
వాహనాలు కొనేవాళ్ళకు ‘సేఫ్టీ’ షాక్
కొత్తగా విధించబోయే రోడ్డుభద్రతా పన్ను మార్చి 1వ తేదీనుండి అమల్లోకి వస్తున్నది
వాహనాలను కొనేవాళ్ళకు తెలంగాణ రవాణాశాఖ భారీ షాక్ ఇచ్చింది. పోయిన ఏడాదే కొత్తవాహనాలపై జీవితకాల పన్ను, పౌరసేవల ఫీజులు చెల్లింపుతో పాటు ఇన్స్యూరెన్సును కంపల్సరీ చేసిన రవాణాశాఖ తాజాగా రోడ్డు భద్రతా పన్నును వడ్డించబోతోంది. కొత్తగా విధించబోయే రోడ్డుభద్రతా పన్ను మార్చి 1వ తేదీనుండి అమల్లోకి వస్తున్నది. వాహనం కొనుగోలు సమయంలోనే జీవితకాలం పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇన్స్యూరెన్సుతో పాటు రోడ్ సేఫ్టీ ట్యాక్స్ కూడా చెల్లించాల్సిందే తప్ప వేరేదారిలేదు. గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల పరిధిలో ఏటా 2 లక్షల వాహనాలను జనాలు కొంటున్నారు. వ్యక్తిగత రవాణా, ఇతర కేటగిరీలకు చెందిన వాహనాలపైన రోడ్డు సేఫ్టీ ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఇకనుండి ప్రతి ఏడాది రు. 130 కోట్ల ఆదాయం లభించే అవకాశముంది.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రోడ్డు భద్రతా చట్టంలో భాగంగానే రోడ్డు భద్రతా పన్నును రవాణాశాఖ కొత్తగా వాహన యజమానులపైన వడ్డించబోతోంది. ఈ పన్ను దేశంలోని అన్నీరాష్ట్రాల్లోను కేంద్రప్రభుత్వం విధిస్తోంది. వ్యక్తిగత కేటగిరిలో టూవీలర్స్ పైన రు. 2 వేలు, కార్లపైన రు. 5 వేలు ట్యాక్స్ చెల్లించాలి. 4 సీట్లు, 7 సీట్ల సామర్ధ్యం ఉన్న వాహనాలు, అంతకన్నా ఎక్కువ సామర్ధ్యం కలిగిన వాహనాల కొనుగోలు సమయంలోనే రు. 10 వేల ట్యాక్స్ చెల్లించాల్సుంటుంది. వాహనాల కోనుగోలు సమయంలోనే చెల్లించే ‘సేఫ్టీ ట్యాక్స్ నిధి’ని రకరకాల అవసరాలకు ఉపయోగించబోతోంది ప్రభుత్వం. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 89 లక్షల వాహనాలుండగా వీటిల్లో 65 లక్షలు మోటారు బైకులే ఉన్నాయి. కొత్తగా కొనుగోలు చేస్తున్న టూ వీలర్లలో మెజారిటి షేర్ బైకులవే.
రోడ్డు ప్రమాదాల్లో ప్రతి ఏడాది వందలాదిమంది చనిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇంటిపెద్ద రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కారణంగా వీధినపడిన కుటుంబాలు చాలానే ఉంటున్నాయి. జాతీయస్ధాయిలో పెద్ద సమస్యగా మారిన రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రప్రభుత్వం 2019లోనే రోడ్డు భద్రతా చట్టాన్ని తీసుకొచ్చింది. డ్రైవింగ్ ప్రమాణాలను పెంచటంతో పాటు వాహనాల సామర్ధ్యాన్ని కూడా పెంచేందుకు కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతునే ఉన్నది. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక నిధి అవసరమని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సుప్రింకోర్టు కూడా కేంద్రానికి సూచించింది. అందుకనే మార్చి 1వ తేదీనుండి రోడ్డు భద్రతా ట్యాక్స్ ను అమల్లోకి తీసుకుని వస్తోంది.

