గణపతిపై మైండ్ గేమ్ పెరిగిపోతోందా
x
Maoist leader Ganapati

గణపతిపై మైండ్ గేమ్ పెరిగిపోతోందా

అజ్ఞాతంలో ఉన్న గణపతి కూడా పోలీసుల ముందు లొంగిపోవాలని డీజీపీ పిలుపిచ్చారు


మావోయిస్టుపార్టీ కేంద్రకమిటి సభ్యుడు, కేంద్ర కమిటి మాజీ కార్యదర్శి ముప్పాళ లక్ష్మణరావు అలియాస్ గణపతి మీద మైండ్ గేమ్ పెరిగిపోతోంది. బుధవారం మావోయిస్టుపార్టీ కార్యదర్శి దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతితో పాటు కేంద్రకమిటి సభ్యులు మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు అలియాస్ దామోదర్ తో పాటు మరికొందరు మావోయిస్టులు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీ బీ శివధరరెడ్డి మాట్లాడుతు మావోయిస్టు పార్టీ ప్రాభవం క్షీణదశకు చేరుకున్నట్లు చెప్పారు. అజ్ఞాతంలో ఉన్న గణపతి కూడా పోలీసుల ముందు లొంగిపోవాలని పిలుపిచ్చారు. అజ్ఞాతంలో ఉండి చేయగలిగేది ఏమీలేదన్నారు. గణపతి నేపాల్ లో ఉన్నట్లు సమాచారం అందుతోందని, అనారోగ్యంతో చికిత్స చేయించించుకుంటున్నట్లు సమాచారం ఉందని అన్నారు.

డీజీపీ అలా అన్నారో లేదో బీర్ పూర్ లోని గణపతి సోదరుడు ముప్పాళ రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతు గణపతిని లొంగిపోవాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. జగిత్యాల జిల్లాలోని బీర్ పూర్లో మాట్లాడుతు ‘మీరు ఆరోగ్యంతో ఉండాలని గ్రామస్ధులంతా ప్రత్యేక పూజలు చేస్తున్నారు’ అని తెలిపారు. నేపాల్ లో ఉన్నారని, ఆరోగ్యం బావోలేదని, వార్తల్లో వింటున్నట్లు చెప్పారు. పార్టీలోని అగ్రనేతలంతా లొంగిపోయిన తర్వాత ఒక్కళ్ళు ఇంకా అజ్ఞతంలో ఉండి చేసేది ఏముంది ? అని రామచందర్ రావు సోదరుడిని ప్రశ్నించారు. పైగా ప్రస్తుత కాలంలో సమాజానికి మావోయిస్టుల అవసరం ఏమాత్రం లేదు అని కూడా తేల్చేశారు. కాబట్టి పోలీసులకు లొంగిపోయి శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపాలని విజ్ఞప్తిచేశారు. అలాగే ఒకవేళ గణపతి లొంగిపోతే ఆయనను కుటుంబానికి జాగ్రత్తగా అప్పగించాలని రామచందర్ రావు కోరారు.

అనారోగ్యంతో గణపతి

కొద్దిరోజులుగా ఒక సమాచారం చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే గణపతి వయసు ఇపుడు 77. తీవ్రమైన అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. 2004లో మావోయిస్టుపార్టీకి కార్యదర్శి అయిన గణపతి అనారోగ్య కారణంతోనే బాధ్యతల నుండి తప్పుకున్నారు. కార్యదర్శి బాధ్యతలను నంబాల కేశవరావుకు 2018లో అప్పగించేశారు. అప్పటినుండి గణపతి పార్టీకి కేవలం మార్గదర్శనం మాత్రమే చేస్తున్నారు. ఎందుకంటే తీవ్రమైన అనారోగ్యం కారణంగా యాక్టివ్ గా ఉండటంలేదు. ఎవరిసాయం లేకుండా కనీసం పది అడుగులు కూడా వేయలేనంత అనారోగ్యంతో గణపతి ఉన్నట్లు పోలీసులకు సమాచారం ఉంది.

ఆపరేషన్ కగార్ కారణంగా వందలాది మంది మావోయిస్టులు ఒకవైపు లొంగిపోతుంటే మరోవైపు ఎన్ కౌంటర్లలో చనిపోతున్నారు. పదులసంఖ్యలో మావోయిస్టులను పోలీసులను అరెస్టులు కూడా చేశారు. జరుగుతున్న వ్యవహారాలను చూసిన తర్వాత సుమారు ఏడాది క్రితమే గణపతి దేశం దాటిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఛత్తీస్ ఘడ్, పశ్చిమబెంగాల్ మీదుగా నేపాల్ వెళ్ళిపోయాడని సమాచారం. అలాగే నేపాల్ నుండి థాయ్ ల్యాండ్ కూడా వెళ్ళిపోయుండచ్చని కూడా అనుమానిస్తున్నారు. ఏదేమైనా గణపతిని లొంగిపోవాలని ఒకవైపు స్వయంగా డీజీపీ మరోవైపు సోదరుడు రామచందర రావుతోనే కాకుండా లొంగిపోయిన మావోయిస్టు కీలక నేతలతో కూడా పోలీసులు బాగా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మొత్తంమీద గణపతి లొంగుబాటుపై పోలీసులు బాగానే మైండ్ గేమ్ పెంచేస్తున్నారు.

Read More
Next Story