
మిస్సైల్ టెస్ట్
‘సుదర్శన చక్ర’ దేశాన్ని ఎలా రక్షిస్తుంది?
త్రివిధ దళాలను సమన్వయం చేయడంతో పాటు సైబర్ ముప్పు తట్టుకునేలా ఏర్పాట్లు
దేశంలోని కీలక నగరాలు, ఆర్థిక, సైనిక, పౌర ఆవాసాలను రక్షించేందుకు ‘‘ మిషన్ సుదర్శన చక్ర’’ ను ప్రారంభించినట్లు ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి ప్రకటించారు. ఇది శత్రువులు దేశంపై జరిగే దాడి నుంచి రక్షించడానికి ఉపయోగపడే పూర్తి స్వదేశీ వైమానిక రక్షణ వ్యవస్థ అని తెలుస్తోంది. పాకిస్తాన్, చైనా నుంచి భారత్ కు సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ చర్య అనివార్యంగా మారింది.
స్వదేశీ రక్షణ సాంకేతికత..
ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో రక్షణ వేదికల కోసం విదేశీ సాంకేతికత పరిజ్ఙానంపై ఆధారపడటాన్ని తగ్గించాలనే న్యూఢిల్లీ దృఢ సంకల్పాన్ని గట్టిగా చెప్పారు. ఫైటర్ జెట్ల కోసం దేశీయంగా జెట్ ఇంజిన్లను ఆవిష్కరించాలని భారతీయ శాస్త్రవేత్తలను కోరారు.
‘సుదర్శన చక్ర’’ వ్యవస్థ ప్రత్యేకతలను ప్రధానమంత్రి వివరించనప్పటికీ నిపుణులు దీనిని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ నమూనాలో రూపొందించవచ్చని భావిస్తున్నారు. ఇది చాలా ప్రభావవంతమైన క్షిపణి కవచంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
శత్రు దేశాల దాడులను సమర్థవంతంగా నిలువరించడానికి, శక్తివంతమైన ప్రతిదాడులను అందించడానికి ఈ వ్యవస్థను రూపొందించనున్నట్లు మోదీ చెప్పారు. ప్రతి పౌరుడి భద్రతను నిర్థారించడానికి దాని రక్షణ కవరేజ్ ను అందిస్తుందని ఉద్ఘాటిస్తున్నారు.
కృష్ణుడి సుదర్శన చక్రం..
శ్రీ కృష్ణుడి జన్మాష్టమికి ఒక రోజు ముందు మోదీ ఎర్రకోట నుంచి ప్రసంగించి, అందులో ‘సుదర్శన చక్రం’ గురించి ప్రజలకు వివరించారు. శ్రీ కృష్ణుడి పురాణ ఆయుధం సుదర్శన చక్రం నుంచి ప్రేరణగా తీసుకుని తయారు చేస్తున్నట్లు చెప్పారు.
దేశ ఆధునిక రక్షణ ఆవిష్కరణలకు మార్గ నిర్దేశం చేయడానికి భారత్ దాని గొప్ప సాంస్కృతిక, పౌరాణిక వారసత్వం నుంచి ప్రేరణ పొందుతుందని మోదీ హైలైట్ చేశారు.
ఈ స్వదేశీ ప్రాజెక్ట్ వ్యూహాత్మక, పౌర మౌలిక సదుపాయాలను రక్షించడానికి ఆధునాతన రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తుందని, కచ్చితమైన సామర్థ్యంతో ప్రతిస్పందన ఇస్తుందని ప్రధాని చెప్పారు.
భవిష్యత్ లో వివాదం తలెత్తితే రిలయన్స్ ఇండస్ట్రీస్ జామ్ నగర్ శుద్ది కర్మాగారంతో సహ భారత మౌలిక సదుపాయాలపై దాడులు జరిగే అవకాశం ఉందని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ బెదిరించినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో ప్రధాని ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆగష్టు 14న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకున్న పాకిస్తాన్.. తన రక్షణ దళంలో చైనా నమూనాలో రాకెట్ దళాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత భారత్ ఈ మేరకు ప్రకటన చేసింది.
రాష్ట్ర సురక్ష కవచ్..
‘‘రాష్ట్ర సురక్ష కవచ్’’ పేరుతో కొత్త సాంకేతిక వేదికలను ‘‘జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రతి సందేశం, ఆసుపత్రులు, మతపరమైన ప్రదేశాలు, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలతో ఇతర సున్నితమైన ప్రదేశాలు వంటి కీలకమైన మౌలిక సదుపాయాలను రక్షించడానికి మోహరించినట్లు మోదీ పేర్కొన్నారు.
‘‘2035 నాటికి నేను ఈ కవచాన్ని విస్తరించాలని బలోపేతం చేయాలని, ఆధునీకరించాలని కోరుకుంటున్నాను. శ్రీ కృష్ణుడి నుంచి ప్రేరణ పొంది, మనం సుదర్శన చక్ర మార్గాన్ని ఎంచుకున్నాము.
మొత్తం వ్యవస్థను భారత్ శోధించి, అభివృద్ది చేసి, తయారు చేయాలి’’ అని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో అన్నారు. ప్రతి పౌరుడు రక్షణ పొందారని భావించాలని మోదీ అన్నారు.
సమగ్ర వాయు రక్షణ..
భారత్ ఇంటిగ్రేటేడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్(ఐఏసీసీఎస్) ను అత్యాధునిక క్షిపణి స్ట్రైక్ ఫోర్స్ తో అనుసంధానించే ప్రణాళిక సుదర్శన చక్ర ప్రధాన లక్ష్యం.
ఐఏసీసీఎస్ అనేది పూర్తిగా ఆటోమేటేడ్, రియల్ టైమ్ ఎయిర్ డిఫెన్స్ కమాండ్ సిస్టమ్, ఇది వివిధ సెన్సార్లు, రాడార్లు, ఆయుధ వ్యవస్థలను అనుసంధానించి దేశాన్ని కాపాడుతుంది.
అలాగే ఇది త్రివిధ దళాల మధ్య సజావుగా సమన్వయంతో దాడులు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఆర్మీ, నేవీ, వైమానిక దళ వైమానిక రక్షణ నెట్ వర్క్ లను అనుసంధానించే ఐఏసీసీఎస్, ఆపరేషన్ సిందూర్ సమయంలో వాయు ఆధిపత్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించింది. దాదాపు 100 గంటలపాటు పాకిస్తాన్ క్షిపణులు రాకుండా నిరోధించింది.
సహకార ప్రాజెక్ట్..
ఈ మిషన్ గురించి బాహ్య ప్రపంచానికి పెద్దగా వివరాలు తెలియదు. అయితే సుదర్శన చక్రం క్షిపణులను అడ్డగించి, కచ్చితమైన ప్రతిదాడి సామర్థ్యాలతో పాటు, డిజిటల్ యుద్ధాలను ఎదుర్కోవడానికి యాంటీ సైబర్ యుద్ధ చర్యలను అభివృద్ది చేసే అవకాశం ఉందని వర్గాలను ఉటంకిస్తూ ఎన్డీటీవీ పేర్కొంది.
ఈ రక్షణ ప్రాజెక్ట్ రక్షణ పరిశోధన సంస్థలు, సాయుధ దళాలు, ప్రయివేట్ రంగ ఆవిష్కర్తల మధ్య సహకారంగా ఉంటుందని కీలకమైన రక్షణ మౌలిక సదుపాయాలలో స్వావలంబన కోసం ప్రభుత్వ ఆత్మ నిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్ తరువాత మోదీ చేసిన మొదటి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం ఇది. రక్షణలో భారత్ స్వావలంబనకు రుజువుగా ఆయన దీనిని ప్రశంసించారు.
ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి తరువాత పాకిస్తాన్, పాక్ ఆక్రమిత పీఓజేకేలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై నిర్ణయాత్మక, స్వతంత్ర్య చర్యకు స్వదేశీ ఆయుధాలు దోహదపడ్డాయని పేర్కొన్నారు.
Next Story