ప్రభుత్వంది భస్మాసుర హస్తం: హరీష్
x

ప్రభుత్వంది భస్మాసుర హస్తం: హరీష్

రైతు భరోసా, రుణమాఫీ అమలుపై ప్రభుత్వం హామీలు నిలబెట్టలేదని అసెంబ్లీలో హరీష్ రావు విమర్శలు చేశారు.


తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి విమర్శలు గుప్పించారు. రైతాంగంపై రేవంత్ సర్కార్ భస్మాసుర హస్తం పెడుతోందని చురకలంటించారు. రైతులను ఆదుకుంటున్నామని మభ్యపెడుతూ వారికి ముంచుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా అమలు, రుణమాఫీపై కీలక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగానే హరీష్ రావు విమర్శనాస్త్రాలు సంధించారు. రైతులకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రైతు భరోసా పెంపు విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రతి ఎకరాకు రూ.15 వేల హామీ ఇచ్చినప్పటికీ, బడ్జెట్‌లో రూ.12 వేలు మాత్రమే పేర్కొన్నారని తెలిపారు. రూ.19 వేల కోట్ల రైతు బంధు నిధులు నిలిపివేశారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీ పూర్తయిందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, గ్రామాల్లోకి వెళ్లితే రైతులు ఇంకా మాఫీ కాలేదని చెబుతున్నారని వివరించారు. ఈ వ్యత్యాసంపై హరీష్ రావు ప్రశ్నలు లేవనెత్తారు.

రైతుల ఆత్మహత్యలు ఆగాలని గతంలో రైతు బంధు పథకం తీసుకువచ్చినట్లు ఆయన గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని విపత్తులు వచ్చినా పథకం కొనసాగించామని తెలిపారు. ప్రస్తుతం నాట్లు వేసే సమయంలో ఇవ్వాల్సిన రైతు భరోసాను కోతల సమయంలో ఇస్తున్నారని విమర్శించారు. హామీ ఇచ్చిన విధంగా నిధులు ఎందుకు విడుదల కావడం లేదని ప్రశ్నించారు.

బడ్జెట్ ప్రతులు కాపీ పేస్ట్ తరహాలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. యువ వికాసం పథకానికి గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులు కూడా వినియోగంలోకి రాలేదని తెలిపారు. మొత్తంగా రైతుల సంక్షేమం, హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని హరీష్ రావు కోరారు. ఈ అంశంపై భవిష్యత్తులో మరింత చర్చ జరిగే అవకాశం ఉంది.

Read More
Next Story