
హైడ్రా కూల్చివేతలపై హైకోర్ట్ సీరియస్
గండిపేట మండలం నార్సింగ్‌లో నోటీసులు ఇవ్వకుండా చేసిన కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నివేదిక సమర్పించాలని హైడ్రాను ఆదేశించింది.
హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. అసలు ఏ అధికారంతో కూల్చివేతలు చేస్తున్నారని జస్టిస్ శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. నార్సింగ్‌లోని వివాదాస్పద స్థలంలో కూల్చివేతలు చేపట్టిన విషయంలో హైడ్రాకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆక్రమణల నిరోధ చర్యలు బాగున్నా, సహజ న్యాయసూత్రాలను విస్మరించకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. అసలు ఏ అధికారంతో అక్కడ కూల్చివేతలు చేపట్టారని అధికారులను నిలదీసింది.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగ్ పరిధిలోని పలు సర్వే నంబర్లలో ఉన్న 1,608 చదరపు గజాల స్థలం ప్రస్తుతం కోర్టు వివాదంలో ఉంది. ఈ స్థలంపై పిటిషనర్లకు ఉన్న హక్కులను గతంలోనే కింది కోర్టు ధ్రువీకరించింది. దీనిపై అధికారులు చేసిన అప్పీలు ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. ఇవి తెలిసినా కూడా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అధికారులు కాంపౌండ్ గోడను కూల్చివేసి, కంచె వేయడాన్ని సవాల్ చేస్తూ గొర్ల రాహుల్‌యాదవ్‌తో పాటు మరో ఏడుగురు హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ సందర్భంగా హైడ్రా తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణపై మౌఖికంగా ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకుంటామని కోర్టుకు తెలిపారు. అయితే ఈ వాదనను జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్ తోసిపుచ్చారు. ఆక్రమణదారులకైనా నోటీసు ఇవ్వడం కనీస బాధ్యతని గుర్తుచేశారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఏకపక్షంగా కంచె వేయడం సరికాదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. తక్షణమే ఆ కంచెను తొలగించి, ఆ వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 24కు వాయిదా వేశారు.

