హైరైజ్‌లో ఫైర్ అయితే.. మీ ఎస్కేప్ రూట్ ఏంటి?
x

హైరైజ్‌లో ఫైర్ అయితే.. మీ ఎస్కేప్ రూట్ ఏంటి?


ర‌చ్చ‌ - రాజ‌కీయం @ 5 పి.ఎం.

1) హైరైజ్‌లో ఫైర్ అయితే.. మీ ఎస్కేప్ రూట్ ఏంటి?
2) లోన్ కట్టలేదని కూతురి ఫొటోలు మార్ఫింగ్.. హైదరాబాద్‌లో లోన్ యాప్ దారుణం!
3) సినీఫక్కీలో డ్రగ్స్ స్మగ్లింగ్! 100 KMకో లారీ మార్పు!

1) హైరైజ్‌లో ఫైర్ అయితే.. మీ ఎస్కేప్ రూట్ ఏంటి?
20వ అంతస్తులో ఇల్లు. కిందికి చూస్తే వందల అడుగుల ఎత్తు. అంతా సేఫ్‌గానే ఉందనుకుంటాం. కానీ అదే 20వ అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగితే? లిఫ్ట్‌ పనిచేయకపోతే? మెట్లు పొగతో నిండిపోతే? కిందికి వెళ్లే అత్యవసర మార్గం అందుబాటులో లేకపోతే? అసలు, మనం నివసిస్తున్న హై-రైజ్‌ భవనం ఫైర్‌ ఎమర్జెన్సీకి ఎంతవరకు సిద్ధంగా ఉంది?
హైదరాబాద్‌ ఇప్పుడు అడ్డంగా మాత్రమే కాదు, నిలువుగా కూడా విస్తరిస్తోంది. ఐటీ కారిడార్‌ నుంచి కోకాపేట్‌, నార్సింగి, గండిపేట్‌, తెల్లాపూర్‌, మణికొండ వరకు భారీ టవర్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు పెరుగుతున్నాయి. GHMC, HMDA సమాచార ప్రకారం నగరంలో సుమారు 2,100 హై-రైజ్‌ భవనాలు ఉన్నాయి. ఈ టవర్లలో వేలాది కుటుంబాలు నివసిస్తున్నాయి. అంటే ఒక భవనంలోనే వందలు, కొన్ని సందర్భాల్లో వేల మంది ప్రాణాలు ముడిపడి ఉన్నాయి. అందుకే హై-రైజ్‌ భవనాల్లో ఫైర్‌ సేఫ్టీ అనేది ఒక సర్టిఫికెట్‌ మాత్రమే కాదు. నిరంతర భద్రతా వ్యవస్థ.
ఇటీవల హైదరాబాద్‌లోని అపార్ట్‌మెంట్లు, రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదాలు మరోసారి హై-రైజ్‌ సేఫ్టీపై ప్రశ్నలు లేవనెత్తాయి. గచ్చిబౌలిలోని జేవీ ప్లాజా రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ సెల్లార్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది గాయపడ్డారు. హైదర్‌గూడలోని జన్‌ప్రియ మార్వెల్‌ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. మణికొండలో గేటెడ్‌ కమ్యూనిటీలో ఫ్లాట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. హైదర్‌షాకోట్‌లో అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో మంటలు చెలరేగి ఆరు ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. ఒక్కో ఘటన ఒక్కో హెచ్చరిక ఇస్తోంది. హై-రైజ్‌లో మంటలు చెలరేగితే బయటపడే మార్గం సిద్ధంగా ఉందా?
తెలంగాణ ఫైర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జనరల్ సీనియ‌ర్ ఐపీఎస్ విక్రమ్‌ సింగ్‌ మాన్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. “హైదరాబాద్‌ వర్టికల్‌ గ్రోత్‌ వేగంగా పెరుగుతోంది. అదే సమయంలో హై-రైజ్‌ భవనాల్లో ఫైర్‌, లైఫ్‌ సేఫ్టీపై ఏమాత్రం రాజీ ఉండకూడదు. డిజైన్‌ నుంచి భవనం వినియోగంలో ఉన్నంత కాలం భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి.”
అంటే భవనం నిర్మించేటప్పుడు ఫైర్‌ సేఫ్టీ చూసి ఆ తర్వాత మర్చిపోవడం కాదు.భవనం ఉపయోగంలో ఉన్నంతకాలం ఫైర్‌ ఫైటింగ్‌ సిస్టమ్స్‌ పనిచేస్తున్నాయా? ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ మార్గాలు ఖాళీగా ఉన్నాయా? సేఫ్టీ పరికరాలు నిర్వహణలో ఉన్నాయా? ఇవన్నీ నిరంతరం పరిశీలించాలి.
హై-రైజ్‌ ఫైర్‌ సేఫ్టీలో మొదట చూడాల్సింది భవనానికి అవసరమైన అనుమతులు, ఫైర్‌ NOCలు. ఆ తర్వాత, ఫైర్‌ అలారం సిస్టమ్‌ పనిచేస్తుందా? స్ప్రింక్లర్‌, హైడ్రంట్‌ వ్యవస్థలు సక్రమంగా ఉన్నాయా? ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్లు అందుబాటులో ఉన్నాయా? అత్యవసర సమయంలో మెట్లు, మీన్స్‌ ఆఫ్‌ ఎస్కేప్‌ అందుబాటులో ఉన్నాయా? అవసరమైన చోట రెఫ్యూజ్‌ ఏరియాలు వినియోగానికి అనుకూలంగా ఉన్నాయా? అత్యవసర లైటింగ్‌, స్మోక్‌ కంట్రోల్‌, ఫైర్‌ పంపులు వంటి వ్యవస్థలు పనిచేస్తున్నాయా? ఇవి ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, రెగ్యులర్‌ మెయింటెనెన్స్‌, ఫైర్‌ సేఫ్టీ ఆడిట్లు, మాక్‌ డ్రిల్స్‌ కూడా అంతే కీలకం. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత వ్యవస్థ పనిచేస్తుందో లేదో పరీక్షించే అవకాశం ఉండదు.
ఫైర్‌ సేఫ్టీ విషయంలో మరో పెద్ద ఆందోళన ఇప్పుడు నకిలీ ఫైర్‌ NOCలు. ఇటీవల జూనియర్‌ కాలేజీలకు సంబంధించిన 142 ఫైర్‌ NOCలను పరిశీలించగా 52 నకిలీ లేదా ఫోర్జ్డ్‌ NOCలుగా తేలాయి. మరో 90 NOCలు మాత్రమే నిజమైనవిగా నిర్ధారణ అయ్యాయి. ఈ వ్యవహారం తర్వాత ఫైర్‌ NOCల వెరిఫికేషన్‌ను మరింత పారదర్శకంగా మార్చాల్సిన అవసరం తెరపైకి వచ్చింది. ఇదే అంశంపై సెప్టెంబర్‌ 8న తెలంగాణ ఫైర్‌ సర్వీసెస్‌ డీజీ కార్యాలయంలో విద్యా సంస్థల ప్రతినిధులతో సమావేశం కూడా జరిగింది.
డీజీ స్పష్టంగా హెచ్చరించారు. “ఫైర్‌ ఎన్‌ఓసీ ఇప్పిస్తామని చెప్పే అనధికారిక వ్యక్తులను నమ్మవద్దు. నకిలీ లేదా అనధికారిక ఎన్‌ఓసీలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు.”
పాత భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల విషయంలో ఆచరణాత్మక సమస్యలు ఉన్నాయని ఫైర్‌ శాఖ గుర్తించింది. సెట్‌బ్యాక్స్‌, మీన్స్‌ ఆఫ్‌ ఎస్కేప్‌, భవన నిర్మాణంలో మార్పులు చేయలేని పరిస్థితులు.భవనంలో ఉన్న వ్యక్తుల సంఖ్య. ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తనిఖీల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏకరీతి, ఆచరణాత్మక చెక్‌లిస్ట్‌ త్వరలో జారీ చేస్తామని డీజీ తెలిపారు.
హైదరాబాద్‌ ఎంత ఎత్తుకు ఎదిగినా, మన భద్రత అంతకంటే ముందుండాలి. 20వ అంతస్తులో ఇల్లు ఉండటం గొప్ప విషయమే. కానీ అత్యవసర సమయంలో 20వ అంతస్తు నుంచి బయటపడే మార్గం ఉందా? ఫైర్‌ NOC ఉందా? అది నిజమైనదేనా? ఫైర్‌ సేఫ్టీ పరికరాలు పనిచేస్తున్నాయా? ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ మార్గాలు ఖాళీగా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం ప్రమాదం వచ్చిన తర్వాత కాదు. ప్రమాదం రాకముందే తెలుసుకోవాలి. హై-రైజ్‌ లైఫ్‌స్టైల్‌ ఎంత ఎత్తులో ఉన్నా, ఫైర్‌ సేఫ్టీ మాత్రం గ్రౌండ్‌ రియాలిటీగా ఉండాలి.

2) లోన్ కట్టలేదని కూతురి ఫొటోలు మార్ఫింగ్.. హైదరాబాద్‌లో లోన్ యాప్ దారుణం!
లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు మరోసారి కలకలం రేపాయి. రుణం తీసుకున్న కుటుంబం ఈఎంఐ చెల్లించలేదన్న కారణంతో ఓ మహిళను టార్గెట్ చేశారు. ఫోన్ కాల్స్‌తో వేధించారు. నంబర్లు బ్లాక్ చేసినా వేర్వేరు నంబర్ల నుంచి కాల్స్ చేస్తూ ఒత్తిడి తెచ్చారు. అక్కడితో ఆగలేదు. చివరకు ఆమె పదో తరగతి చదువుతున్న కుమార్తె ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి, వాట్సాప్‌లో తల్లికి పంపించారు. డబ్బులు చెల్లించకపోతే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామంటూ బెదిరించారు.
ఈ ఘటన హైదరాబాద్ మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ రాజలింగం కాలనీకి చెందిన ఓ మహిళ.. తన బంధువు అవసరాల కోసం లోన్ యాప్ ద్వారా రుణం తీసుకుంది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా మారడంతో.. కొంతకాలంగా ఈఎంఐలు చెల్లించలేకపోయారు. దీంతో లోన్ యాప్ నిర్వాహకులు వరుస ఫోన్ కాల్స్ చేస్తూ, బకాయి మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఒత్తిడి చేశారు. వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు కొన్ని నంబర్లను బ్లాక్ చేసింది. కానీ, కాల్స్ మాత్రం ఆగలేదు.
ఇక ఈ వేధింపులు మరింత దారుణంగా మారాయి. బాధితురాలి పదో తరగతి చదువుతున్న కుమార్తెకు సంబంధించిన ఫొటోలను సేకరించిన లోన్ యాప్ నిర్వాహకులు.. వాటిని అసభ్యకరంగా మార్ఫింగ్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ మార్ఫింగ్ చేసిన ఫొటోలను వాట్సాప్ ద్వారా తల్లికి పంపించారు. “వెంటనే డబ్బులు చెల్లించాలి.. లేకపోతే ఈ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తాం” అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
కుమార్తె ఫొటోలను దుర్వినియోగం చేయడంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు.. చివరకు మేడిపల్లి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లోన్ యాప్ నిర్వాహకులు ఉపయోగించిన ఫోన్ నంబర్లు.. వాట్సాప్ సందేశాలు.. బెదిరింపులకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఇక్కడ మరో కీలక విషయం ఏంటంటే.. రుణం చెల్లించలేకపోవడం ఒక సమస్య అయితే.. అందుకు కుటుంబ సభ్యుల ఫొటోలను దుర్వినియోగం చేయడం, మార్ఫింగ్ చేయడం, సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించడం పూర్తిగా వేరే అంశం.లోన్ తీసుకునే ముందు యాప్ అధికారికతను, రుణ సంస్థ వివరాలను పూర్తిగా పరిశీలించాలి. రుణం చెల్లింపుల విషయంలో ఇబ్బందులు ఎదురైనా.. బెదిరింపులకు భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలి.
ముఖ్యంగా పిల్లలు, కుటుంబ సభ్యుల ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేయడం వంటి ఘటనలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. లోన్ తీసుకోవడం ఒక ఆర్థిక నిర్ణయం. కానీ వేధింపులకు లొంగిపోవడం పరిష్కారం కాదు.

3) సినీఫక్కీలో డ్రగ్స్ స్మగ్లింగ్! 100 KMకో లారీ మార్పు!
హైదరాబాద్‌లో హ్యాష్ ఆయిల్ సరఫరా పెరుగుతోందా? హైదరాబాద్ డ్రగ్ మార్కెట్‌కు ఏపీ–ఒడిశా బెల్ట్‌ నుంచి సరఫరా జరుగుతోందా? ఇప్పుడు ఈ ప్రశ్నలకు బలం చేకూర్చేలా వరుసగా హ్యాష్ ఆయిల్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఏపీ ఏజెన్సీ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు భారీగా హ్యాష్ ఆయిల్ తరలిస్తున్న ఓ ముఠాను రాచకొండ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు.పోలీసుల ప్రకారం.. 12 కిలోల హ్యాష్ ఆయిల్‌ను హైదరాబాద్‌కు తరలిస్తున్న ముగ్గురిని కుషాయిగూడలో అదుపులోకి తీసుకున్నారు. దీని మార్కెట్ విలువ సుమారు రూ.1.5 కోట్లు అని పోలీసులు తెలిపారు.
అయితే ఈ కేసులో హ్యాష్ ఆయిల్ కంటే.. దాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చిన విధానం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు నిందితులు ఒకే లారీలో ప్రయాణించలేదని తెలుస్తోంది. సాధారణ ప్రయాణికుల్లా సరుకు రవాణా లారీల్లో ఎక్కి.. సుమారు ప్రతి వంద కిలోమీటర్లకు ఒక లారీ మార్చుకుంటూ హైదరాబాద్ వైపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
అంటే.. ఒకే వాహనం, ఒకే మార్గం, ఒకే ప్రయాణం కాకుండా.. మార్గమధ్యంలో వాహనాలు మార్చడం ద్వారా పోలీసుల నిఘా నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించినట్లు తెలుస్తోంది.కానీ కుషాయిగూడ చేరుకునేలోపే పోలీసులకు సమాచారం అందింది. అక్కడ నిఘా పెట్టిన రాచకొండ ఎస్వోటీ బృందం.. అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి బ్యాగులను తనిఖీ చేసింది. అందులో 12 కిలోల హ్యాష్ ఆయిల్ బయటపడింది.
ఈ ముగ్గురూ ఏపీ ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలించేందుకు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.ఈ రవాణా వెనుక మరో కీలక లింక్ ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.హరిశ్చంద్ర ప్రసాద్ సోదరుడు మాధ్ అలియాస్ రిక్కీ.. హ్యాష్ ఆయిల్‌ను హైదరాబాద్‌కు తరలిస్తే కిలోకు రూ.5 వేల చొప్పున కమీషన్ ఇస్తానని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే.. అసలు రిక్కీ వెనుక ఇంకా ఎవరున్నారు? హైదరాబాద్‌లో ఈ సరుకును స్వీకరించాల్సిన వ్యక్తులు ఎవరు? ఏపీ నుంచి హైదరాబాద్ వరకు ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎంతమంది ఉన్నారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదంతా ఒక కేసుకే పరిమితమైన వ్యవహారమా? లేక హైదరాబాద్‌లో హ్యాష్ ఆయిల్ సరఫరా నెట్‌వర్క్ విస్తరిస్తోందా?పోలీసుల గణాంకాలు చూస్తే.. సమస్య తీవ్రత అర్థమవుతుంది.హైదరాబాద్‌లో జూన్ 2025 నుంచి జూన్ 2026 వరకు 563 NDPS కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో రూ.22.17 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో 55.3 లీటర్ల హ్యాష్ ఆయిల్ విలువ సుమారు రూ.6.91 కోట్లు. అంటే.. ఒక్క ఏడాది వ్యవధిలోనే హైదరాబాద్‌లో కోట్ల రూపాయల విలువైన హ్యాష్ ఆయిల్ పోలీసులకు పట్టుబడింది.
ఇక తెలంగాణ స్థాయిలో చూస్తే.. 2025లో 2,542 NDPS కేసులు నమోదయ్యాయి. 8,322 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు రూ.172.93 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలంగాణ పోలీసుల వార్షిక గణాంకాలు వెల్లడించాయి.ఈ డ్రగ్స్ హైదరాబాద్‌కు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పోలీసుల దర్యాప్తుల్లో ఏపీ–ఒడిశా ప్రాంతాలు గంజాయి, హ్యాష్ ఆయిల్ సరఫరా మార్గాల్లో కీలకంగా కనిపిస్తున్నాయి.
అక్కడి నుంచి డ్రగ్స్ నగరానికి చేరిన తర్వాత.. క్యారియర్లు, పెడ్లర్లు, డెలివరీ ఏజెంట్లు, స్థానిక డీలర్ల ద్వారా వినియోగదారులకు చేరుతున్నట్లు పలు కేసుల దర్యాప్తుల్లో బయటపడుతోంది. అంతేకాదు.. డ్రగ్స్ వ్యాపారానికి మరో కీలక కోణం డబ్బు. పోలీసుల దర్యాప్తుల్లో మ్యూల్ బ్యాంక్ అకౌంట్లు, హవాలా, డిజిటల్ చెల్లింపులు వంటి మార్గాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అందుకే పోలీసులు ఇప్పుడు కేవలం డ్రగ్స్ తీసుకెళ్తున్న క్యారియర్లను పట్టుకోవడమే కాకుండా.. వారి వెనుక ఉన్న సప్లయర్లు, డీలర్లు, ఆర్థిక లావాదేవీలు, అసలు నెట్‌వర్క్‌పై కూడా దృష్టి పెడుతున్నారు.తాజా 12 కిలోల హ్యాష్ ఆయిల్ కేసులో ముగ్గురు పట్టుబడినా.. అసలు టార్గెట్ మాత్రం మొత్తం నెట్‌వర్క్‌నే.సరఫరా ఎక్కడి నుంచి?హైదరాబాద్‌లో ఎవరు స్వీకరిస్తున్నారు?డబ్బు ఎవరి చేతుల్లోకి వెళ్తోంది?ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎంతమంది ఉన్నారు?ఈ ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తులో సమాధానాలు బయటపడాల్సి ఉంది.
Read More
Next Story