హైదరాబాద్‌లో ఇల్లు కొనేదెలా? బంజారాహిల్స్‌ దగ్గర గజం రూ.2 లక్షలు!
x

హైదరాబాద్‌లో ఇల్లు కొనేదెలా? బంజారాహిల్స్‌ దగ్గర గజం రూ.2 లక్షలు!

హైదరాబాద్‌లో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయా?


1) హైదరాబాద్‌లో ఇల్లు కొనేదెలా? బంజారాహిల్స్‌ దగ్గర గజం రూ.2 లక్షలు!

2) బ్లాక్ ఫ్రైడే ఆఫర్లకు ఆశపడితే..బ్యాంక్ ఖాతా ఖాళీ!

3) 50 వేల మంది నకిలీ డాక్టర్లు! వీళ్ల చేతిలో మీ ప్రాణాలు!

1) హైదరాబాద్‌లో ఇల్లు కొనేదెలా?బంజారాహిల్స్‌ దగ్గర గజం రూ.2 లక్షలు!

హైదరాబాద్‌లో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయా? బంజారాహిల్స్‌కు సమీపంలో గజం రూ.2 లక్షలు! ఒక ప్లాట్ కొనాలంటే కనీసం రూ.21 కోట్లకు పైగా ఉండాలి! హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు సమీపంలో ఉన్న హుడా హైట్స్ లేఅవుట్‌లో 8 ప్రీమియం ఓపెన్ ప్లాట్లను న‌వంబ‌ర్ 25వ తేదీన ఉద‌యం 11 గంట‌ల నుంచి 2 గంట‌ల వ‌ర‌కు ఆన్ లైన్‌లో హెచ్‌ఎండీఏ ఈ-వేలం వేయనుంది.

షేక్‌పేట్ మండలం, హకీంపేట్ గ్రామంలోని ఎమ్మెల్యే కాలనీ సమీపంలో ఈ ప్లాట్లు ఉన్నాయి. ఒక్కో ప్లాట్ విస్తీర్ణం 1,084 నుంచి 1,438 చదరపు గజాల వరకు ఉంది. చదరపు గజానికి కనీస ధరను రూ.2 లక్షలుగా నిర్ణయించారు. హెచ్‌ఎండీఏ వేలంలోకి తీసుకొస్తున్న ఈ భూముల ధరలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారాయి. అంటే.. చిన్న ప్లాట్‌కే కనీస ధర సుమారు రూ.21.69 కోట్లు. పెద్ద ప్లాట్‌కు దాదాపు రూ.28.76 కోట్లు! మొత్తం ఎనిమిది ప్లాట్ల విస్తీర్ణం కలిపి 10,159 చదరపు గజాలు. కనీస ధరల ప్రకారమే వీటి మొత్తం విలువ రూ.203 కోట్లకు పైగా ఉంటుంది. వేలంలో పాల్గొనాలంటే ఒక్కో ప్లాట్‌కు కోటి రూపాయల ఈఎండీ చెల్లించాలి.

నవంబర్ 25న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎంఎస్‌టీసీ ప్లాట్‌ఫామ్‌లో బిడ్డింగ్ జరగనుంది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో భూముల సరఫరా పరిమితం. ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాలు కావడం, ప్రముఖ వాణిజ్య సంస్థలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో ఇక్కడ భూములకు భారీ డిమాండ్ ఉంటుంది.

నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం.. బంజారాహిల్స్‌లో నివాస ఆస్తుల ధరలు చదరపు అడుగుకు సుమారు రూ.14,400 నుంచి రూ.16,020 మధ్య ఉన్నాయి. జూబ్లీహిల్స్‌లో రూ.13,400 నుంచి రూ.14,034 వరకు నమోదయ్యాయి. ఇక పశ్చిమ హైదరాబాద్‌లోని కోకాపేట్, నార్సింగి, కొల్లూరు, తెల్లాపూర్ వంటి ప్రాంతాలు కొత్త రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్‌లుగా మారుతున్నాయి. ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఈ ప్రాంతాలకు డిమాండ్ పెంచుతున్నాయి.

కోకాపేట్‌లో సాధారణ హెచ్‌ఎండీఏ లేఅవుట్ ప్లాట్లు గజానికి రూ.75 వేల నుంచి రూ.1.05 లక్షల వరకు ఉంది. ప్రీమియం రోడ్లపై, నియోపోలిస్‌కు సమీపంలో ఈ ధరలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. తెల్లాపూర్‌లో సాధారణ హెచ్‌ఎండీఏ ప్లాట్ల ధరలు సుమారు రూ.45 వేల నుంచి రూ.65 వేల మధ్య ఉండగా, మొకిలాలో రూ.32 వేల నుంచి రూ.48 వేల వరకు ఉన్నట్లు రియల్ ఎస్టేట్ మార్కెట్ అంచనాలు చెబుతున్నాయి. అయితే ఈ రియల్ ఎస్టేట్ వృద్ధిలో సామాన్యుడి పరిస్థితి ఏమిటి?

ఒకవైపు భూముల ధరలు కోట్లకు చేరుతుంటే.. మరోవైపు మధ్యతరగతి కుటుంబం నగరంలో ఒక చిన్న ఇంటిని కొనుగోలు చేయడానికే జీవితకాల పొదుపును వెచ్చించాల్సి వస్తోంది. ఐటీ ఉద్యోగులు, ప్రైవేటు రంగ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు నగరానికి దగ్గరగా ఇల్లు కొనలేక శివారు ప్రాంతాల వైపు వెళ్తున్నారు. అక్కడ కూడా ధరలు క్రమంగా పెరుగుతుండటంతో సొంతింటి కల మరింత భారంగా మారుతోంది.

ఒకవైపు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడుతుంటే.. మరోవైపు అదే నగరంలో సొంతింటి కోసం సామాన్యుడు పోరాడుతున్నాడు. భూముల విలువ పెరగడం నగర అభివృద్ధికి సంకేతం కావచ్చు. కానీ ఆ అభివృద్ధిలో సామాన్యుడికి కూడా చోటు దక్కినప్పుడే అది నిజమైన అభివృద్ధి అవుతుంది!


2) బ్లాక్ ఫ్రైడే ఆఫర్లకు ఆశపడితే..బ్యాంక్ ఖాతా ఖాళీ!

భారీ డిస్కౌంట్లు కనిపిస్తున్నాయని వెంటనే లింకులపై క్లిక్ చేస్తున్నారా? ఒక్కసారి ఆగండి! మీరు చేసే చిన్న పొరపాటు.. మీ బ్యాంక్ ఖాతాను క్షణాల్లో ఖాళీ చేయొచ్చు! ప్రతి ఏడాది థాంక్స్ గివింగ్‌ మరుసటి రోజు వచ్చే బ్లాక్ ఫ్రైడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో షాపింగ్ జరుగుతుంది. ఈ రోజున ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తుంటాయి. ఈ ఏడాది కూడా ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభమైంది. కొత్త గాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇంటి అవసరాలకు సంబంధించిన సామగ్రి కొనుగోలు చేయడానికి ఇదే మంచి అవకాశమని చాలామంది భావిస్తున్నారు.

అయితే.. వినియోగదారుల ఈ షాపింగ్ ఆసక్తినే సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.ఎలా మోసం చేస్తారంటే..ప్రముఖ షాపింగ్ వెబ్‌సైట్లను పోలిన నకిలీ వెబ్‌సైట్లు సృష్టిస్తారు. భారీ డిస్కౌంట్ల పేరుతో వాట్సాప్, ఎస్ఎంఎస్, సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లింకులు పంపిస్తారు. కొన్ని సందర్భాల్లో ఫేక్ క్యూఆర్ కోడ్లను కూడా ఉపయోగిస్తారు.

ఉదాహరణకు.. మార్కెట్ ధర కంటే చాలా తక్కువకు ఖరీదైన మొబైల్ అందిస్తామంటూ ఒక లింక్ పంపిస్తారు. ఆ ఆఫర్ నిజమేనని నమ్మి లింక్ ఓపెన్ చేస్తే.. మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ సమాచారం నమోదు చేయాలని అడగవచ్చు. ఇలా మీ వివరాలు సేకరించి ఖాతాలోని డబ్బును కాజేసే ప్రమాదం ఉంది.

మరికొన్ని సందర్భాల్లో ఆర్డర్ కన్ఫర్మేషన్, పేమెంట్ ఫెయిల్యూర్, రీఫండ్ పేరుతో మోసాలకు పాల్పడతారు. అంటే.. మీరు షాపింగ్ చేస్తున్నారనే నమ్మకంతో మీ డబ్బును కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తారు. ఈ మోసాలపై తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరించారు. భారీ డిస్కౌంట్లు, నమ్మశక్యం కాని ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేక్ వెబ్‌సైట్లు, మోసపూరిత ప్రకటనలు, ఫిషింగ్ లింకుల ద్వారా ప్రజల డబ్బు, బ్యాంకింగ్ వివరాలను దొంగిలించే ప్రయత్నం చేస్తారని తెలిపారు.మరి..

ఈ మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలి?

1.వాట్సాప్, ఎస్ఎంఎస్, సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకండి.

2. షాపింగ్ చేసేటప్పుడు గుర్తింపు ఉన్న, నమ్మకమైన వెబ్‌సైట్లు, యాప్‌లనే ఉపయోగించండి.

3. ఏదైనా లింక్ ఓపెన్ చేసే ముందు వెబ్‌సైట్ URLను జాగ్రత్తగా పరిశీలించండి. అసలు వెబ్‌సైట్ పేరులో చిన్న మార్పులు చేసి నకిలీ సైట్లు సృష్టించే అవకాశం ఉంది.

4. నమ్మశక్యం కానంత తక్కువ ధరలు, బంపర్ ఆఫర్లు కనిపిస్తే వెంటనే నమ్మకండి. వాటి నిజానిజాలు నిర్ధారించుకోండి.

5. అలాగే.. అనుమానాస్పద క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయకండి. తెలియని వ్యక్తులు అడిగితే OTP, UPI PIN, బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయకండి.

గుర్తుంచుకోండి.. బ్లాక్ ఫ్రైడే సేల్‌లో డిస్కౌంట్ పొందాలనే తొందరలో మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను ప్రమాదంలో పెట్టుకోవద్దు. ఆఫర్ నిజమో కాదో చూసుకోండి.. వెబ్‌సైట్ సురక్షితమో కాదో నిర్ధారించుకోండి.. ఆ తర్వాతే షాపింగ్ చేయండి. ఎందుకంటే.. ఒక్క క్లిక్‌తో మంచి డీల్ దొరకొచ్చు. అదే ఒక్క క్లిక్‌తో మీ ఖాతాలోని డబ్బు కూడా మాయమవ్వొచ్చు!


3) 50 వేల మంది నకిలీ డాక్టర్లు! వీళ్ల చేతిలో మీ ప్రాణాలు!

తెలంగాణలో నకిలీ వైద్యుల దందా ఆందోళనకర స్థాయికి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల మంది ఎలాంటి కనీస వైద్య అర్హతలు లేకుండానే అల్లోపతి వైద్యం చేస్తున్నట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చెబుతోంది. వీరిలో అత్యధికులు హైదరాబాద్, నగర శివారు ప్రాంతాల్లోనే ఉన్నారు.

పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివినవారు సైతం క్లినిక్‌లు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల పేరుతో వైద్యం చేస్తున్నారు. సరైన వైద్య పరీక్షలు లేకుండానే మందులు రాస్తున్నారు. సాధారణ వైరల్ జ్వరాలకు కూడా శక్తివంతమైన యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు ఇస్తున్నారు. కొన్నిచోట్ల సెలైన్ ఎక్కించడం, ఇంజెక్షన్లు ఇవ్వడం, కుట్లు వేయడం కూడా చేస్తున్నారు. తనిఖీల్లో బయటపడిన కొన్ని ఘటనలు ఈ దందా తీవ్రతను వెల్లడిస్తున్నాయి.

కరీంనగర్‌లో యాంటీబయాటిక్స్ దందా:

కరీంనగర్ విద్యానగర్‌లోని లక్మీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌పై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడి చేశారు. వైద్య అర్హత లేని వ్యక్తి నిర్వహిస్తున్న ఈ కేంద్రంలో 39 రకాల మందులు గుర్తించారు. వీటిలో 35 రకాల ఫిజీషియన్ శాంపిల్స్ ఉన్నాయి. సెఫిక్సిమ్, అజిత్రోమైసిన్ వంటి శక్తివంతమైన యాంటీబయాటిక్స్ కూడా బయటపడ్డాయి.

హైదరాబాద్‌లో ఆరుగురు అరెస్ట్:

హైదరాబాద్‌లో పోలీసుల దాడుల్లో ఆరుగురు నకిలీ వైద్యులు పట్టుబడ్డారు. డి. రామశేఖర్ రెడ్డి, ఆర్. సుధాకర్, ఎం. భారతి, కె. మహేశ్ రావు, పి. బాల నరసింహ, మొహమ్మద్ అబ్దుల్ వలీని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు 53 వేల రూపాయల విలువైన సిరంజీలు, సెలైన్ బాటిళ్లు, ఇంజెక్షన్లు, శస్త్రచికిత్స పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని కేంద్రాల్లో రోగులకు సెలైన్ ఎక్కించడంతో పాటు కుట్లు కూడా వేస్తున్నట్లు గుర్తించారు.

అల్వాల్‌లో నాలుగు క్లినిక్‌ల బాగోతం:

హైదరాబాద్ అల్వాల్‌లో నాలుగు క్లినిక్‌లపై TGMC అధికారులు దాడులు చేశారు. వైద్య అర్హతలు లేని వ్యక్తులు స్టెరాయిడ్లు, పెయిన్‌కిల్లర్లు, యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు గుర్తించారు.శంకర శశాంక క్లినిక్‌లో గోపు శ్రీనివాస్, శ్రీ సాయి పాలీ క్లినిక్‌లో జి. జనకీరాములు, కోమల్ క్లినిక్‌లో సుదర్శన్, షెభా క్లినిక్‌లో క్రిస్టోఫర్ అర్హత లేకుండా వైద్యం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ఒకరు ఫిజియోథెరపిస్ట్ కావడం గమనార్హం.

కామారెడ్డిలో అక్రమ వైద్యం

కామారెడ్డిలో నాలుగు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లపై TGMC అధికారులు తనిఖీలు చేశారు. పాపులర్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు ఎండీ గులాం దస్తగిరి, నరేష్, ఎం. శ్రీనివాస్, ఎ. శివాజీ రావు నిర్వహిస్తున్న కేంద్రాల్లో అక్రమ వైద్యం బయటపడింది. వీరిపై తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ చట్టం, నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

జిల్లాలకూ విస్తరించిన దందా:

నకిలీ వైద్యుల సమస్య హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. నిజామాబాద్‌లో 11 మంది అనర్హ వైద్యులపై కేసులు నమోదయ్యాయి. నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ అక్రమ క్లినిక్‌లు బయటపడ్డాయి. కల్వకుర్తి, అమంగల్ ప్రాంతాల్లోనూ వరుస తనిఖీలు జరిగాయి. కొన్ని కేంద్రాల్లో చిన్నపిల్లలకు చికిత్స అందించడంతో పాటు రోగులను అడ్మిట్ చేసుకునేందుకు బెడ్లు కూడా ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

2026 జనవరి నుంచి నవంబర్ వరకు రాష్ట్రవ్యాప్తంగా వ‌700 కేసులు నమోదయ్యాయి. వీటిలో 300కు పైగా హైదరాబాద్‌లోనే ఉన్నట్లు సమాచారం. ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతోంది?సాధారణ వైరల్ జ్వరాలకు యాంటీబయాటిక్స్ అవసరం ఉండదు. అయినా విచ్చలవిడిగా వాటిని వాడటం వల్ల యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. అంటే భవిష్యత్తులో సాధారణ ఇన్ఫెక్షన్లకు కూడా యాంటీబయాటిక్స్ పనిచేయని ప్రమాదం ఉంది.

ఇక స్టెరాయిడ్ల విషయానికొస్తే.. తక్షణ ఉపశమనం కోసం వీటిని అనవసరంగా వాడితే రక్తంలో చక్కెర స్థాయులు పెరగడం, ఇన్ఫెక్షన్ల ముప్పు పెరగడం సహా తీవ్రమైన దుష్ప్రభావాలు ఎదురవుతాయి.

నకిలీ వైద్యుల దందా ఇంతగా పెరగడానికి కారణమేంటి?

ఇక్కడే ప్రభుత్వ వైద్య వ్యవస్థలోని లోపాలు కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలు, నగర శివార్లలో సరిపడా ప్రభుత్వ వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం.. వైద్యులు, నర్సులు, మందుల కొరత.. ప్రజల్లో వైద్య అవగాహన లేకపోవడం నకిలీ వైద్యులకు వరంగా మారుతున్నాయి.

చిన్న అనారోగ్యానికి కూడా దూర ప్రాంతాలకు వెళ్లలేని పేద, మధ్యతరగతి ప్రజలు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న ఇలాంటి కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ప్రజల ఈ నిస్సహాయతే నకిలీ వైద్యుల వ్యాపారానికి పెట్టుబడిగా మారుతోంది. ఈ నకిలీ వైద్యులకు మందులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మెడికల్ షాపులు, హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్లు ఎలాంటి అర్హతలు పరిశీలించి మందులు సరఫరా చేస్తున్నారు? వైద్య అర్హత లేని వ్యక్తులకు స్టెరాయిడ్లు, యాంటీబయాటిక్స్ ఎలా అందుతున్నాయి? TGMC, డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు చేస్తున్నా ఈ దందా ఎందుకు ఆగడం లేదు? ఒకచోట క్లినిక్ మూతపడితే మరోచోట కొత్త పేరుతో ఎలా ప్రారంభిస్తున్నారు? నమోదవుతున్న వందల కేసుల్లో ఎంతమందికి శిక్షలు పడుతున్నాయి?

అంటే సమస్య కేవలం నకిలీ వైద్యుల దగ్గరే ఆగిపోవడం లేదు. వారి వెనుక ఉన్న మందుల సరఫరా వ్యవస్థ, ప్రభుత్వ వైద్య సేవల్లో లోపాలు, అధికారుల పర్యవేక్షణ కూడా ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.వైద్యం అనేది వ్యాపారం కాదు.. ప్రయోగం అంతకన్నా కాదు. అర్హత లేని వ్యక్తుల చేతుల్లో ప్రజారోగ్యం ఉంటే మూల్యం చెల్లించేది వైద్యం కోసం వచ్చిన సామాన్యులే. తక్షణ ఉపశమనం కోసం వెళ్లిన రోగి.. జీవితాంతం ఆరోగ్య సమస్యలతో బాధపడే పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

Read More
Next Story