ప్రపంచ మార్కెట్ల వైపు భారత్ మరో పెద్ద అడుగు
x

ప్రపంచ మార్కెట్ల వైపు భారత్ మరో పెద్ద అడుగు

EU, అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు.. భారత్ ఆర్థిక వృద్ధి తదుపరి దశను నిర్ణయించే అవకాశం


1991 ఆర్థిక సంస్కరణలు భారత్‌లో పరిశ్రమల ఏర్పాటు, పేదరికాన్ని తగ్గించేందుకు దోహదపడ్డాయని ది ఫెడరల్ ఎడిటర్-ఇన్-చీఫ్ ఎస్. శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ (EU), అమెరికాతో కుదిరిన కొత్త వాణిజ్య ఒప్పందాలు కూడా అలాంటి పెద్ద మార్పుకే సంకేతమని ఆయన అభిప్రాయపడ్డారు.

టాకింగ్ సెన్స్ విత్ శ్రీని కార్యక్రమంలో శ్రీనివాసన్ మాట్లాడుతూ.. 1991లో లైసెన్స్ నియంత్రణలు తగ్గడం, విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం వల్ల వినియోగదారులకు ఎన్నో ఎంపికలు వచ్చాయి. ఇప్పుడు వాణిజ్య ఒప్పందాలు కూడా అలాంటి మార్పునే తీసుకురాగలవని చెప్పారు.

EUతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం భారత్‌కు పెద్ద మార్కెట్లు తెరవనున్నాయి. దీని వల్ల ప్రపంచ సరఫరా గొలుసుల్లో భారత్‌కు మరింత స్థానం లభిస్తుందని, దేశీయ మార్కెట్లో పోటీ పెరుగుతుందని భావిస్తున్నారు.

వినియోగదారులపరంగా చూస్తే కార్లు, బైకులు, వైన్, పాల ఉత్పత్తులు వంటి వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అయితే దేశీయ తయారీ, వ్యవసాయ రంగాలకు పోటీ పెరగడం వల్ల ఒత్తిడి ఉండొచ్చని హెచ్చరించారు. నాణ్యత, ఎగుమతుల విషయంలో భారత్ ఇంకా బలపడాల్సి ఉందన్నారు.

1991లో సంక్షోభం కారణంగా సంస్కరణలు తీసుకురాగా, ఇప్పుడు ఆర్థిక సూచికలు బాగున్నప్పటికీ వాణిజ్య ఒత్తిళ్ల వల్ల ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా సుంకాలు తగ్గించినా, అవి ఇంకా ఎక్కువగానే ఉన్నాయని చెప్పారు. అయితే వియత్నాం, బంగ్లాదేశ్‌లతో పోలిస్తే భారత్ కొంత మెరుగైన స్థితిలో ఉందని పేర్కొన్నారు.

వ్యవసాయం వంటి రాజకీయంగా సున్నితమైన రంగాల్లో ప్రభుత్వం రాజీ పడే అవకాశం తక్కువేనన్నారు. గోధుమ, బియ్యం, పాలు వంటి ప్రధాన ఉత్పత్తుల విషయంలో రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిందేనని స్పష్టం చేశారు.

మొత్తానికి, ఈ వాణిజ్య ఒప్పందాలు సిద్ధాంతపర నిర్ణయాలు కావని, అవసరానికి తీసుకున్న ఆచరణాత్మక నిర్ణయాలని శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు. ఈ మార్పులు భారత్ ఆర్థిక వృద్ధి తదుపరి దశను నిర్ణయించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Read More
Next Story