
వందేమాతరం ప్రోటోకాల్ విడుదల
ఏమిటి కొత్త మార్గదర్శకాలు?
కేంద్ర హోం(Home Ministry) మంత్రిత్వ శాఖ కొత్త ప్రొటోకాల్ జారీ చేసింది. రాష్ట్ర కార్యక్రమాలు, జాతీయ జెండా ఆవిష్కరణలు, రాష్ట్రపతి–గవర్నర్ అధికారిక వేడుకలు, పాఠశాల సమావేశాలు, తదితర ప్రభుత్వ కార్యక్రమాల్లో 3 నిమిషాలు 10 సెకన్ల నిడివి గల ‘వందేమాతరం’ (Vande Mataram) గేయాన్ని ప్లే చేయడం లేదా సామూహికంగా పాడటం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
1870లో బెంగాలీ రచయిత బంకిం చంద్ర ఛటర్జీ రచించిన ‘వందేమాతరం’ స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో మాతృభూమి ప్రతీకగా విస్తృతంగా వినిపించింది. ఈ గేయంలోని తొలి రెండు చరణాలు 1950లో భారత జాతీయ గీతంగా గుర్తింపు పొందాయి. అయితే ఇప్పటివరకు ‘వందేమాతరం’ ప్రదర్శనకు ప్రత్యేక అధికారిక ప్రోటోకాల్ లేకపోవడం గమనార్హం.
హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం.. జాతీయ గీతం ‘జన గణ మన’తో కలిసి ప్లే చేసినప్పుడు ముందుగా ‘వందేమాతరం’ వినిపించాలి. గీతం వినిపించే సమయంలో ప్రేక్షకులు శ్రద్ధగా నిలబడాలని సూచించారు. అయితే న్యూస్ రీల్స్ లేదా డాక్యుమెంటరీలలో భాగంగా వినిపించినప్పుడు నిలబడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలకు ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో జారీ చేశారు.
ఈ ఉత్తర్వులో కార్యక్రమాలను మూడుగా విభజించారు — కేవలం ప్లే చేయాల్సిన సందర్భాలు, ప్లే చేయడంతో పాటు పాడాల్సిన సందర్భాలు, కేవలం పాడాల్సిన సందర్భాలు. రాష్ట్రపతి రాక–నిష్క్రమణ, గవర్నర్ అధికారిక కార్యక్రమాలు, జాతీయ జెండా కవాతులు, ఆల్ ఇండియా రేడియో–టెలివిజన్ ప్రసారాలు వంటి సందర్భాల్లో గేయం తప్పనిసరిగా వినిపించాలన్నారు. బ్యాండ్ ద్వారా వాయించినప్పుడు ముందుగా డ్రమ్ రోల్ వినిపించే విధానం కూడా స్పష్టంచేశారు.
ఉత్సవ, సాంస్కృతిక కార్యక్రమాల్లో ‘వందేమాతరం’ను సామూహిక గానంతో పాడాలని, గాయక బృందం ఏర్పాటుతో పాటు ప్రజలకు స్పష్టంగా వినిపించే విధంగా పబ్లిక్ ఆడిషన్ వ్యవస్థ ఉండాలని సూచించారు. అవసరమైతే ముద్రిత సాహిత్యాన్ని పంపిణీ చేయవచ్చని తెలిపారు. పాఠశాలల్లో రోజు ప్రారంభానికి ముందు సామూహిక గానం ద్వారా విద్యార్థుల్లో జాతీయ భావన పెంపొందించాలని ఆదేశించారు.
డిసెంబర్ 2025లో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ‘వందేమాతరం’ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటంలో దాని ప్రాధాన్యం గురించి ప్రస్తావిస్తూ దీని అసలు ఉద్దేశాన్ని కాంగ్రెస్ బలహీనపరిచిందని విమర్శించారు. “ముందుగా వందేమాతరాన్ని విభజించారు. తరువాత దేశాన్ని విభజించారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

