
ఘోష్ కమిషన్ కేసు తీర్పు వాయిదా
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలపై విచారణ కమిషన్‌పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు వాయిదా పడింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ దాదాపు ఏడాదిన్నరపాటు విచారణ జరిపింది. ఆ తర్వాత తమ విచారణకు సంబంధించి రిపోర్ట్‌ను ప్రభుత్వానికి అందించింది. కాగా సదరు కమిషన్ రిపోర్ట్ అంశం హైకోర్టులో నడుస్తోంది. విచారణ సమయంలో కమిషన్ నిబంధనలను తుంగలో తొక్కిందంటూ పలువురు నేతలు, అధికారులు హైకోర్టు ఆశ్రయించారు. ఆ పిటిషన్లను విచారించిన న్యాయస్థానం.. ఆ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలా? వద్దా? అన్న అంశంపై తీర్పు ఇవ్వాల్సి ఉంది. తాజాగా ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం తుది తీర్పును వాయిదా వేసింది. ఏప్రిల్ 22న ఈ అంశంలో తీర్పు వెలువరిస్తామని పేర్కొంది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో విచారణ కోసం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. దీనిపై దాఖలైన పిటిషన్లను కోర్టు ఇప్పటికే సవివరంగా విచారించింది. 2024 మార్చి 14న ప్రభుత్వం జీవో 6ను జారీ చేస్తూ జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్‌ను నియమించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలువురు ప్రముఖులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి టి. హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్, మాజీ ఐఏఎస్ అధికారి ఎస్.కె. జోషి కోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘంగా వాదనలు విన్నది. తాజా పరిణామాలతో ఈ కేసులో తదుపరి పరిణామాలపై దృష్టి నెలకొంది. కోర్టు తుది తీర్పు కోసం అన్ని వర్గాలు ఎదురుచూస్తున్నాయి.

