
హోటల్ గదిలో సీక్రెట్ కెమెరా : షీ నేత్ర టీం హెచ్చరిక
హైదరాబాద్‌లో హిడెన్ కెమెరాల హవా: మహిళల ప్రైవసీకి పెను ముప్పు!
ట్రయల్ రూమ్ నుంచి హాస్టల్ వరకూ స్పై కెమెరాలు…
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించే ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ట్రయల్ రూమ్‌లు, హోటల్ గదులు, హాస్టల్ బాత్రూమ్‌లు, అద్దె ఇళ్లలో సీక్రెట్ కెమెరాలు అమర్చి మహిళల వ్యక్తిగత క్షణాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న సంఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవలి కేసులు నగరంలో మహిళల గోప్యతకు పెరుగుతున్న ముప్పును బహిర్గతం చేస్తున్నాయి.
నగరంలో షాపింగ్ మాల్ ట్రయల్ రూంలు, బాత్రూంలు, హోటల్ గదులు,అద్దె ఇళ్లలో బాత్రూంలు ఇలా ఒకటేమిటి? మహిళలు దుస్తులు మార్చుకునేటపుడు, స్నానం చేసేటపుడు రహస్య కెమెరాలతో వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పెడుతున్న పలు బాగోతాలు వెలుగుచూశాయి. నగరంలో ఇటీవల అశ్లీల వీడియోలను చిత్రీకరించిన వరుస కేసులు బయటపడ్డాయి.
కళాశాల బాలికల హాస్టల్ లో బాలికల వీడియోల చిత్రీకరణ
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ మహిళా కళాశాల హాస్టల్ బాత్రూంలో విద్యార్థినులు స్నానం చేస్తుండగా రహస్య కెమెరాతో వీడియోలు చిత్రీకరించిన బాగోతం ఇటీవల వెలుగు చూసింది. కళాశాలలో బాలికలకు చెందిన 300 వీడియోలు చిత్రీకరించారని తేలడంతో విద్యార్థినులు ఆందోళన చేశారు. మూడు నెలలుగా సాగిన రహస్య వీడియోల చిత్రీకరణ నగరంలో సంచలనం రేపింది.
అద్దెఇంటి బాత్రూంలో సీక్రెట్ కెమెరా
మధురానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్‌లోని ఓ ఇంట్లో దంపతులు అద్దెకు దిగారు. అయితే వారి బాత్రూమ్‌లో విద్యుత్ బల్బు పాడైందని, కొత్తది పెట్టాలని ఇంటి యజమాని చెప్పి ,ఎలక్ట్రిషీయన్ సాయంతో బాత్రూమ్‌లో కొత్త బల్బ్‌ను అమర్చారు.అదే సమయంలో ఆ బల్బ్ హోల్డర్‌లో ఎలక్ట్రీషీయన్ చేత యజమాని సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేయించాడు. కరెంట్ బల్బ్ హోల్డర్‌లో ఉన్న సీక్రెట్ కెమెరాను గుర్తించిన కిరాయిదారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బయటపడింది.
హోటల్ గదిలో రహస్య కెమెరా
శంషాబాద్ లోని ఒక హోటల్ గదుల్లో చిన్న కెమెరాలను ఏర్పాటు చేసి అక్కడికి వచ్చే ప్రేమ జంటలు కలిసి ఉన్న వీడియోలతో వారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసేవాడు. ఏడాది నుంచి వందలాదిమంది వీడియోలను సేకరించి డబ్బులను డిమాండ్ చేశాడు. అసలు విషయం బయటకు రావడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసిన రిమాండ్ కు తరలించారు.
ట్రయల్ రూమ్‌లో స్పై కెమెరా
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ షాపింగ్ మాల్‌లోని ట్రయల్ రూమ్‌లో స్పై కెమెరాను గమనించిన ఓ మహిళ యజమానికి ఫిర్యాదు చేసింది. అక్కడ పని చేసే ఉద్యోగి దానిని ఏర్పాటు చేసినట్లు గుర్తించి ఆ మహిళకు కొంత పరిహారం అందజేసి గుట్టుచప్పుడు కాకుండా పంపించేశారు.
స్పై కెమెరాలు ఎక్కడ పెడుతున్నారంటే...
అద్దె ఇళ్లలో, ముఖ్యంగా బాత్రూం, బెడ్రూం బల్బ్ హోల్డర్లు, స్విచ్ బోర్డులు, మిర్రర్స్, వెంటిలేటర్ల వద్ద రహస్య కెమెరాలు పెట్టి మహిళలు స్నానం చేస్తుండగా, బట్టలు మార్చుకుంటుండగా కొందరు వీడియోలు చిత్రీకరిస్తున్నారని, అనుమానాస్పద వస్తువులు ఉంటే వెంటనే జాగ్రత్తపడాలని పోలీసులు హెచ్చరించారు.
ప్రధానంగా దుస్తులు మార్చుకునే ట్రయల్ రూంలు, బాత్రూమ్‌లు, హోటల్ గదులు, అద్దె ఇళ్లలో రహస్య కెమెరాలు పెట్టే అవకాశం ఉందని షీ నేత్ర పోలీసులు చెప్పారు.
తనిఖీలు చేయండి, ఫిర్యాదు చేయండి
హోటల్ లేదా కొత్త ప్రదేశంలో ఉన్నప్పుడు స్మోక్ డిటెక్టర్లు, బల్బ్ హోల్డర్లు, అద్దాలు, సాకెట్లపై అనుమానాస్పద వస్తువులు ఉన్నాయేమో చూడాలని పోలీసులు సూచించారు. గది లైట్లు ఆపివేసి, మొబైల్ ఫ్లాష్‌లైట్‌ను వస్తువులపై వేస్తే కెమెరా లెన్స్ ప్రతిబింబిస్తుంది.ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100 లేదా షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయండి.
రహస్య కెమెరాల గుట్టువిప్పే కెమెరా డిటెక్టర్
సీక్రెట్ కెమెరాలకు షీ నేత్ర టీమ్స్ చెక్
హైదరాబాద్‌లో పబ్లిక్, ప్రైవేట్ ప్రదేశాలు (మాల్స్, హోటళ్లు, హాస్టళ్లు) బట్టల దుకాణాల ట్రయల్ రూమ్‌లలో మహిళల భద్రత కోసం రహస్య కెమెరాలను గుర్తించడానికి హైదరాబాద్ పోలీసులు ప్రత్యేకంగా 'షీ నేత్ర (She Nethra) టీమ్స్' ను ప్రారంభించారు. ఏడు జోన్లలో ఈ బృందాలు అధునాతన పరికరాలతో తనిఖీలు నిర్వహిస్తారని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ చెప్పారు. అత్యాధునిక కెమెరా డిటెక్టర్లను రంగంలోకి దించారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఈ ఏడు బృందాల ద్వారా నగరవ్యాప్తంగా ముమ్మరంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.
షాపింగ్ మాల్స్‌లోని ట్రయల్ రూమ్‌లు, ఆస్పత్రులు, హోటళ్లు, హాస్టళ్లలో రహస్యంగా కెమెరాలు అమర్చి మహిళల గోప్యతకు భంగం కలిగించే ఘటనలపై ఉక్కుపాదం మోపుతామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ చెప్పారు.
పోలీసుల నిఘా
హాస్టళ్లు, హోటళ్లు, మాల్స్, ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో రహస్య కెమెరాల కోసం షీనేత్ర పోలీసు బృందాలు ఆకస్మిక తనిఖీలు చేయనున్నాయి.కెమెరాలు పెట్టిన వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. అన్ని వాణిజ్య సంస్థలు కస్టమర్ సేఫ్టీ ఇన్-ఛార్జ్‌ను నియమించాలని పోలీసులు ఆదేశించారు.
ఫిర్యాదు చేయండి ఇలా...
సీక్రెట్ కెమెరాలు పెట్టారని అనుమానాస్పదంగా అనిపిస్తే 100 లేదా 112 కి కాల్ చేయవచ్చునని షీనేత్ర పోలీసు అధికారి చెప్పారు. లేదా షీ టీమ్స్ కి 94906 16555 నంబర్ ద్వారా తెలియజేయవచ్చు.
రహస్య కెమెరాల ద్వారా పెరుగుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ‘షీ నేత్ర’ టీమ్స్ ద్వారా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే మహిళలు కూడా అప్రమత్తంగా ఉండడం ఎంతో అవసరం. అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా ఇలాంటి నేరాలను అరికట్టవచ్చు.
Next Story

