
కట్టెల పొయ్యి మీద ఆధారపడి ప్రస్తుతానికి నెట్టుకొస్తున్న హాస్టళ్లు
గ్యాస్ సరఫరాలో ఇబ్బందుల మధ్యే ఆహారం అందించే ప్రయత్నం చేస్తున్న హాస్టళ్లు
పశ్చిమాసియాలో యుద్దం వలన వచ్చిన గ్యాస్ సరఫరాలో ఒడిదుడుకుల ప్రభావం హాస్టల్ లలో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగస్థులపై స్పష్టంగా పడుతోంది. మెనూలో మార్పులతో ప్రస్తుతానికి ఆహారం అందిస్తున్నా రాబోయే రోజులు సమస్యలు మరింత జటిలం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
గ్యాస్ ఎక్కువగా అవసరం అయ్యే చపాతీ, పూరీ, దోస లాంటి ఆహార పదార్థాల బదులు ఉప్మా, పొంగలి, పోహ లాంటి టిఫిన్ హాస్టల్ అందిస్తోందని ప్రెస్టీజ్ కంపెనీ (Prestige Group) లో సివిల్ ఇంజనీర్ గా పని చేస్తున్న కే. వినూత చెప్పారు. మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం యదా విధిగా అందిస్తున్నా వేపుళ్ళు లేకుండా పోయాయని ఆమె పేర్కొన్నారు. “గ్యాస్ కొరత రీత్యా ఇది తప్పనిసరి పరిణామం కాబట్టి మేము హాస్టల్ వారికి సహకరిస్తున్నాము. ప్రొద్దున్నే టిఫిన్ సమాయనికే మధ్యాన భోజనం సిద్దంగా ఉంటుంది కాబట్టి అదే ఆఫీసు కు తీసుకువెళ్తున్నాము. టి, కాఫీ లాంటివి ఆఫీసు లో ఉండే మెషిన్ లో నే తీసుకుంటాం కాబట్టి ప్రస్తుతానికి పెద్ద ఇబ్బందులు ఎదురు కావటం లేదని,” ఆమె వివరించారు.
మాది రియల్ ఎస్టేట్ కంపెనీ కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ కు అవకాశం లేదు. ఇది మన చేతిలో లేని ప్రస్తుత పరిస్థితి కాబట్టి ఫుడ్ ఐటమ్స్ తగ్గినా సర్దుకుంటున్నాము, అని ఆమె చెప్పారు.
తాను ఉంటున్న హాస్టల్ లో కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ సమయానికి తమకు ఆహారం అందిస్తున్నారని యాక్సెంచర్‌లో (Accenture) సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఎన్. హష్మిత చెప్పారు. ఆఫీసు లో ఇది వరకు ప్రతి ఫ్లోర్ లో ఉండే క్యాంటీన్ సౌకర్యం ప్రస్తుతం ప్రతి రెండు ఫ్లోర్ లకు ఒకటి చొప్పున నడుపుతున్నారని. దీని వలన స్పెషల్ డిష్ లు ఆర్డర్ చేస్తే తినటానికి ఎక్కువ సమయం పడుతోందని వివరించారు. “మా ఆఫీసుకు దగ్గరలో పెద్ద రెస్టారెంట్స్ ఏమి లేవు. కాబట్టి తప్పని సరిగా హాస్టల్ లో ఇచ్చిన భోజనం తీసుకెళ్ళి తింటున్నాము,” అని ఆమె చెప్పారు.
తమ ఆఫీసు లో కెఫెటేరియా పూర్తిగా మూసివేశారని ఇన్ఫోసిస్ (Infosys) ఉద్యోగి మోనికా చెప్పారు. హాస్టల్ భోజనం బాగున్నా మార్పు కోసం తోటి ఉద్యోగస్తులతో సరదాగా క్యాంటీన్ లో టీం లంచ్ లాంటివి ఇప్పుడు సాధ్యం కావటం లేదని అన్నారు. “హాస్టల్ భోజనం తప్పని సరిగా తెచ్చుకుని తింటున్నాం. హాస్టల్ లో సిబ్బంది కట్టెల పొయ్యి లో కష్టపడి వంట చేసి సమయానికి భోజనం అందిస్తున్నారు. ఆఫీసు బయట 10 నుండి 15 వరకు చిన్న చిన్న టి కొట్లు ఉండేవి వాటిలో నిన్న సాయంత్రానికే కేవలం రెండు మూడు మాత్రమే తెరిచారు. మిగిలినవి బంద్ అయ్యాయి,” అని ఆమె చెప్పారు.
తాను పని చేసే ఎర్నస్ట్ అండ్ యంగ్ (Ernst & Young) కంపెనీ లో ఆఫీసు కెఫెటేరియా సమయాల్లో మార్పులు చేశారని త్వరగా మూసివేస్తున్నారని చెప్పారు వి. సారిక. “హాస్టల్ లో కట్టెల పొయ్యి లో వంట చేసి ఆహారం అందిస్తున్నారు అయితే మెనూ లో ఐటమ్స్ తగ్గాయి. గ్యాస్ తక్కువగా అవసరం అయ్యే ఆహార పదార్థాలు మాత్రమే వండుతున్నారు. కంపెనీ హెచ్ ఆర్ డిపార్ట్మెంట్ చెప్పిన వివరాల ప్రకారం ఆఫీసు క్యాంటీన్ త్వరలో మూసి వేస్తారు,” అని వివరించారు.
కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశం ఉంటుందా అన్న ప్రశ్నకు అలా ఆలోచించే అవకాశం ఉందనిపిస్తోందని ఆమె అన్నారు. ప్రస్తుతం అలాంటి అవకాశం ఇస్తే పరిస్థితి మెరుగ్గా ఉంటుందని ఆమె అన్నారు.
తమ వద్ద ఉన్న ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తున్నామని నెక్స్ట్ జెన్ గ్రూప్ హాస్టల్ లో ఉద్యోగిగా ఉన్న సుప్రియా చెప్పారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కట్టెల ధర కూడా పెరుగుతుందని ఆ హాస్టల్ ల యజమాని వి. మహీధర్ చెప్పారు.
ఇప్పటికే పరిస్థితి తీవ్రతను వివరిస్తూ ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ మీడియా కు ఒక లేఖ విడుదల చేసింది. హైదరాబాద్ లో 11,000 హాస్టల్ లు ఉన్నాయని వాటికి 20 నుండి 25 శాతం మాత్రమే గ్యాస్ సిలిండర్ లు సరఫరా అవుతున్నాయని కాబట్టి అన్ని హాస్టల్ లలో టి, కాఫీ, చపాతీ, దోశ, పూరీ లాంటి టిఫిన్ లను వండటం సాధ్యం కాదని వాటిని తాత్కాలికంగా ఆపివేస్తున్నామని అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరనాథ్ రెడ్డి చెప్పారు.
కాగా రాష్ట్రంలో LPG నిల్వలు, గ్యాస్ వినియోగదారులకు పంపిణీ, ప్రస్తుత పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు శుక్రవారం డా.బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు, సివిల్ సప్లై విభాగం అధికారులతో సమీక్ష చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరా, నిల్వలు, రవాణా వ్యవస్థ, భవిష్యత్ అవసరాలు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా సి.ఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో గృహ వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోజు వారి సమీక్ష, బ్లాక్ మార్కెటింగ్ లేకుండా చర్యలు, డిస్ట్రిబ్యూటరీలు, ఎజెన్సీల దగ్గర పోలీస్ నిఘా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.29 కోట్ల గృహ వినియోగదారుల కనెక్షన్లు ఉన్నాయిని, ప్రస్తుత డిమాండ్ కు సరిపడా నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఆసుపత్రులు, ప్రభుత్వ హాస్టళ్లు కు డిమాండ్ మేరకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. గృహ వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్ల సరఫరా విషయంలో ఎలాంటి ఆందోళన చేందాల్సిన అవసరం లేదని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, శాఖ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 810 డిస్ట్రిబ్యూటరీ కేంద్రాలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా చేస్తున్నాయని అన్నారు. వినియోగదారులకు సకాలంలో డెలివరీ జరిగేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చర్యలు తీసుకోవాలని సి.ఎస్ ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమయానికి సరఫరా అందేలా సంబంధిత శాఖలతో సమన్వయం పెంచాలని సూచించారు.
ఈ సమావేశంలో HPCL, IOCL, BPCL మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

