బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
x

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేసింది.


తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పుల వివాదంలో హైకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేస్తూ తదుపరి చర్యలకు మార్గం సుగమం చేసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని ఇటీవల అసెంబ్లీ స్పీకర్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ నిర్ణయాన్ని బీఆర్ఎస్ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో దానం నాగేందర్, అరికేపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్ రావులపై పిటిషన్ దాఖలైంది.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, సంబంధిత ఏడుగురు ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్‌కు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. నోటీసులు అందిన వారందరూ తమ వాదనలు సమర్పించాలని సూచించింది. మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై వేరే పిటిషన్ కూడా విచారణకు వచ్చింది. బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో, దానం పార్టీ మారిన అంశంపై స్పీకర్ తీర్పును రద్దు చేయాలని కోరినట్లు కోర్టు దృష్టికి వచ్చింది.

దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి, తరువాత కాంగ్రెస్ తరఫున లోక్‌సభకు పోటీ చేసిన విషయాన్ని పిటిషనర్ ప్రస్తావించినట్లు తెలిసింది. ఇతర పార్టీ నుంచి నామినేషన్ వేసిన రోజే అనర్హుడిగా ప్రకటించాలనే వాదనను ఆయన వినిపించినట్లు సమాచారం. ఈ సందర్భంలో కర్ణాటక, బిహార్ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ప్రస్తావించినట్లు వెల్లడైంది. ఇక బీఆర్ఎస్ తరఫు పిటిషన్‌లో, ఎమ్మెల్యేలు బహిరంగంగా కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొన్నారని, పార్టీ కండువాలు ధరించిన దృశ్యాలు మీడియాలో వచ్చాయని న్యాయవాది వివరించినట్లు తెలిసింది.

స్పీకర్ చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేశారని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. పర్సనల్ నోటీసులు ఇవ్వడానికి అనుమతి కోరగా, హైకోర్టు స్పీడ్ పోస్టు ద్వారా నోటీసులు పంపించాలని ఆదేశించింది. మొత్తంగా ఈ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోగా, తదుపరి విచారణపై అందరి దృష్టి నిలిచింది.

Read More
Next Story