కర్ణాటక, తమిళనాడు మీదుగా ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో అకాల వర్షాలు విరుచుకుపడ్డాయి. పలు జిల్లాల్లో వడగళ్ల వర్షం కురిసి రైతులను తీవ్రంగా నష్టపరిచింది. ఇప్పటికే గత నష్టాలకు పరిహారం అందక ఇబ్బందులు పడుతున్న రైతులకు తాజా వానలు మరింత దెబ్బతీశాయి.సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మహబూబ్ నగర్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, నారాయణపేట, వికారాబాద్, సిద్ధిపేట జిల్లాల్లో వడగళ్ల వర్షం కురిసింది. ఈ అకాల వర్షాల వల్ల వివిధ పంటలతో పాటు పండ్ల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వడగళ్ల వర్షం కురిసింది. వట్పల్లి, పుల్కల్, నర్సాపూర్, దుబ్బాక ప్రాంతాల్లో కురిసిన వడగళ్ల వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి. కామారెడ్డి జిల్లాలో వడగళ్ల వాన కురిసింది.జుక్కల్ మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.హంగర్గ గ్రామంలో వడళ్ల వానతో పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. వట్పల్లిలో అత్యధికంగా 65.3 మిల్లీమీటర్ల వడగళ్లతో కూడిన వర్షపాతం నమోదైంది.
దెబ్బతిన్న పంటలు
సోమవారం సాయంత్రం సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వడగళ్లు, బలమైన గాలులతో కూడిన అకాల వర్షాలు కురిశాయి. వర్షాలతో వేడి నుంచి తాత్కాలిక ఉపశమనం లభించింది. మొక్కజొన్న, కూరగాయలు, మామిడి తోటలు, పొద్దుతిరుగుడు పువ్వు, ఇతర పంటలను దెబ్బతీశాయి.సంగారెడ్డి జిల్లాలోని ఆందోలు, పుల్కల్, జిన్నారం, మొగుడంపల్లి, మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం, సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకలో భారీ వర్షాలు కురిశాయి.
అకాలవర్షాలతో భారీ నష్టం
ఈ ఏడాది ఫిబ్రవరి 23వతేదీన తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల్లో ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది.ఈ అకాల వర్షం వల్ల మిర్చితో సహా పలు పంటలకు తీవ్ర నష్టం వాటిళ్లింది.మిర్చి, పత్తి, ఇతర వాణిజ్య పంటలకు భారీ నష్టం వాటిళ్లింది.వడగళ్ల వాన కారణంగా ముఖ్యంగా మిర్చి, పత్తి, కూరగాయల పంటలు, ఇతర వాణిజ్య పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
3లక్షల ఎకరాల్లో పంట నష్టం
గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కురిసిన భారీవర్షాల వల్ల 3 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలంగాణ వ్యవసాయాధికారులు అంచనా వేసినా నష్టపరిహారం మాత్రం ఇవ్వలేదు. ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఆగస్టు నెలలో కురిసిన వర్షాల వల్ల 13 జిల్లాల్లో రెండు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని 270 మండలాల్లోని 2,463 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించినా రైతులకు నష్టపరిహారం మాత్రం ఇవ్వలేదు. నష్టపరిహారం మంజూరు చేస్తూ జీఓ విడుదల చేసినా, నిధులు మాత్రం ఇవ్వలేదు.
జీఓ వచ్చినా అందని పరిహారం
గత ఏడాది కురిసిన వడగళ్ల వర్షాల వల్ల ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో 40వేల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారంగా రూ.40.18 కోట్లను విడుదల చేస్తూ గత ఏడాది నవంబరు 25వతేదీన జీఓ జారీ చేసినా రైతులకు మాత్రం ఇప్పటివరకు పరిహారం అందిజేయలేదు. 2025-26 ఆర్థిక సంవత్సరం మరో 13 రోజుల్లో ముగియనున్నా గత ఏడాది పంట నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. మళ్లీ తాజాగా వడగళ్ల వర్షం కురిసి మళ్లీ పంట దెబ్బతింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
పొలాల్లో ఇసుక మేటలు వేసినా అందని పరిహారం
ములుగు జిల్లాలో గత ఏడాది ఖరీఫ్ సీజనులో కురిసిన భారీవర్షాలు వరదల వల్ల 6,363 ఎకరాల్లోని పొలాల్లో ఇసుక మేటలు వేసింది. 3,516 మంది రైతులకు ఎకరానికి రూ.10వేలు చొప్పున రూ.6.37 కోట్లను నష్టపరిహారం కింద రైతులకు అందజేయాలని అంచనా వేశారు. వాగులు పొంగి ఒడ్డున ఉన్న పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట భూములు వరదల ధాటికి కోతకు గురయ్యాయి. ఏటూరు నాగారం, మంగపేట, గోవిందరావుపేట, వాజేడు, వెంకటాపూర్ ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నా ఇప్పటికీ రైతులకు పరిహారం అందలేదు.
పునరావృతమవుతున్న అకాల వర్షాలు ఒకవైపు, నష్టపరిహారం ఆలస్యం మరోవైపు రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నాయి. వెంటనే నష్టం అంచనా వేసి పరిహారం విడుదల చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే వ్యవసాయం కొనసాగించడం కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.