ఉత్తరప్రదేశ్ సత్సంగ్‌లో 116కు చేరిన మృతుల సంఖ్య..
యూపీలోని హత్రాస్ జిల్లా ఫుల్రాయి గ్రామంలో మతపర కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 116 మంది చనిపోయారు. ఈ ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని సీఎం ఆదిత్యనాథ్ ఆదేశించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ జిల్లా ఫుల్రాయి గ్రామంలో 'సత్సంగ్' సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 116 మంది చనిపోయారు. వీరిలో దాదాపు చాలామందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ప్రాణనష్టం వివరాలను చీఫ్ సెక్రటరీ మనోజ్ కుమార్ సింగ్ తెలియజేస్తూ ..116 మంది మృతుల్లో ఏడుగురు పిల్లలు, ఒక పురుషుడు, మిగిలినవారంతా మహిళలనేనని చెప్పారు.
కేసు నమోదు..
తొక్కిసలాటకు కారణమైన బాధ్యులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. దేవప్రకాష్ మధుకర్ అనే వ్యక్తితో పాటు కార్యక్రమ నిర్వాహకులపై సికందరరావు పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఓ పోలీసు సీనియర్ అధికారి తెలిపారు.
24 గంటల్లో నివేదికను సమర్పించాలి..
ఈ ఘటనపై అత్యవసరంగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. దాంతో ఏడీజీ ఆగ్రా, అలీగఢ్ డివిజనల్ కమిషనర్‌తో కూడిన బృందం కేసు విచారణ వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం హత్రాస్‌ను సందర్శించే అవకాశం ఉందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
సీఎం మంగళవారం న నివాసంలో మాట్లాడుతూ.. ఈ ఘటనపై తమ ప్రభుత్వం లోతుగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక కుట్రపూరితంగా జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది పేర్కొన్నారు.
ఈ విషాద ఘటనపై రాజకీయాలు చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. బాధితులపై సానుభూతి చూపాల్సిన సమయంలో విమర్శలు, ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని గుర్తు చేశారు.
హత్రాస్ జిల్లాలో భోలే బాబాగా పేరున్న నారాయణ్ సకర్ విశ్వ హరి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. నిర్వాహకులు ఇచ్చిన అనుమతి కంటే ఎక్కువ మంది హాజరయ్యారు.