
గ్యాస్ సిలిండర్లపై యుద్ధ ప్రభావం ?
మరికొన్ని రోజులు యుద్ధం జరిగితే క్రూడాయిల్, గ్యాస్ తదితరాలకు కొరత పెరిగిపోయే అవకాశాలున్నాయి
గల్ఫ్ లో ఆరురోజులుగా జరుగుతున్న యుద్ధం కారణంగా గ్యాస్ కొరత వచ్చే అవకాశాలున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్+అమెరికా మద్య ఆరురోజులక్రితం మొదలైన యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. మరికొన్ని రోజులు యుద్ధం జరిగితే క్రూడాయిల్, గ్యాస్ తదితరాలకు కొరత పెరిగిపోయే అవకాశాలున్నాయి. మనదేశానికి గ్యాస్, క్రూడాయిల్ ప్రధానంగా గల్ఫ్ దేశాలనుండే వస్తుంది. యుద్ధం నేపధ్యంలోనే ఇరాన్ హర్మూజ్ కెనాల్ ను మూసేసింది. తన ఆధీనంలోని హర్మూజ్ కెనాల్ గుండా ఆయిల్, గ్యాస్ తీసుకెళ్ళే నౌకలను పేల్చేస్తామని ఇరాన్ హెచ్చరికలు కూడా జారీచేసింది. దాంతో ఇరాన్ తో పాటు హర్మూజ్ కెనాల్ గుండా ఆయిల్, గ్యాస్ రవాణా చేస్తున్న దేశాల నౌకలన్నీ ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. ఫలితంగా ఆయిల్, గ్యాస్ కొరత పెరిగిపోయే ప్రమాదముంది.
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వినియోగదారులు గ్యాస్ బండలను ముందుజాగ్రత్తగా తెచ్చిపెట్టుకుందామని అనుకున్నట్లున్నారు. అందుకనే కొద్దిరోజులుగా గ్యాస్ బుకింగులు పెరిగిపోతున్నాయి. దాంతో ఈ విషయాన్ని గమనించిన కంపెనీలు అప్రమత్తమయ్యాయి. గ్యాస్ బుకింగులపై అనధికారికంగా నియంత్రణను విధించాయి. యుద్ధం మొదలు కాకముందు గ్యాస్ బండలను తక్కువ వ్యవధిలో కూడా బుక్ చేసుకుని ఏజెన్సీలు పంపించేవి. ఇపుడు ఏమిచేస్తున్నాయంటే రెండు గ్యాస్ బండల బుకింగ్ మద్య డబుల్ సిలిండర్ వినియోగదారులకు 30 రోజులు, సింగిల్ సిలిండర్ వినియోగదారులకు 21 రోజుల గడువును అనధికారికంగా అమలు చేస్తున్నారు.
తెలంగాణలో మొత్తం 1.30 కోట్ల గ్యాస్ సిలిండర్ల వినియోగదారులున్నారు. ప్రధానంగా ఇండేన్ గ్యాస్, భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ వినియోగదారులే ఎక్కువ. ఈ మూడు కంపెనీల వినియోగదారుల నుండి నెలకు సుమారు 60 లక్షల బుకింగులు వస్తుంటాయి. యుద్ధ ప్రభావంతో కొద్దిరోజుల తర్వాత గ్యాస్ దొరకదేమో అన్న భయంతోనే వినియోగదారులు వెంటవెంటనే గ్యాస్ ను బుక్ చేస్తున్నారు. ఇండేన్ గ్యాస్ వినియోగదారులు 60 లక్షలు, భారత్ గ్యాస్ వినియోగదారులు 38 లక్షలుంటే, హెచ్పీ గ్యాస్ వినియోగదారులు 27 లక్షలమంది ఉన్నారు. వీళ్ళు కాకుండా ప్రధానమంత్రిఉజ్వలయోజన పథకంలో వినియోగదారులు కూడా ఉన్నారు.
గ్రేటర్లోనే ఎక్కువ
సహజంగానే ఎక్కువ జనాలున్న ప్రాంతాల్లోనే కనెక్షన్లు కూడా ఉంటాయి. ఈ పద్దతిలో హైదరాబాద్ లో 18 లక్షల కనెక్షున్నాయి. తర్వాత రంగారెడ్డిలో 12 లక్షలు, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 10 లక్షలు, నల్గొండ జిల్లాలో 6 లక్షలు, కరీంనగర్ జిల్లాలో 5 లక్షల కనెక్షున్నాయి. అపార్ట్ మెంట్లు, అర్బన్ హౌసింగ్, రో హౌసెస్, గేటెడ్ కమ్యూనిటీస్, కాలనీలు ఎక్కువగా ఉన్న కారణంగా హైదరాబాద్ నగరంలో అత్యధిక గ్యాస్ కనెక్షన్లు ఉండటం గమనార్హం.

