్ల కాలపరిమితిని పూర్తి చేసుకుంది. విస్తరించిన జిహెచ్ ఎంసి పరిధిలోని కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు జరగాలి. అందువల్ల కౌన్సిల్ ప్రత్యేకఅధికారి పాలనకిందికి వస్తుంది.

సీనియర్ ఐఎఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించనున్నారు. దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లొ జివొ వెలువడవచ్చని తెలిసింది. ఇపుడు జిహెచ్ ఎంసి పరిధి బాగా విస్తరించింది. గతంలోఉన్న 150 వార్డుల స్థానంలోకి 300 వార్డులు వచ్చాయి. విశాల కార్పొరేషన్‌ను పర్యవేక్షించే బాధ్యత ప్రత్యేక అధికారిపై ఉంటుంది. తాజా మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించే వరకు పరిపాలనా పర్యవేక్షణ స్పెషల్ అధికారి చేతిలో ఉంటుంది. GHMC కమిషనర్ కర్ణన్ కమిషనర్‌గా ఉంటారు. రోజువారీ కార్యకలాపాలను చూసుకుంటారు. మొత్తం పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి ఉంటారు.

గతంలో 2020 డిసెంబర్ నెలలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగాయి. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో అప్పటి రూలింగ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌ తర్వాత భారత రాష్ట్రసమితి అయింది) 56 డివిజన్లలో గెలుపొందింది. టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి హైదరాబాద్ ను కైవసం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ముఖ్యంగా అప్పటి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారం తీవ్రంగా కాషాయీకరించారు. జిహెచ్ ఎంసిలో బిజెపి తిష్టవేస్తుందనే విశ్వాసంకలిగించారు. అందువల్ల తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి తిరుగులేని శక్తిగా ఉన్న టిఆర్ ఎస్ బీజేపీ దూకుడుతో భయపడిపోయింది. గట్టి పోటీని ఎదుర్కొంది. అంతకు ముందు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 99 డివిజన్లను దక్కించుకున్న టీఆర్‌ఎస్‌ అనుకున్నట్లే పెద్ద దెబ్బతో గాయపడింది. కేవలం 56 స్థానాలను మాత్రమే గెల్చుకుంది. 99 నుంచి 56 కు పడిపోవడం కెసిఆర్ నాయక్వతానికి సవాల్ అయింది. దాని ప్రభావం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 పార్లమెంటు ఎన్నికల్లో పడింది.

ఇక పాతబస్తీలో ఎదురులేని మజ్లిస్ పార్టీ (ఎఐ ఎంఐఎం) బిజెపి హోరులో చెక్కుచెదరకుండా నిలిచింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వచ్చిన 44 స్థానాలను నిలుపుకుంది. ఇక బిజెపిది ఘనవిజయం అని చెప్పాల్సిందే. ఎందుకంటే జిహెచ్ఎంసిలో బిజెపి ఎపుడూ ఒక శక్తి కాదు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తుతో 68 డివిజన్లలో పోటీ చేసింది. కాని గెలిచింద 4 స్థానాల్లోనే. అలాంటి బిజెపి 2020 డిసెంబర్ ఎన్నికల్లో 48 డివిజన్లలో విజయం సాధించింది.

ఈ సారి ఎన్నికలు ఇంకా రసవత్తరంగా ఉంటాయి. జిహెచ్ ఎంసి విస్తారమయింది. విశాల జిహెచ్ ఎంసి స్థానంలోకి చిన్న చిన్న కార్పొరేషన్లు ఉనికిలోకి వస్తున్నాయి. బిఆర్ ఎస్ అధికారం కోల్పోయింది. కెసిఆర్ నాయకత్వం బలహీనపడింది. పదేళ్లు పత్తాలేకుండాపోయిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎంఐఎం అదే బలంతో ఉంది. బిజెపి దూకుడా బాగా తగ్గింది. ఈ సారి ఎన్నికల్లో అన్ని పార్టీలు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తాయి. అయితే, ఈ సారి మునుపటి జిహెచ్ ఎంసి పరిధిలో వివిధ కార్పొరేషన్లు వస్తున్నాయి.మునుపటి ఎన్నికల్లా హడావిడి ఉండకపోవచ్చు.

Read More
Next Story