సినిమా టికెట్ రేట్ల పై ముఖ్యమంత్రి అసెంబ్లీ వాగ్దానం ఏమి అయ్యింది: హరీష్ రావు
x

సినిమా టికెట్ రేట్ల పై ముఖ్యమంత్రి అసెంబ్లీ వాగ్దానం ఏమి అయ్యింది: హరీష్ రావు

సినిమాటోగ్రఫీ మంత్రికి సంబంధం లేకుండా సినిమా రేట్లను పెంచుతూ సిఎం చేతిలో వున్న హోమ్ శాఖ ఉత్తర్వులు ఇస్తోందని హరీష్ ఆరోపించారు


తాను అధికారంలో ఉన్నంత వరకు సినిమా టికెట్ల రేట్లు పెంపు ఉండదని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ముఖ్యమంత్రి వాగ్దానం ఏమి అయ్యిందని బిఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. సినిమాటోగ్రఫీ మంత్రి ఫైల్ పై సంతకం చేయకుండా సినిమా టికెట్ల రేట్లు ఎలా పెరిగాయని దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల్లో ఓడిపోయి రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో? ఒక్కో సినిమాకు కమిషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో? త్వరలోనే బయటపెడతామని, ఈ సినిమా రేట్ల కమిషన్ల దందాపై గవర్నర్ గారు దృష్టి సారించాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.

ముఖ్యమంత్రి సహచర మంత్రుల ప్రమేయం లేకుండా హోమ్ మంత్రి గా జీవోలు యిచ్చి తానే నిర్ణయాలు చేస్తున్నట్టు మంత్రి ప్రకటనతో స్పష్టం అవుతోందని ఆయన అన్నారు. “టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వ తీరు మారకపోవటం శోచనీయం. రాష్ట్ర కేబినెట్ లో క్యాబినెట్ మంత్రికి తెలియకుండానే నిర్ణయాలు జరుగుతుంటే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు. ఐటీ మంత్రిని నేనే అని ఈ మధ్య చెప్పుకున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇపుడు ఉన్న శాఖ తో తనకు సంబంధం లేదని ఎందుకు అంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండదు, బెనిఫిట్ షోలు ఉండవు, ఎవరికీ స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వం అని చెప్పి క్షేత్రస్థాయిలో అడ్డగోలు నిర్ణయాలు చేస్తున్నారు. ఇప్పటికే మూడు సినిమాలకు అడ్డగోలుగా రేట్లు పెంచుతూ జీవోలు ఇచ్చారు. ఇవాళో రేపో మరో సినిమాకు కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారు,” అని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా కాక రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారని ఆరోపిస్తూ, “ఒక సినిమా రిలీజ్ సమయంలో దుర్ఘటన జరిగినప్పుడు నీతులు చెప్పారు.. ఇప్పుడేమో యథేచ్ఛగా రేట్లు పెంచుతున్నారు. మంత్రికి తెలియకుండా పాలన సాగడమేనా మీ ప్రజా పాలన. ఒక సినిమాకు అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరు మరో దానికి రెండు రోజుల ముందే రాచమర్యాదలతో పర్మిషన్ ఇస్తారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష గడతారు. మీ పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని జైలుకు పంపిస్తారు. నచ్చినోళ్లు అయితే రూ. 600 టికెట్ రేటుకి పర్మిషన్ ఇస్తారు వారం రోజులు రేట్లు పెంచుకోవచ్చని రెడ్ కార్పెట్ వేస్తారు. పాలకుడు అనేవాడు పాలసీ తో ఉండాలి తప్ప, పగతో ఉండకూడదు,” అని హితవు పలికారు.

తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి ఎదిగింది. ప్రపంచం గర్వించేలా సినిమాలు తయారవుతున్నాయి. సినిమా పరిశ్రమను పదేళ్లు కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడారు. ఎక్కడా వివక్ష చూపలేదు. 50, 60 ఏళ్లుగా ఎంతోమంది కష్టపడి నిర్మించుకున్న పరిశ్రమ వాతావరణాన్ని అహంకారంతో, పిచ్చి చేష్టలతో, పగ ప్రతీకారాలతో, చిల్లర రాజకీయాలతో నాశనం చేస్తున్నారు. ఇది ప్రజా పాలన కాదు మీ పాపిష్టి పాలన కు పరాకాష్ట, అని సిఎం ను ఉద్దేశించి అన్నారు.

Read More
Next Story