Telangana High Court
x

రిటైర్మెంట్ బకాయిలు.. సర్కార్‌కు తెలంగాణ హైకోర్ట్ డెడ్‌లైన్

రిటైర్ అయిన ఉద్యోగుల బకాయిల చెల్లింపులో ఆలస్యం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నిర్దేశిత గడువులో చెల్లింపులు పూర్తి చేయాలని ఆదేశించింది.


రిటైర్ అయిన ఉద్యోగుల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు డెడ్‌లైన్ పెట్టింది. వారికి రావాల్సిన రిటైర్మెంట్ లాభాలు, వాటి బకాయిలను ఏప్రిల్ 9లోపు చెల్లించాలని తేల్చి చెప్పింది. ఒకవేళ వాటిని అందించడంలో జాప్యం జరిగినా, అలసత్వం కనబరిచినా న్యాయస్థానం కఠినమైన చర్యలు తీసుకుంటుందని కూడా హైకోర్టు హెచ్చరించింది. అంతేకాకుండా వీటిని చెల్లించడంలో విఫలమయితే ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ర సుల్తానియా వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందు హాజరుకావాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి తాజాగా జరిగిన వాయిదాలో న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

దాదాపు 654 మంది రిటైర్డ్ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ నమవరపు రాజేశ్వర్ రావు విచారణ జరిపారు. బకాయిలు చెల్లించడంలో తీవ్ర ఆలస్యం కావంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విచారణ సందర్భంగానే దాదాపు 80 మంది రిటైర్డ్ ఉద్యోగులు తమ బెనిఫిట్స్ అందుకోకుండానే కాలం చేశారని న్యాయస్థానం గుర్తించింది. బెనిఫిట్స్ అందడంలో జరిగిన ఆలస్యం వల్ల మానసిక ఒత్తిడికిలోనై వారు మరణించారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. బెనిఫిట్స్ డబ్బు ఏమీ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తున్న దానం కాదని, వారు కష్టపడి సంపాదించుకున్నదని తెలిపిన న్యాయస్థానం.. ఈ అంశాన్ని వెంటనే సెటిల్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ సందర్భంగా ఈ కేసులో ప్రభుత్వం తరుపు న్యాయవాది పదేపదే వాయిదాలు కోరడాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. వాయిదాలు వేస్తే జరిగే మానవీయ నష్టాన్ని గుర్తించాలని కోర్టు పేర్కొంది. అనంతరం ఈ అంశంలో ప్రభుత్వం కోరిన అదనపు 30 రోజుల గడువు ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది.

సుమారు 3,650 కేసుల్లో టోకెన్లు జారీ అయినప్పటికీ, దాదాపు 2,600 మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఇంకా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు 1,056 కేసులు మాత్రమే పరిష్కరించబడినట్లు ప్రభుత్వం తెలిపింది. జీపీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ కమ్యూటేషన్, లీవ్ ఎన్‌కాష్‌మెంట్, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలు పెండింగ్‌లో ఉన్నట్లు కోర్టుకు తెలియజేశారు. గత రెండేళ్లుగా చెల్లింపులు ఆలస్యం కావడంతో రిటైర్డ్ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు.

ఇంతకు ముందు ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంతో అవమాన పిటిషన్లు దాఖలయ్యాయి. గత ఆరు నెలలుగా వాయిదాలు కొనసాగుతుండటంతో తాజా కఠిన ఆదేశాలు వెలువడ్డాయి. రిటైర్డ్ ఉద్యోగులు తమ హక్కైన డబ్బును మాత్రమే కోరుతున్నారని, ఎలాంటి ఉపకారం కాదు అని కోర్టు స్పష్టం చేసింది. ఆలస్యాల వల్ల అప్పులు, ఆర్థిక అస్థిరత పెరిగిందని కూడా గుర్తించింది.

Read More
Next Story