
తెలంగాణలో ఒంటిపూట బడులు షురూ..
విద్యాశాఖ ఉత్తర్వులు జారీ. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు, తర్వాత మధ్యాహ్న భోజనం. పదో తరగతి పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక షెడ్యూల్.
వేసవి ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బడులకు ఒంటిపూట సెలవులు ఇవ్వాలని నిశ్చయించింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరుకు ఒంటిపూడ బడులని అధికారికంగా ప్రకటించింది. దీంతో మార్చి 15 నుంచి బడులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగులను నిర్వహించనున్నాయి. ఈ మేరకు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ మేనేజ్‌మెంట్‌కు చెందిన అన్ని పాఠశాలలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని అధికారులు తెలిపారు.
విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించి ఇంటికి పంపించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు మాత్రం ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి. త్వరలో జరగనున్న ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఈ ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఎస్ఎస్సీ పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల పనివేళలు పరీక్షల రోజుల్లో మారనున్నాయి. ఆ రోజుల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ స్కూళ్లు పనిచేస్తాయి. పరీక్షలు లేని రోజుల్లో మాత్రం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు సాధారణ షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలి.
ఈ నిర్ణయాలను కచ్చితంగా అమలు చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈ నవీన్ నికోలస్ ప్రాంతీయ సంయుక్త డైరెక్టర్లు మరియు జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని పాఠశాలలకు సమాచారం అందించి అమలు పర్యవేక్షించాలని సూచించారు. అకాడెమిక్ సంవత్సరం చివరి పని దినంగా ఏప్రిల్ 23ను నిర్ణయించారు. ఆ తరువాత ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. కొత్త విద్యా సంవత్సరం 2026–27 కోసం పాఠశాలలు జూన్ 12న తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మార్పులతో విద్యార్థులు ఎండల ప్రభావం నుంచి కొంత ఉపశమనం పొందుతారని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.

