మావోయిస్టులు ‘పద్మవ్యూహం’లో విలవిల్లాడుతున్నారా ?
x
Armed forces combing Dantewada forest under Operation Kagar

మావోయిస్టులు ‘పద్మవ్యూహం’లో విలవిల్లాడుతున్నారా ?

మావోయిస్టు రహిత దేశంగా మార్చటంలో భాగంగా భద్రతాదళాలు ఆపరేషన్ కగార్ రూపంలో అన్నీవైపుల నుండి మావోయిస్టులను చుట్టుముడుతున్నారు


పద్మవ్యూహంలో ఇరుక్కున్న అభిమాన్యుడులాగే ఇపుడు మావోయిస్టులు కూడా భద్రతాదళాల చేతిలో ఇరుక్కున్నట్లు అనిపిస్తోంది. కారణం ఏమిటంటే మావోయిస్టు రహిత దేశంగా మార్చటంలో భాగంగా భద్రతాదళాలు (Operation Kagar)ఆపరేషన్ కగార్ రూపంలో అన్నీవైపుల నుండి మావోయిస్టులను చుట్టుముడుతున్నారు. తాజాగా(Maoist party) మావోయిస్టుపార్టీ కేంద్రకమిటి సభ్యుడు పాకా హనుమంతు అలియాస్ ఉయికే గణేష్ తో పాటు మరికొందరు ఎన్ కౌంటర్లో(Encounter) చనిపోయారు. ఒడిస్సాలోని బీజపూర్ లో గురువారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. అలాగే ఛత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లాలో ఈమధ్యనే జరిగిన మరో ఎన్ కౌంటర్లో 18మంది మావోయిస్టులు చనిపోయారు. ఆపరేషన్ కగార్ ను నూరుశాతం సక్సెస్ చేయటానికి డెడ్ లైన్ 2026, మార్చి 31 అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈలోగానే మావోయిస్టులందరినీ లేపేయాలని భద్రతాదళాలు చాలా కసిగా అడవులను జల్లెడపడుతున్నాయి.


మావోయిస్టులు ముఖ్యంగా ఛత్తీస్ ఘడ్ లోని దంతెవాడ, బస్తర్ అడవులతో పాటు తెలంగాణలోని కర్రెగుట్టల్లో కొందరున్నారు. వీళ్ళల్లో ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా ఎన్ కౌంటర్లు చేసేయాలన్న ఉద్దేశ్యంతోనే భద్రతాదళాలు రాత్రనక పగలనకా అడవుల్లో క్యాంపులు వేసుకుని మరీ కూంబింగులు చేస్తున్నాయి. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం మావోయిస్టులు ఇపుడు ఛత్తీస్ ఘడ్ లోని సుక్మా, బీజాపూర్, నారాయణ్ పూర్ జిల్లాలతో పాటు కొంతమంది ఒడిస్సా, మరికొందరు తెలంగాణలోను ఉన్నారంతే. వీరుకూడా తమప్రాణాలను కాపాడుకుకోవటానికి ఎక్కడో అడవుల్లో తలదాచుకుంటున్నారు. వీళ్ళని పట్టుకోవటానికే భద్రతాదళాలు అడవులను జల్లెడపడుతున్నాయి.

3 జిల్లాలకే పరిమితమా ?

ఎన్ కౌంటర్లలో చనిపోవటమా లేకపోతే పోలీసుల ముందు లొంగిపోవటమా అన్న ఆప్షన్ మాత్రమే మావోయిస్టులకు కనబడుతోంది. ఈఏడాది మొదట్లో 18 జిల్లాల్లో ఉన్న మావోయిస్టుల ప్రభావం డిసెంబర్ నాటికి కేవలం మూడు జిల్లాలకు మాత్రమే పరిమితమైందంటే పరిస్ధితి ఎలాగుందో అర్ధమైపోతోంది. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ట్వీట్ లో స్పష్టంచేశారు. మావోయిస్టులు మూడు జిల్లాలకు మాత్రమే పరిమితమైపోయారని అమిత్ తన ట్వీట్లో చెప్పారు. ఈ ఏడాది ఆరంభంనుండే భద్రతాదళాలు మావోయిస్టులపై పూర్తిస్ధాయిలో పట్టుసాధించాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2 వేలమందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. మరో వెయ్యిమంది అరెస్టవ్వగా సుమారు 350 మంది ఎన్ కౌంటర్లలో చనిపోయారు.


మావోయిస్టు కేంద్రకమిటి ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరరావు ఎన్ కౌంటరవ్వటం మావోయిస్టుపార్టీకి పెద్ద దెబ్బ. అలాగే పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ కార్యదర్శి మాడ్వీ హిడ్మా ఎన్ కౌంటర్ మావోయిస్టుపార్టీకి కోలుకోలేని దెబ్బనే చెప్పాలి. మావోయిస్టుపార్టీలో దాదాపు తొమ్మిదిమంది కేంద్రకమిటిసభ్యులు ఎన్ కౌంటర్లో మరణించగా మరో ముగ్గురు ఆశన్న, మల్లోజుల వేణుగోపాల్, సుజాత పోలీసులకు లొంగిపోయారు. ఇంటెలిజెన్స్ అధికారుల లెక్కల ప్రకారం కేంద్ర కమిటిలో ఉన్నది ఇక ఆరుమంది మాత్రమే. కేంద్రకమిటి సభ్యుల్లో కూడా కొందరు వృద్ధాప్యం, అనారోగ్యాలతో ఇబ్బందిపడుతున్నారు. ఈనేపధ్యంలోనే దళసభ్యులు, కిందస్ధాయిలో పనిచేసేవారిలో పోలీసులకు లొంగిపోయి ప్రాణాలు దక్కించుకుంటే అదే పదివేలు అన్నభావన క్రియేట్ చేయటంలో భద్రతాదళాలు దాదాపు విజయం సాధించాయనే చెప్పాలి. అందుకనే నవంబర్ మాసంలో వందలసంఖ్యలో మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయింది.

బీటలువారిన పెట్టనికోట

ఒకపుడు దండకారణ్యం, బస్తర్ జిల్లా అడవుల్లోకి పోలీసులు అడుగుపెట్టడమే కలలోని విషయంగా ఉండేది. అలాంటిది ఇపుడు దండకారణ్యంలోని చాలాప్రాంతాల్లో భద్రతాదళాలు బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకుని కూంబింగ్ చేస్తున్నాయి. ఒక్క దండకారణ్యంలోనే భద్రతాదళాలు సుమారు 60 వేలమందితో అడవులను గాలిస్తున్నాయి. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక బేస్ క్యాంపును ఏర్పాటు చేస్తున్నాయి. ప్రతిక్యాంపులోను అత్యాధునిక ఆయుధాలు, కమ్యూనికేషన్ వ్యవస్ధ, వాహనాలతో 500 మంది క్యాంపులో ఉంటున్నారు. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేయటంతో ఈ క్యాంపులపై దాడులుచేయటానికి మావోయిస్టులకు అవకాశాలు దొరకటంలేదు.


ఒకవైపు పదులసంఖ్యలో బేస్ క్యాంపుల ఏర్పాటు, మరోవైపు వేలాదిమంది భద్రతాదళాలు అడవుల్లో గాలింపుచర్యలు చేపట్టడంతో మావోయిస్టులకు తప్పించుకునే మార్గాలు మూసుకుపోతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గుహల్లో, బంకర్లలో దాక్కున్న మావోయిస్టులను కూడా భద్రతాదళాలు ద్రోన్ల సాయంతో గుర్తిస్తున్నాయి. హెలికాప్టర్లు, ద్రోన్ల ద్వారా ఆకాశమార్గంలోను, బేస్ క్యాంపు నుండి సమాచార మార్పిడి, అడవుల్లో గాలింపులతోను భద్రతాదళాలు మావోయిస్టులపై అన్నీకోణాల్లో ఒత్తిడి పెంచేస్తున్నాయి. ఈనేపధ్యంలోనే ప్రాణాలు ముఖ్యమని అనుకుంటున్న మావోయిస్టులు లొంగిపోతున్నారు లేదా ఎదురుకాల్పుల్లో చనిపోతున్నారు. 2026, మార్చి 31 డెడ్ లైన్ దగ్గర పడుతున్న కొద్దీ భద్రతాదళాలు ఆపరేషన్ కగాన్ ను విజయవంతం చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాయి. అందుకనే తెలంగాణ-మహారాష్ట్ర-ఛత్తీస్ ఘడ్-ఒడిస్సా అడవుల్లో భద్రతాదళాల్లోని సుమారు 2 లక్షలమంది రేయింబవళ్ళు పనిచేస్తున్నారు.


మావోయిస్టు కేంద్రకమిటి సభ్యులు ముప్పాళ లక్ష్మణరావు అలియాస్ గణపతి, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, పతిరామ్ మాన్జీ అలియాస్ అనల్ దా, పుసునూరి నరహరి అలియాస్ సంతోష్, లాల్చంద్ హేమ్ రామ్ అలియాస్ అన్మోల్ దా తో కలిపి మహావుంటే 500 మంది వివిధ స్ధాయిల్లోని మావోయిస్టులు ఉండుంటారని భద్రతాదళాలు అంచనా వేస్తున్నాయి. అందుకనే ఆపరేషన్ కగార్ టార్గెట్ ను తేలికగా చేరుకోవచ్చని అమిత్ షా అంచనా వేశారు.

తగ్గుతున్న సహకారం


మావోయిస్టులకు ఒకపుడు ఆదివాసీల్లో దక్కిన మద్దతు ఇపుడు కనబడటంలేదు. దండకారణ్యం, కర్రెగుట్టల్లోని అడవుల్లో మావోయిస్టులు ఎంతకాలం ఉన్నా ఆ సమాచారం పోలీసులకు తెలిసేదికాదు. కారణం ఏమిటంటే స్ధానికంగా ఉండే ఆదివాసీల మద్దతే. ఇంతకాలం హిడ్మా పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకుని తిరుగుతున్నాడంటే ఆదివాసీలే కారణం. హిడ్మా అనుపానులను కూడా ఆదివాసీలు బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. అలాంటిది కొన్ని సంవత్సరాలుగా ఆదివాసీల నుండి మావోయిస్టులకు సహకారం తగ్గిపోతున్నట్లు సమాచారం. కారణం ఏమిటంటే ఆదివాసీల్లోని యువత విద్య, ఉపాధి, ఉద్యోగాలపై ఎక్కువగా దృష్టిపెట్టాయి. చదువులు, ఉపాధి, ఉద్యోగాల కోసం అడవులను దాటి పట్టణ, నగరాల్లో ఉంటున్న యువతకు అడవుల్లోని తమపరిస్ధితిని పోల్చిచూసుకుంటున్నపుడు తేడాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఆదివాసీల్లోని పెద్దతరంకు ఇప్పటి తరానికి ఆలోచనల్లో చాలా తేడాలుంటున్నాయి. అదీకాకుండా పోలీసు ఇన్ఫార్మర్ల పేరుతో ఆదివాసీలను చంపేస్తుండటం కూడా మావోయిస్టులపై వ్యతిరేకత పెరిగిపోయింది. అందుకనే మావోయిస్టులకు మునుపటిలా అడవుల్లో ఆదివాసీల మద్దతు దొరకటంలేదు. ఇలాంటి అనేక కారణాల వల్ల మావోయిస్టులపైన భద్రతాదళాలది పైచేయవుతోంది. ఈ నేపధ్యంలోనే డెడ్ లైన్ నాటికి మావోయిస్టుల పరిస్ధితి ఎలాగుంటుందో చూడాలి.

అంతిమదశకు చేరుకున్నది : జంపన్న

ఆపరేషన్ కగార్ దెబ్బ మావోయిస్టులపైన తీవ్ర ఒత్తిడికి గురిచేసిందని మాజీ మావోయిస్టు జంపన్న అన్నారు. తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘అనేకమంది కేంద్రకమిటి సభ్యులతో పాటు రాష్ట్రకమిటి సభ్యులు కూడా చనిపోయారు’’ అని చెప్పారు. ‘‘కేంద్రకమిటిలో చాలాకొద్దిమంది మాత్రమే మిగిలున్నారు’’ అని జంపన్న అభిప్రాయపడ్డారు. ‘‘మావోయిస్టుపార్టీ నేతలమధ్యనే సమన్వయం కొరవడినట్లు కనబడుతోంది’’ అన్నారు. ‘‘మావోయిస్టుపార్టీకి అంతిమదశ చేరువైనట్లు అర్ధమవుతోంది’’ అనికూడా అన్నారు. ‘‘డెడ్ లైన్ అన్నది మాట్లాడుకోవటానికి తప్ప వాస్తవంగా లెక్కలోకి తీసుకోవక్కర్లేదు’’ అన్నారు. ‘‘మావోయిస్టుల సాయుధపోరాటం విఫలమైందన్న విషయం అందరికీ అర్ధమైంది’’ అని చెప్పారు. ‘‘మావోయిస్టులు ఉంటారు, మావోయిజాన్ని కూడా ఎవరూ నిర్మూలించలేరు’’ అని అభిప్రాయపడ్డారు ‘‘60ఏళ్ళ నక్సల్ బరి చరిత్రలో సాయుధపోరాటం చాలా తొందరగానే ముగుస్తోంది’’ అని చెప్పారు. ‘‘కేంద్ర, రాష్ట్ర కమిటీల్లో ఎంతమంది కీలకనేతలు ఉన్నారన్న విషయం ఎవరు కరెక్టుగా చెప్పలేరు’’ అని జంపన్న అన్నారు.

Read More
Next Story