పశ్చిమ బెంగాల్ గవర్నర్ వ్యవహరంతో బీజేపీ స్పీడు తగ్గిందా?
x

పశ్చిమ బెంగాల్ గవర్నర్ వ్యవహరంతో బీజేపీ స్పీడు తగ్గిందా?

సందేశ్‌ఖాలీ కేంద్రంగా గతంలో బీజేపీ నాయకులు మమతను టార్గెట్ చేస్తే ఇప్పుడు గవర్నర్ బంగళా కేంద్రంగా బీజేపీని మమతా టార్గెట్ చేస్తున్నారా?


సందేశ్‌ఖాలీ కేంద్రంగా పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి, టీఎంసీకి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. 20 ఏళ్ల క్రితం క్లీనర్‌గా పనిచేస్తూ జీవనం ప్రారంభించిన షాజహాన్ షేక్ తర్వాత కాలంలో టీఎంసీ నాయకుడయ్యాడు. భూకబ్బాలకు పాల్పడ్డాడు. మహిళలపై వేధింపులకు పాల్పడ్డాడు. ప్రజలు తిరగబడడంతో కొంతకాలం పాటు కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో బాధితులు బయటకు రావడంతో వాస్తవాలు వెలుగుచూశాయి. ఇదే సమయంలో సందేశ్ ఖాలీ ఘటనలను బీజేపీ ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకుంది. టీఎంసీ చీఫ్ మమత బెనర్జీని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు.

ఎన్నికల సందర్భంగా గతంలో సందేశ్‌ఖాలీ సమీపంలోని బరాసత్‌లో నిర్వహించిన ‘నారీ శక్తి వందన్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. “సందేశ్‌ఖాలీలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. అక్కడ ఏం జరిగినా ఎవరైనా పట్టించుకుంటున్నారా? TMC ప్రభుత్వం మీ కష్టాలను పట్టించుకోదు. దోషిని రక్షించేందుకు TMC ప్రభుత్వం తన శక్తినంతా ఉపయోగిస్తోంది.’’అని మమతను పరోక్షంగా విమర్శించారు.

ప్రస్తుతం రాజ్‌భవన్‌లో గవర్నర్ సివి ఆనంద బోస్‌ ఒక ఉద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి. దీన్నిప్రచారాస్త్రంగా మలుచుకున్న టీఎంసీ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పశ్చిమ బెంగాల్ వచ్చిన ప్రధాని మోదీ ఈ ఘటనపై స్పందించాలని టీఎంసీ పట్టుబట్టింది.

“రాజ్‌భవన్‌లో పని చేసే ఒక యువతి గవర్నర్ వేధింపుల గురించి మాట్లాడింది. గతంలో ఇలాంటి ఘటనలు జరగలేదు. బాధితురాలి కన్నీళ్లతో నా గుండె ద్రవించింది. ఇక రాజ్‌భవన్‌లో పనిచేయాలంటే చాలా భయంగా ఉందని ఆ మహిళ ఏడుస్తూ చెప్పింది. గవర్నర్ ఇలా ఎందుకు చేశాడో సమాధానం చెప్పాలి. ప్రధాని నిన్న రాజ్‌భవన్‌కు వచ్చారు. కానీ ఘటనపై ఏమీ మాట్లాడలేదు. బీజేపీ నాయకులు సందేశ్‌ఖలీ సమస్యను ఎత్తిచూపే ముందు మొదట తమను తాము చూసుకోవాలి.” అని మమతా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై టిఎంసి నాయకులు రాజకీయ దాడులను తీవ్రం చేయడంతో, కోల్‌కతా పోలీసులు గవర్నర్‌పై వచ్చిన ఆరోపణపై దర్యాప్తు చేసేందుకు ఎనిమిది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందానికి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, సెంట్రల్ డివిజన్, ఇందిరా ముఖర్జీ సిట్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ప్రాథమిక విచారణ కోసం సీనియర్ పోలీసు అధికారుల బృందం శుక్రవారం రాజ్‌భవన్‌ను సందర్శించింది.

రాజ్‌భవన్‌లోని ఉద్యోగిగా పనిచేస్తున్న మహిళ హేర్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఉద్యోగాన్ని పర్ననెంట్ చేస్తానని నమ్మబలికి మొదట మార్చి 24న, మళ్లీ మే 2న తన ఛాంబర్‌లో తనను లైంగికంగా వేధించారని ఆమె ఆరోపిస్తున్నారు. కాగా రాజకీయ శక్తులు తనపై కుట్ర పన్నాయని గవర్నర్ చెబుతున్నారు. ఇవి కేవలం ఎన్నికల కుతంత్రాలు, అంతకుమించి ఏమీ లేదని గవర్నర్ కొట్టి పడేశారు.

Read More
Next Story