
తెలంగాణ అటవీశాఖలో హరితరాణులు (ఫొటో కర్టసీ : అటవీశాఖ)
అడవులను కాపాడుతున్న హరిత రాణులు
దూలపల్లి అటవీ అకాడమీలో ఘనంగా మహిళా దినోత్సవం – 25 మందికి ప్రతిభా పురస్కారాలు
అడవుల సంరక్షణలో మహిళలు కూడా సమానంగా ముందంజలో ఉన్నారని తెలంగాణ అటవీ శాఖ మరోసారి నిరూపించింది. దూలపల్లి అటవీ అకాడమీలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళా అటవీ అధికారిణులను ‘గ్రీన్ క్వీన్స్’గా సత్కరించి, ఉత్తమ సేవలు అందించిన 25 మంది మహిళా సిబ్బందికి అవార్డులు అందజేశారు.
తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో దూలపల్లి అటవీ అకాడమీలో గ్రీన్ క్వీన్స్ (హరిత రాణులు) పేరుతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.తెలంగాణ అటవీశాఖలో అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారిణి డాక్టర్ సీ.సువర్ణ, అదనపు డీజీ స్వాతి లక్రా, అటవీ అభివృద్ధి సంస్థ ఎండీ సునీత ఎం. భగవత్, సీసీఎఫ్ (CAMPA) క్షితిజ, సీనియర్ అటవీ అధికారిణులు అర్పణ, శ్రీలక్ష్మి, ప్రవీణ, అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ రేఖ భాను హరిత రాణులుగా పేరొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారిణి డాక్టర్ సీ.సువర్ణ, అదనపు డీజీ స్వాతి లక్రా హాజరయ్యారు. అటవీ అకాడమీ డైరెక్టర్ ప్రియాంక వర్గీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
మహిళలు సవాళ్లను ఎదుర్కోవాలి
ఈ సందర్భంగా డాక్టర్ సీ. సువర్ణ మాట్లాడుతూ మహిళా దినోత్సవం అనేది కేవలం మహిళలకే పరిమితమైన కార్యక్రమం కాదని, పురుషులు కూడా ఇందులో భాగస్వాములై సమానత్వ భావనను బలపరచాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నప్పటికీ, శారీరకంగా కొంత బలహీనంగా కనిపించినా మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారని పేర్కొన్నారు. అటవీ శాఖలో బీట్ ఆఫీసర్లుగా పనిచేసే ఉద్యోగుల్లో ఉద్యోగాన్ని వదిలి వెళ్లిన వారిలో 60 మంది పురుషులే ఉన్నారని, మహిళలు ఉద్యోగాన్ని వదిలిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇది మహిళలు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని సూచిస్తుందని చెప్పారు.
అడవుల సంరక్షణలో మహిళల కీలక పాత్ర
అటవీ శాఖలో పనిచేస్తున్న మహిళా ఫ్రంట్‌లైన్ సిబ్బంది అడవుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని డాక్టర్ సువర్ణ పేర్కొన్నారు. అడవుల్లో నిరంతరం పనిచేస్తూ పొందే అనుభవం నైపుణ్యాల అభివృద్ధి , ద్వారా వారు తమ బాధ్యతలను మరింత సమర్థంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ధైర్యం, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ అటవీ సంపదను కాపాడటంలో మహిళలు ముందుండటం అభినందనీయమన్నారు.
25 మంది మహిళా సిబ్బందికి ప్రతిభా పురస్కారాలు
అదనపు డీజీ స్వాతి లక్రా మాట్లాడుతూ యూనిఫామ్‌లో విధులు నిర్వర్తిస్తున్న మహిళలను చూడటం నిజంగా గర్వంగా అనిపిస్తుందని తెలిపారు. పోలీస్, వైద్య, అటవీ శాఖలతో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళలు ధైర్యంగా సమాజానికి సేవ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. మహిళలు కేవలం భద్రతను కాపాడటమే కాకుండా సమాజ భవిష్యత్తును కూడా నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అటవీ సంరక్షణలో ఉత్తమ పనితీరు కనబరిచిన 25 మంది మహిళా సిబ్బందికి ప్రతిభా పురస్కారాలు అందజేశారు.మహిళా సిబ్బంది అడవుల సంరక్షణలో చేస్తున్న సేవలను అధికారులు అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉత్తమంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
Next Story

