
తెలంగాణలో హీట్ వేవ్ అలెర్ట్
తెలంగాణలో వడగాలుల హెచ్చరిక : హీట్‌వేవ్ అలర్ట్
ఎండల ఎఫెక్ట్ పెరుగుతుంది..ఉత్తర, తూర్పు జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చత్తీస్‌ఘడ్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతుండగా, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు జిల్లాల్లో వడగాలులు తీవ్రంగా వీచే సూచనలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఐఎండీ విడుదల చేసిన హీట్ వేవ్ చిత్రపటం
2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగే అవకావం : ఐఎండీ
తెలంగాణ రాస్ట్రంలో ఏప్రిల్ 9వతేదీ నుంచి 15వతేదీ వరకు పొడి వాతావరణం ఉంటుందని ఆమె తెలిపారు. హైదరాబాద్ ప్రాంతంలో తదుపరి 24 గంటల పాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉదయం వేళ ల్లో పొగమంచుతో వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్పారు. రాబోయే మూడు రోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రత 37.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.8 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని తెలిపారు.
రాబోయే మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని డాక్టర్ నాగరత్న వివరించారు.
తెలంగాణ వెదర్ మ్యాన్ విడుదల చేసిన హీట్ వేవ్ అలెర్ట్ చిత్రపటం (ఫొటో :ఎక్స్ పోస్టు/ తెలంగాణ వెదర్ మ్యాన్ సౌజన్యంతో)
ఏప్రిల్ 12 నుంచి తీవ్ర వడగాలులు : తెలంగాణ వెదర్ మ్యాన్
తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో ఏప్రిల్ 12 నుంచి 22వతేదీ వరకు తీవ్ర వడగాలులు వీస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాబోయే పది రోజులపాటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా ఉంటాయని, ప్రజలు తీవ్ర మైన వేడి వాతావరణం నుంచి అప్రమత్తంగా ఉండాలని వెదర్ మ్యాన్ హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు 2నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే అవకాశం ఉన్నందున వాతావరణ నిపుణులు తెలంగాణలో వడగాలుల హెచ్చరిక జారీ చేశారు.తెలంగాణ చిత్రపటంలో రెడ్ మార్కింగ్ చేసిన ఉత్తర, తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ దాటవచ్చని వెదర్ మ్యాన్ తెలిపారు.
హైదరాబాద్ నగరంలో పదిరోజుల పాటు ఉష్ణోగ్రతలు 40 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశముందని తెలంగాణ వెదర్ మ్యాన్ పేర్కొన్నారు.
వడదెబ్బ లక్షణాలు
వడదెబ్బ వల్ల అనారోగ్య సమస్యలైన వికారం, వాంతులు, అధిక శరీర ఉష్ణోగ్రత, తలనొప్పి, కళ్లు తిరగడం, కండరాల నొప్పులు, వేగవంతంగా గుండె కొట్టుకోవడం, గందరగోళం లేదా మూర్ఛ వంటి మానసిక స్థితిలో మార్పులు వంటి అనేక ప్రమాద లక్షణాలుంటాయని వైద్యులు చెప్పారు.
వేసవిలో వైద్యుల సూచనలు
రాష్ట్రంలో తీవ్ర వడగాలుల నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం వేళల్లో అనవసర ప్రయాణాలు చేయవద్దని వాతావరణశాఖ నిపుణులు సూచించారు. తగినంత మంచినీరు తాగాలని, నీడపట్టున ఉండాలని కోరారు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్ (ORS) లేదా నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసం వంటి ఇంట్లో తయారుచేసిన ద్రవాలను ఉపయోగించాలని ప్రజలకు వైద్యులు సూచించారు. ప్రయాణించేటప్పుడు నీటిని వెంట తీసుకువెళ్లాలని, పుచ్చకాయ, దోసకాయ, నిమ్మ పండ్ల వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే కాలానుగుణ పండ్లను తినాలని కూడా వైద్యులు సలహా ఇచ్చారు.బయటకు వెళ్ళినప్పుడు వదులుగా ఉండే, లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలని, గొడుగులు, టోపీలు లేదా సాంప్రదాయ తలపాగాలతో తలను కప్పుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు.
మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య బహిరంగ కార్యకలాపాలను పరిమితం చేసుకోవాలని, గాలి ప్రసరణ ఉండే చల్లని ప్రదేశాలలో ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం సూచించింది.
మొత్తానికి రాష్ట్రంలో తీవ్ర వడగాలుల పరిస్థితులు నెలకొనే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండటం అత్యవసరం. వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ తగినంత నీరు తీసుకోవడం, ఎండ వేళల్లో బయటకు వెళ్లకుండా ఉండటం ద్వారా వడదెబ్బను నివారించుకోవచ్చు. అధికారుల హెచ్చరికలను గమనించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఈ తీవ్రమైన వేసవిని సురక్షితంగా ఎదుర్కొనవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Next Story

