
గల్ఫ్ దేశాలపై కురుస్తున్న మిసైళు, డ్రోన్ల వర్షం
గల్ఫ్ వార్: లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వరకు తెలుగు కార్మికుల ఆందోళన
గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వేలాది తెలుగు ప్రజలు, స్వదేశానికి తరలించాలని వేడుకోలు
ఆరో రోజుకు చేరుకున్న యుద్ధం
ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య సాగుతున్న భీకర యుద్ధం ఆరో రోజుకు చేరుకుంది. ఇరాన్, లెబనాన్ దేశాలపై ఇజ్రాయెల్ డ్రోన్లతో వరుస దాడులు చేస్తోంది.మరో వైపు ఇరాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఒమన్, జోర్డాన్, బహ్రెయిన్, దుబాయ్, కువైట్, ఖతార్, అబుదాబి దేశాలపై దాడులు చేస్తోంది. అమెరికా ఎయిర్ బేస్ స్థావరాలు, అమెరికా కాన్సులేట్ కార్యాలయాలు లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తుండటంతో గల్ఫ్ దేశాల ప్రజలు భయంతో వణికిపోతూ బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. భారతదేశం నుంచి లక్షమంది గల్ఫ్ దేశాల్లో పనిచేస్తుండగా, ఇందులో 15 లక్షల మంది తెలంగాణాకు చెందిన వారున్నారు.
లెబనాన్ దేశంలో చిక్కుకుపోయిన తెలుగు ప్రజలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన తెలుగు కార్మికులు లెబనాన్ దేశంలో చిక్కుకుపోయారు. మౌంట్ లెబనాన్ ప్రాంతంలోని మిడిల్ ఈస్ట్ పవర్ ప్లాంటులో పనిచేసేందుకు వెళ్లిన తెలుగు కార్మికులు యుద్ధం కారణంగా అక్కడ చిక్కుకు పోయారు. స్వదేశానికి తిరిగి వద్దామంటే విమాన సర్వీసులు లేవని వారు ఆవేదనగా చెప్పారు. లెబనాన్ దేశంలోని జియా ప్రాంతం నుంచి తమకు విమాన సర్వీసులు ఏర్పాటు చేసి స్వదేశానికి తరలించాలని తెలుగు కార్మికులు బీరూట్ లోని భారతదేశ రాయబార కార్యాలయంతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులకు విన్నవించారు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో లెబనాన్ నివాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎం జరుగుతుందోనని భయం భయంతో గడుపుతున్నామని, తమను కాపాడాలని వారు అభ్యర్థించారు. భారత రాయబార కార్యాలయం అధికారులు విమాన సర్వీసు ఏర్పాటు చేస్తే తాము స్వదేశానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని షేక్ అల్లాఫ్ అనే పవర్ ప్లాంటు ఉద్యోగి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
సిరిసిల్ల జిల్లా వాసికి గాయాలు
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చంచెల్లి రాజేశ్వరరావు అబుదాబిలోని విమానాశ్రయంలోని క్లీనింగ్ విభాగంలో పనిచేస్తుండగా ఇరాన్ మిసైల్ దాడి చేసింది. ఈ దాడిలో విమానాశ్రయం అద్దాలు పగిలి రాజేశ్వరరావుకు తగలడంతో గాయాలయ్యాయి. దీంతో ఆసుపత్రిలో చికిత్స చేసి అతని గదికి తరలించారు.ఈ ఘటనతో రాజేశ్వరరావు భార్య మీనా కన్నీటిపర్యంతమయ్యారు. తన భర్తను స్వదేశానికి రప్పించాలని మీనా కోరారు. విమానాశ్రయం సమీపంలో మిసైల్ దాడిలో భారత దేశానికి చెందిన ఒకరు మరణించారు.
600 మంది తెలుగు కార్మికుల రాక
ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా పలు గల్ఫ్ దేశాల్లో గగనతలాలను మూసివేయడంతో పలువురు తెలుగు రాష్ట్రాల కార్మికులు చిక్కుకున్నారు. గత రెండు రోజుల్లో ఆరు ప్రత్యేక విమానాల్లో 600 మంది స్వదేశానికి చేరుకున్నారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూతోపాటు పలువురు గల్ఫ్ దేశాల నుంచి క్షేమంగా స్వస్థలానికి తిరిగి వచ్చారు.
ఇజ్రాయెల్ బంకర్లలో తలదాచుకున్న తెలుగు కార్మికులు
ఇజ్రాయెల్ దేశంపై ఇరాన్ చేస్తున్న డ్రోన్ దాడులతో తెలంగాణాకు చెందిన కార్మికులు బంకర్లలో తలదాచుకున్నారు. డ్రోన్ దాడి జరగనుందని సైరన్ మోగితే చాలు తెలుగు కార్మికులు బంకర్లలోకి వెళ్లి తలదాచుకుంటున్నారు. సైరన్ మోగిన పది నిమిషాల్లోనే తాము బంకర్లలోకి వెళ్లి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని కరీంనగర్ జిల్లాకు చెందిన కార్మికుడు గంగాధర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఇజ్రాయెల్ దేశంలో 18 వేల మంది భారతీయులుండగా వారిలో రెండు వేల మంది తెలంగాణవాసులున్నారు. టెల్ అవైవ్, జెరూసలేం, హైపా, బీర్ షెబా, ఆష్ కెలాన్ నగరాల్లో తెలుగు కార్మికులున్నారు.
తెలంగాణాకు చెందిన కార్మికులు ఒమన్, కువైట్, సౌదీఅరేబియా, బహ్రెయిన్, దుబాయ్,లెబనాన్, అబుదాబీ దేశాల్లో పనిచేస్తున్నారు. అమెరికా వాయు స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ వరుస దాడులు చేస్తుండటంతో అక్కడ పనిచేస్తున్న తెలుగు కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. యుద్ధం నేపథ్యంలో తమను స్వదేశానికి తరలించాలని వారు అభ్యర్థిస్తున్నారు. యుద్ధ భయంతో బంకర్లలో తలదాచుకుంటూ రోజులు గడుపుతున్న తెలుగు కార్మికులు ఎప్పుడు స్వదేశం చేరుకుంటామా అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. వారి కుటుంబాలు కూడా ఆందోళనలో మునిగిపోయాయి. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుని వారు సురక్షితంగా స్వదేశానికి చేరుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.
Next Story

