హైదరాబాద్ హాట్ కేక్ అయిపోయిందా ?
x

హైదరాబాద్ హాట్ కేక్ అయిపోయిందా ?

భాషా సమస్య లేదు కాబట్టే ఉత్తరాధి రాష్ట్రాల్లోని యువత లేదా ఇతర వర్గాలు హైదరాబాద్ రావటానికి ఏమాత్రం సంకోచించరు.


అవును, దేశంలోని అన్నీ మెగాసిటీల్లోకి హైదరాబాద్ సిటీ హాట్ కేక్ అయిపోయింది. ఎందుకంటే దేశంలోని ముఖ్యంగా ఉత్తరాధి యువత ఉద్యోగాల టార్గెట్ హైదరాబాద్ మాత్రమే అని తేలిపోయింది. టాలెంట్ సొల్యూషన్స్ రంగంలో ఎప్పటికప్పుడు సర్వేలు చేసే ‘ఎక్స్ ఫెనో’ అనే సంస్ధ తన తాజా నివేదికను విడుదలచేసింది. ఈ రిపోర్టు ప్రకారం దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని నైపుణ్యాలు కలిగిన యువతలో ఎక్కువమంది తాము హైదరాబాద్‌లో ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నారు. ఈ సంస్ధ 12 మెగాసిటీల్లోని లక్షలాదిమంది యువతతో మాట్లాడింది. ఏ రాష్ట్రంలో ఉద్యోగం చేయాలని నైపుణ్యం కలిగిన యువత కోరుకుంటున్నారు, ఎక్కడ స్ధిరపడాలని అనుకుంటున్నారు అనే అంశాలపై లక్షలమంది యువతను సర్వేచేసింది. ఇందులో 25లక్షలమంది ఉద్యోగంచేయటానికి తమ టాప్ ప్రయారిటీ హైదరాబాద్ అని చెప్పినట్లు రిపోర్టు వెల్లడించింది.

నిజానికి వైట్‌కాలర్ ఉద్యోగాలు, ప్రతిభగల నిపుణుల ఉద్యోగాల్లో హైదరాబాద్ మూడోస్ధానంలో నిలిచింది. మొదటిస్ధానం బెంగుళూరు, రెండోస్ధానం హర్యానాలోని గుర్‌గ్రామ్ నిలిస్తే హైదరాబాద్ ది మూడోప్లేసే. విచిత్రం ఏమిటంటే బెంగుళూరులో పనిచేస్తున్న లక్షలాదిమంది వైట్‌కాలర్ ఉద్యోగుల్లో కూడా 4.5 లక్షలమంది తాము హైదరాబాద్ లో ఉద్యోగాలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పటమే.

2025లో ఇతర రాష్ట్రాలనుండి హైదరాబాద్ వచ్చి ఉద్యోగాలు చేస్తున్నవారు 77,800 మంది. ఇదేసమయంలో హైదరాబాద్ నుండి ఇతర ప్రాంతాలకు ఉద్యోగాలకోసం వెళ్ళినవాళ్ళు 52,300 మంది. అంటే హైదరాబాద్ కు ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళ సంఖ్య, హైదరాబాద్ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళ సంఖ్య తక్కువేమీలేదు. 2025 మార్చినెలతో పోల్చుకుంటే 2026, మార్చికి ఇతర ప్రాంతాలనుండి హైదరాబాద్ కు ఉద్యోగాల కోసం వచ్చిన వారు 31శాతం పెరిగారు. తెలంగాణ నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్ళే ఉద్యోగులు 2023-24లో 5.15 లక్షలుండగా, 2024-25లో ఈ సంఖ్య 4.03 లక్షలకు తగ్గింది. 2025 సంవత్సరంలో ఈ సంఖ్య 4.73 లక్షలుంది. ప్రతిభ, నైపుణ్యం కలిగిన ఉద్యోగుల సంఖ్య 2026 మార్చికి 48.9 లక్షలకు చేరింది. 2024-25 ఏడాదితో పోల్చితే సుమారు 7 లక్షలు అధికం. తెలంగాణలో హైదరాబాద్ మాత్రమే కాకుండా వరంగల్, ఖమ్మం, మెదక్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో కూడా ప్రతిభ, నైపుణ్యాల వైట్ కాలర్ ఉద్యోగులు 52,700 మంది ఉన్నారు.

ప్రధాన కారణం

ఉత్తరాధి రాష్ట్రాల నుండి హైదరాబాద్‌కు వచ్చి వైట్‌కాలర్ ఉద్యోగాలు చేయాలని యువత కోరుకోవటానికి ప్రధానమైన కారణం ఒకటుంది. అదేమిటంటే భాషా సమస్య లేకపోవటం. శతాబ్దాల తరబడి హైదరాబాద్ రాష్ట్రం నవాబుల పాలనలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కాలక్రమేణా రాజ్యాలు పోయి రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత హైదరాబాద్ స్టేట్ పోయి ఇప్పటి తెలంగాణ రాష్ట్రం మిగిలింది. శతాబ్దాల నవాబుల పాలనలో ఉందికాబట్టి ప్రస్తుత తెలంగాణలో ఏమూలకు వెళ్ళినా హిందీ భాష వినబడుతునే ఉంటుంది. ప్రజల కమ్యూనికేషన్‌కు కీలకమే భాష. భాషా సమస్య లేదు కాబట్టే ఉత్తరాధి రాష్ట్రాల్లోని యువత లేదా ఇతర వర్గాలు హైదరాబాద్ రావటానికి ఏమాత్రం సంకోచించరు. పైగా అనేక అంతర్జాతీయ ఐటి, సాఫ్ట్ వేర్ కంపెనీలు, గ్లోబల్ కేపబులిటి సెంటర్లు, ఫార్మాకంపెనీలు హైదరాబాద్ లో చాలా ఉన్నాయి, మరెన్నో కొత్తగా వస్తున్నాయి. అందుకనే హైదరాబాద్ గతంలోనే కాదు ఇప్పుడూ, ఎప్పుడూ హాట్ కేక్ అనేచెప్పాలి.

Read More
Next Story