తెలంగాణలో హై అలర్ట్, పెరిగిపోతున్న అనారోగ్య సమస్యలు
x

తెలంగాణలో హై అలర్ట్, పెరిగిపోతున్న అనారోగ్య సమస్యలు

అనారోగ్యాల ప్రభావం ముఖ్యంగా యువతపైన ఎక్కువగా ప్రభావం చూపుతుండటం మరింత ఆందోళనకరమనే చెప్పాలి.


నిజంగా అందరు ఆందోళనపడాల్సిన విషయమే. కారణం ఏమిటంటే తెలంగాణలో అనారోగ్య సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఉరుకులు పరుగుల జీవితంలో శారీరక, మానిసక ఆరోగ్యాలపైన శ్రద్ధపెట్టేంత సమయం చాలామందికి ఉండటంలేదు. పొద్దున్నే తెల్లవారి లేచి ఆఫీసుకు పరుగులు పెట్టి రాత్రెప్పుడో ఇళ్ళకు చేరుకునే వారిసంఖ్య పెరిగిపోతోంది. దాంతో ఉద్యోగాల్లో టెన్షన్లు, ఇంట్లో కూడా టెన్షన్లే. వెరసి ఇంటా, బయట టెన్షన్లు పెరిగిపోవటంతో దాని ప్రభావంతో శారీరక, మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయి. అనారోగ్యాల ప్రభావం ముఖ్యంగా యువతపైన ఎక్కువగా ప్రభావం చూపుతుండటం మరింత ఆందోళనకరమనే చెప్పాలి.

ఇంతకీ ఇపుడు విషయం ఏమిటంటే ఒక ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యం ‘హెల్త్ ఆఫ్ ది నేషన్ 2026’ పేరుతో దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ప్రతి ఐదుగురిలో ఒకరు ప్రీ డయాబెటిక్, 69శాతం మందిలో డీ విటమిన్ లోపం, 46శాతం మందిలో ప్రీహైపర్ టెన్షన్, కార్పొరేట్ ఉద్యోగుల్లో 80శాతం అధికభరువుతో ఇబ్బందులు పడుతున్నట్లు తేలింది. ఇవికాకుండా రొమ్ము క్యాన్సర్ కేసులూ పెరిగిపోతున్నాయి. ప్రీ డయాబెటిక్, ప్రీ హైపర్ టెన్షన్ అంటే జీవనశైలి ఎంతటి డేంజర్ జోన్లో ఉందో అర్ధమవుతోంది. పై రెండు లక్షణాలు ఉన్నవారు అర్జంటుగా తమ డైలీ రొటీన్ మార్చుకోకపోతే మాత్రం బీపీ, షుగర్ బారినపడటం ఖాయం అనటంలో సందేహంలేదు.

పైన చెప్పిన సమస్యల్లో అత్యధికం 30 ఏళ్ళలోపు వారిలోనే కనబడటం ఆందోళనకరమనే చెప్పాలి. ఒకపుడు పైన చెప్పిన సమస్యలు 50 లేదా 60 ఏళ్ళు దాటిన వాళ్ళల్లోనే కనబడేవి. అలాంటిది ఇపుడు మరీ 30 ఏళ్ళలోపే బీపీ, షుగర్ కు బార్డర్ లైనులోకి వచ్చేశారంటే అర్ధమేంటి ? ఉద్యోగాల్లో టెన్షన్, కుటుంబాల్లో టెన్షన్ ఫలితంగా సిగిరెట్లు, మందు తాగటం, కొందరు డ్రగ్స్ కు కూడా బానిసలవటం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం, నిద్రలేమి, కుటుంబాలతో గడపటానికి సమయం కేటాయించలేకపోవటంలాంటి అనేకసమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న కారణంగానే జనాల్లో అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. తెలంగాణలోని జనాల్లో కూడా పైనచెప్పిన అనారోగ్యాలు పెరిగిపోతుండటం ఆందోళనకరమే.

పోయిన ఏడాది ఈ కార్పొరేట్ ఆసుపత్రి దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షలమందిపైన జరిపిన పరీక్షల ఆధారంగానే ‘హెల్త్ ఆఫ్ ది నేషన్-2026’ రిపోర్టును విడుదలచేసింది. ఈరిపోర్టు ముఖ్యంగా 30ఏళ్ళలోపు యువత ఎదుర్కొంటున్న అసేక సమస్యలను గురించి చర్చించింది. శారీరక శ్రమ లేకపోవటమే యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద అనారోగ్య సమస్యగా రిపోర్టు స్పష్టంచేసింది. శారీరకశ్రమ లేకపోవటంతో ఇమ్యూనిటి తగ్గిపోయి బలహీనమైపోతున్నారు. 60శాతం మంది విటమిన్ డీ లోపంతో బాగా ఇబ్బంది పడుతున్నట్లు రిపోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. విటమిన్ డీ లోపమంటే ఎముకలు పెళుసు అయిపోతున్నట్లు లెక్క. రిపోర్టు ప్రకారం 59శాతం ఊబకాయులు, 52శాతం యువతలో అసాధారణ కొలెస్ట్రాల్ స్ధాయిలు నమోదయ్యాయి. 30 ఏళ్ళలోపు వారికి ఆరోగ్య పరీక్షలు చేసినపుడు ఒక్కరు మాత్రమే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది.

కార్పొరేట్ బరువు పెరిగిపోతోంది

కార్పొరేట్ ఉద్యోగుల్లో అత్యధికులు బరువు పెరిగిపోతున్నట్లు రిపోర్టు ప్రస్తావించింది. 5 లక్షలమంది యువతను పరీక్షించినపుడు ప్రతి 10మందిలో 8మంది అధికభరువుతో ఇబ్బంది పడుతున్నట్లు తేలింది. వీరిలో సగంమంది ప్రీ డయాబెటిక్/డయాబెటిక్ అని తేలింది. ప్రతి నలుగురిలో ఒకరు హైబీపీతో బాధపడుతుండటం నిజంగా బాధాకరమనే చెప్పాలి. వారానికి కనీసం 150 నిముషాలు కూడా వ్యాయామాలు చేయటంలేదని సర్వేలో తేలింది. 55శాతం మంది అసాధారణ కొలెస్ట్రాల్ తో ఇబ్బందులు పడుతున్నట్లు సర్వేలో బయటపడింది. అసాధారణ కొలెస్ట్రాల్, హైబీపీ, డయాబెటిక్ లక్షణాలే గుండెపోటుకు కారణాలు అవుతున్నట్లు రిపోర్టు తేల్చింది.

అమ్మాయిల పరిస్ధితి

20 ఏళ్ళ వయసులో ఉన్న అమ్మాయిల్లో చాలామంది విటమిన్ బీ12 లోపం ఎక్కువగా కనబడింది. ఫలితంగా సంతానోత్పత్తి, నరాల సంబంధిత అనారోగ్యాలు పెరిగిపోతున్నాయి. 40ఏజ్ గ్రూప్ మహిళల్లో చాలామంది అధికభరువుతో ఇబ్బందులు పడుతున్నారు. పొట్టదగ్గర పేరుకుపోతున్న కొవ్వు అనారోగ్యానికి కారణమవుతోందని రిపోర్టు బయటపెట్టింది. 10 మంది మహిళలను టెస్ట్ చేస్తే తొమ్మిదిమందిలో పొట్టదగ్గర కొవ్వులు బాగా పెరిగిపోయినట్లు పరీక్షల్లో బయటపడింది. అందుకనే మహిళల్లో కూడా షుగర్ పేషెంట్ల సంఖ్య పెరిగిపోతోందని రిపోర్టు అభిప్రాయపడింది. రిపోర్టు ప్రకారం హైదరాబాద్ లో 25శాతం మంది షుగర్ కు బార్డర్లో ఉన్నట్లు తేలింది. అలాగే ప్రతి ఏడాది క్యాన్సర్ కేసులు సుమారు 50వేలు నమోదవుతున్నట్లు తేలింది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో పైన చెప్పిన అనారోగ్య సమస్యలు, రోగలక్షణాలతో ఇబ్బందులు పడుతున్న వారిసంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు అర్ధమవుతోంది.

Read More
Next Story