
మావోయిస్టు గెరిల్లా ఆర్మీ ఖతమైనట్లేనా ?
దేవాతో పాటు మిలిటరీ ఆపరేషన్ సభ్యులు ఆయుధాలతో సహా లొంగిపోవటం పార్టీకి పెద్ద దెబ్బే
మావోయిస్టు పార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతోంది. మావోయిస్టుపార్టీ దేశంలో సంచలనంగా మారటానికి ప్రధాన కారణం పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ(PGLA) యాక్షన్ టీమ్స్ అనే చెప్పాలి. ఎవరినైనా టార్గెట్ చేయాలని అనుకున్నపుడు డైరెక్టుగా రంగంలోకి దిగేది పీజీఎల్ఏ యాక్షన్ టీమే. టార్గెట్ ను (Maoists)మావోయిస్టు టాప్ ర్యాకింగ్ నేతలు డిసైడ్ చేస్తే వారిని ఎలా మట్టుపెట్టాలన్న ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అంతా పీజీఎల్ఏనే చూసుకునేది. అలాంటి గెరిల్లా టీమ్ కు నాయకత్వం వహించిన మాడ్వీ హిడ్మా(Madvi Hidma) చనిపోయిన రెండునెలలకు డిప్యుటి లీడర్ (Barse Deva)బర్సేదేవా పోలీసులకు సరెండర్ అయిపోయాడు. శుక్రవారం ఉదయం(DGP Telangana Police) డీజీపీ శివధర్ రెడ్డి ముందు తమ టీములోని 15 మంది సభ్యులతో దేవా ఆయుధాలతో సహా లొంగిపోయాడు.
ఎన్ కౌంటర్లో చనిపోకముందు హిడ్మాతో పాటు దేవా కూడా చాలా టార్గెట్లలో పాల్గొన్నాడు. మిలిటరీ ఆపరేషన్ సభ్యులు ఆయుధాలతో సహా దేవాతో పాటు లొంగిపోవటం పార్టీకి పెద్ద దెబ్బే. వీరందరినీ పోలీసులు శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నారు. దేవా కూడా తెలంగాణ-మహారాష్ట్ర-ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని తెలంగాణ అడవుల్లో పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. హిడ్మా ఎన్ కౌంటర్లో చనిపోయినా దేవా ఉన్నాడు కదా అన్న ధీమాతో మావోయిస్టు అగ్రనేతలున్నారు. అలాంటిది దేవా లొంగుబాటుతో మావోయిస్టు అగ్రనేతల ధైర్యం జావగారిపోయిందన్నది వాస్తవం. మావోయిస్టుపార్టీకి కోలుకోలేని దెబ్బగానే పోలీసులు భావిస్తున్నారు. 2025లో సుమారు వెయ్యిమంది మావోయిస్టులు లొంగిపోతే సుమారు 400 మంది ఎన్ కౌంటర్లలో చనిపోయారు. మరో 250మందిని పోలీసులు అరెస్టు చేశారు.
మావోయిస్టు పార్టీలో ఇపుడు యాక్టివ్ గా ఉన్న నేతల్లో పార్టీ చీఫ్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, తెలంగాణ పార్టీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ తో పాటు బర్సేదేవానే కీలకం. అలాంటి దేవా పోలీసులకు ఈరోజు లొంగిపోవటం పార్టీకి గట్టిదెబ్బనే చెప్పాలి. హిడ్మా, దేవా వరసకు అన్నదమ్ములవుతారు. ఇద్దరిదీ సుక్మా జిల్లాలోని పూవర్తి గ్రామమే. మావోయిస్టుపార్టీలో ఎంతో కీలకమైన పీజీఎల్ఏ కార్యకలాపాలు దాదాపు ఆగిపోయినట్లే అనుకోవాలి. ఇప్పటికిప్పుడు పీజీఎల్ఏకి సమర్ధవంతమైన నాయకుడు దొరకటం మావోయిస్టు పార్టీకి కష్టమనే చెప్పాలి. మామూలుగానే ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టుపార్టీ అవసానదశకు చేరుకునేసింది. మావోయిస్టుపార్టీ కేంద్రకమిటీలో ఇపుడు ఉన్నదే ఐదారుమందికి మించిలేరు. వీరిలో కూడా గణపతి, రాజ్ రెడ్డి వృద్ధాప్యం, అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నట్లు పోలీసుల దగ్గర సమాచారం ఉంది. రకరకాల కారణాలతో మావోయిస్టుపార్టీ దాదాపు క్షీణదశకు వచ్చేసింది. ఆపరేషన్ కగార్ మావోయిస్టుపార్టీని దారుణంగా దెబ్బకొట్టేసింది.
1999 డిసెంబర్ 2వ తేదీన కరీంనగర్ జిల్లా కొయ్యూరులో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఆ ఎన్ కౌంటర్లో పార్టీలో కీలకనేతలు నల్లా ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేష్ చనిపోయారు. వీళ్ళు చనిపోయిన ఏడాదికి పార్టీ పీజీఎల్ఏని ఏర్పాటుచేసింది. ప్రముఖులను టార్గెట్ చేసి గెరిల్లా పద్దతిలో హతమార్చటమే ధ్యేయంగా పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ ఏర్పాటైంది. అప్పటినుండి హిడ్మా, దేవా నాయకత్వంలో మావోయిస్టులు పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలపైన ఊహించని రీతిలో దాడులు చేసి సుమారు 350 మందిని చంపేశారు. 2004లో పీజీఎల్ఏలో 8 బెటాలియన్లు, 13 ప్లటూన్లతో సుమారు 12 వేలమంది సైన్యంతో మావోయిస్టు పార్టీ బలంగా ఉండేది. ఇంత భారీ సైన్యం ఉండబట్టే ఎంతోమంది రాజకీయ ప్రముఖులను పీజీఎల్ఏ మట్టుపెట్టగలిగింది.
అయితే కాలక్రమేణా పరిస్ధితులు మారిపోయి పార్టీ బలహీనపడింది. దాంతో పీజీఎల్ఏ ప్రభావం కూడా తగ్గిపోయింది. హిడ్మా నాయకత్వంలో పీజీఎల్ఏ పర్వాలేదు అన్నట్లుగా ఉండేది. అలాంటిది హిడ్మా మరణించటం, ఇపుడు దేవా కూడా లొంగిపోవటంతో పీజీఎల్ఏకి సమర్ధవంతమైన నాయకత్వం లేదనే చెప్పాలి.

