
బిడ్డలను హత్యచేస్తే పరువు నిలబడుతుందా ?
పరువు పోవటం లేదా పెరగటం అన్నది తల్లి, దండ్రులు లేదా ఇంటిలోని పెద్దల నడవడిక మీదే ఆధారపడుంటుంది
కరీంనగర్ జిల్లా, శివరాంపల్లి గ్రామంలో నవంబర్ 14. రెడ్డి అర్చన(16) తల్లి, దండ్రులు రెడ్డి రాజు, లావణ్య. సైదాపూర్ మోడల్ స్కూల్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అదే గ్రామంలో ఉంటున్న అనీల్ తో ప్రేమలో పడింది. అప్పటికే అనీల్ కు వివాహమైంది. భార్యతో గొడవల కారణంగా విడిగా ఉంటున్నాడు. కూతురు ప్రేమ విషయం తెలిసి మందలించారు. కూతురు వినకపోవటంతో పెళ్ళయిన వాడిని కూతురు వివాహం చేసుకుంటే తమ పరువుపోతుందన్న కోపంతో కూతురిని హత్యచేయాలని డిసైడ్ అయ్యారు. నవంబర్ 14వ తేదీ రాత్రి నిద్రపోతున్న అర్చన గొంతులో బలవంతంగా పురుగుల మందుపోసేశారు. పురుగుల మందుతో చనిపోదేమో అన్న అనుమానంతో గొంతునులిమి ఊపిరి ఆడకుండా చేయటంతో చనిపోయింది.
థైరాయిడ్, కడుపునొప్పితో విషంతీసుకుని కూతురు ఆత్మహత్య చేసుకుందని అందరికీ చెప్పి నమ్మించే ప్రయత్నంచేశారు. అర్చన డెడ్ బాడీలో నుండి పురుగుల మందువాసన వస్తుండటాన్ని గమనించిన కొందరు పోలీసులకు ఇదేవిషయాన్ని చెప్పారు. దాంతో పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకున్నారు. తల్లి, దండ్రులను స్టేషన్ కు తీసుకెళ్ళి విచారించినపుడు అన్నీవిషయాలు బయటకు వచ్చాయి. కూతురును మర్డర్ చేసిన విషయాన్ని తల్లి, దండ్రులు అంగీకరించారు. ప్రస్తుతం ఇద్దరినీ కోర్టు రిమాండ్ కు పంపింది.
నిజంగా తల్లి, దండ్రులు తమపిల్లలను ఇంత క్రూరంగా చంపటం ఎంతవరకు న్యాయం ? తమిష్టానికి వ్యతిరేకంగా కూతురు కులాంతర వివాహం చేసుకుంటే సంబంధాలు తెంపుకుని దూరంగా పెట్టేయటం పద్దతి. అలాకాకుండా అమ్మాయిని గొంతులో పురుగుల మందుపోసి చంపాలని ప్రయత్నించటం ఎంతవరకు సబబు ? అక్కడితో ఆగకుండా పురుగుల మందు గొంతులో పోసినా కూడా బతుకుతుందేమో అని అనుమానించి గొంతునులిమి చంపేయటం హ్రుదయవిధారకమనే చెప్పాలి. ఇన్నిరకాలుగా కూతురును హింసించి చంపటంలోనే తల్లి, దండ్రుల క్రూరత్వం బయటపడుతోంది. తండ్రికి మద్దతుగా తల్లి కూడా హత్యలో భాగం పంచుకోవటం గుండెను పిండేయటం చాలా బాధాకరమనే చెప్పాలి.
ఇంకో ఘటన నవంబర్ 17, రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలో జరిగింది. తమ్ముడు ఎర్రా చంద్రశేఖర్ ప్రేమ వివాహాన్ని దగ్గరుండి జరిపించాడన్న కోపంతో పెళ్ళికూతురు తండ్రి, బంధువులు అన్న ఎర్రా రాజశేఖర్ ను ఊరి శివార్లకు తీసుకెళ్ళి పెట్రోలు పోసి చంపేశారు. కారణం ఏమిటంటే తన కూతురు ఎస్సీ యువకుడు చంద్రశేఖర్ ను వివాహం చేసుకోవటంతో పరువు పోయిందని భావించటమే.
ఇలాంటి పరువు హత్యలకు 2018లో నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో జరిగిన ఘటనే మూలమని అనుకోవాలి. సూర్యాపేటకు చెందిన ప్రణయ్ కుమార్-అమృత ప్రేమించుకున్నారు. వీరి ప్రేమే కాకుండా వివాహం చేసుకోవటం అమ్మాయి తల్లి, దండ్రులకు ఏమాత్రం ఇష్టంలేదు. అయితే తల్లి, దండ్రుల ఇష్టంతో ప్రమేయంలేకుండానే అమృత వివాహం చేసుకున్నది. తమనుండి కూతురును ప్రేమపేరుతో దూరంచేశాడన్న కోపంతో పాటు కులాంతర వివాహం చేసుకుని పరువు తీసేసిందన్న కోపంతోనే తండ్రి మారుతిరావు కూతురు వివాహం చేసుకున్న ప్రేమ్ కుమార్ ను చంపించేశాడు. అమ్మాయి తండ్రి మారుతీరావు అల్లుడు ప్రణయ్ ను నడిరోడ్డుమీద కత్తులతో పొడిచి చంపేట్లుగా కాంట్రాక్టు ఇచ్చి మరి చంపిచటం అప్పట్లో తెలంగాణలో సంచలనం సృష్టించింది. అప్పటినుండే రాష్ట్రంలో పరువు హత్యలు పెరుగుతున్నాయి.
మరో ఘటనలో హయత్ నగర్ పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న చెల్లెలు నాగమణి ఒక ఎస్సీ యువకుడిని వివాహం చేసుకున్నదన్న కోపంతో అన్నే చెల్లెలును చంపేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే అమ్మాయి పోలీసు కానిస్టేబుల్ గా పనిచేస్తున్నా కూడా పరువుహత్యకు బలైపోవటం. డ్యూటీకి స్కూటీ మీద వెళుతున్న చెల్లెలును సోదరుడు వెనుకనుండి కారుతో గుద్దాడు. దూరంగా వెళ్ళిపడిన చెల్లెలును కారుతో తొక్కించి మరీ చంపటం కర్కశానికి పరాకాష్టనే చెప్పాలి.
అలాగే, పెద్దపల్లి జిల్లాలోని ముప్పిరతోట గ్రామంలో సాయికుమార్ ను అమ్మాయి తండ్రి కత్తితో నరికి చంపేశాడు. తనకూతురు, సాయికుమార్ ప్రేమించుకోవటం ఇష్టంలేని తండ్రి ముత్యంసారయ్య, సాయికుమార్ ను పుట్టినరోజు నాడే చంపేశాడు. ఈ ఘటన మార్చి 29వ తేదీన జరిగింది. ఇలాంటి ఘటనలే జగిత్యాల్, సూర్యాపేట, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా జరిగాయి.
తమ కూతురు లేదా కొడుకు ఇతర కులానికి చెందిన వారిని వివాహం చేసుకుంటే నిజంగానే తల్లి, దండ్రుల పరువు పోతుందా ? అన్నదే పాయింట్. నిజానికి పరువు పోవటం లేదా పెరగటం అన్నది తల్లి, దండ్రులు లేదా ఇంటిలోని పెద్దల నడవడిక మీదే ఆధారపడుంటుంది. పరువు అన్నది ఒక భావన లేదా భ్రమ. నలుగురు తమగురించి తప్పుగా మాట్లాడుకుంటారన్న ఆలోచనే పరువుగా మారుతోంది. అలాంటి ఆలోచనలో నుండి వచ్చేదే పరువు హత్యలు. పిల్లలు కులాంతర వివాహం చేసుకున్నపుడు పోయేది కాదు పరువు. పిల్లల వివాహాలను అంగీకరించలేక ఆవేశంలో వారిని చంపటం వల్ల శిక్షలు పడినపుడు పోయేదే అసలైన పరువు.
పరువు హత్యలు ఎప్పుడు ఆగుతాయి ? చట్టాలు, కోర్టులు పరువుహత్యలను అడ్డుకోవు. పరువుహత్యలు ఆగాలంటే మనుషుల ఆలోచనల్లో మార్పురావాలి. మనుషుల ఆలోచనల్లో మార్పు రావాలంటే ప్రభుత్వం, కోర్టులు, స్వచ్చంద సంస్ధలు కలిసి మనుషుల్లో చైతన్యం వచ్చేట్లుగా మార్పుకు కృషిచేయాలి. మనుషుల ఆలోచనల్లో మార్పు వచ్చినపుడు మాత్రమే పరువుహత్యలు ఆగుతాయి. లేకపోతే పరువుహత్యలు ఇలా జరుగుతునే ఉంటాయి.

