Danam Nagender
x

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్

దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు.. 4 వారాల్లో వివరణ

పార్టీ మార్పు వివాదంలో దానం నాగేందర్‌పై హైకోర్టు చర్యలు. స్పీకర్ నిర్ణయంపై సవాల్, ఏప్రిల్ 16కి తదుపరి విచారణ.


ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేయడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది. ఈ కేసు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌తో ప్రారంభమైంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సవాల్ చేశారు. దానం అనర్హుడిగా ప్రకటించాలని కోరారు.

పిటిషన్‌లో ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు. అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, పలువురు బీఆర్ఎస్ నేతలతో పాటు దానం కూడా కాంగ్రెస్ వైపు వెళ్లినట్లు తెలిపారు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫారమ్‌తో పోటీ చేసిన రోజునుంచే దానం అనర్హుడవుతారని పిటిషనర్ వాదించారు. కర్ణాటక, బిహార్ రాష్ట్రాల్లో ఇలాంటి కేసులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ప్రస్తావించారు.

ఇదిలా ఉండగా, పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు ముందుగా స్పీకర్‌ను కోరారు. కానీ విచారణ అనంతరం ఎవరూ పార్టీ మారలేదని స్పీకర్ తేల్చి చెప్పారు. అదే నిర్ణయాన్ని ఇప్పుడు హైకోర్టులో సవాల్ చేశారు.

ఈ నేపథ్యంలో హైకోర్టు దానం నాగేందర్‌తో పాటు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. అందరూ తమ వాదనలు సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసు విచారణతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పార్టీ మార్పుల అంశం చర్చనీయాంశంగా మారింది. కోర్టు తదుపరి విచారణలో ఏ విధంగా ముందుకు సాగుతుందో చూడాలి.

Read More
Next Story