
ఎత్తిపోతల ప్రాజెక్టులపై హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు
ప్రాజెక్టుల్లో మోటార్ల నిర్వహణపై మాజీ మంత్రి విమర్శలు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ బహిరంగ లేఖ.
ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ల వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ల నిర్వహణ విషయంలో ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యాన్ని కనబరుస్తోందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రాజెక్ట్‌లకు ఏమాత్రం మంచిది కాదని అన్నారు. ఈ విషయంపై ఆయన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం, దేవాదుల వంటి ప్రాజెక్టుల్లో భారీ మోటార్లను పదే పదే ఆన్, ఆఫ్ చేయడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇది ఇంజినీరింగ్ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని తెలిపారు. ఇలా చేయడం వల్ల పంపులు, మోటార్లు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
పదేపదే స్టార్ట్, స్టాప్ చేయడం వల్ల తీవ్రమైన వైబ్రేషన్స్ ఏర్పడి ఇంప్లర్స్, మోటార్లు శాశ్వతంగా పాడయ్యే అవకాశం ఉందని వివరించారు. ఈ పరిస్థితి ప్రభుత్వ నిర్లక్ష్యమా లేక కావాలనే చేస్తున్న చర్యలామా అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. భారీ మోటార్లు నిరంతరాయంగా నడిచేలా డిజైన్ చేసినవని, వాటిని ఆపడం వల్ల ప్రజాధనానికి నష్టం కలుగుతుందని హెచ్చరించారు. గత ప్రభుత్వంపై నెపం మోపేందుకు ప్రయత్నిస్తున్నారా అని కూడా ప్రశ్నించారు.
వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టులను ఇలాంటి విధంగా నిర్వహించడం శోచనీయమని ఆయన పేర్కొన్నారు. చందలాపూర్ సహా ప్యాకేజీలు 6, 8, 10, 11, 12లో మోటార్ల ఆపరేషన్ విధానం అభ్యంతరకరంగా ఉందని లేఖలో వెల్లడించారు. తక్షణమే ఈ విధానాన్ని మార్చి, ఇంజినీరింగ్ నిబంధనలకు అనుగుణంగా పంపులను నిరంతరాయంగా నడపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టులను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించవద్దని సూచించారు.

