
‘ఫోన్ ట్యాపింగ్ తో ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో తొంగిచూడటం ఏ సంస్కృతి”
బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వారిని కూడా సాక్షులుగా పిలుస్తున్నాం; బిఆర్ఎస్ నేతలనే కాదు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన అప్రజాస్వామిక విధానాలపై పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ప్రభుత్వాలను చూశానని, ఫోన్ ట్యాపింగ్ వంటి నీచమైన రాజకీయాలను కేవలం కేసీఆర్ హయాంలోనే చూశానని ఆయన విమర్శించారు.
శనివారం ప్రజా భవన్ లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
2021 నుండి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయని, మాజీ గవర్నర్ తమిళిసై, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, ఈటల రాజేందర్, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ వంటి వారిపై నిఘా పెట్టారనే అనుమానాలను వారు గతంలో వ్యక్తం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆయన అన్నారు. పోలీసు, ఇంటెలిజెన్స్ వంటి వ్యవస్థలను సొంత పార్టీ నేతలను, ప్రతిపక్ష పార్టీ నేతలను, వ్యాపారవేత్తలను బ్లాక్ మెయిల్ చేయడానికి వాడుకోవడం బీఆర్ఎస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
గత ప్రభుత్వంలో అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి, ప్రొఫెసర్ కోదండరాం వంటి వారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు మీ రాజకీయ విలువలు ఏమయ్యాయని మంత్రి నిలదీశారు. “మేము అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపులకు దిగలేదు. ఒకవేళ అదే మా ఉద్దేశమైతే ఎప్పుడో జైలుకు పంపేవాళ్లం. కానీ మేము చట్టాన్ని గౌరవిస్తున్నాం. కేవలం సాక్షిగా సమాచారం అడిగే సీఆర్పీసీ 160 నోటీసు ఇస్తేనే ఇంతలా భయపడిపోవాలా?” అని ఆయన ప్రశ్నించారు.
సాక్షిగా సిట్ విచారణకు పిలిస్తే, కేటీఆర్ ఎందుకు అంతలా ఆందోళన చెందుతున్నారని మంత్రి ప్రశ్నించారు. గతంలో ఏ విచారణకైనా సిద్ధం అని ప్రగల్భాలు పలికిన కేటీఆర్, ఇప్పుడు నోటీసులు రాగానే డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం లేకపోతే, నిర్ధోషులైతే భయపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అత్యంత దుర్మార్గమని, ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో తొంగిచూడటం ఏ సంస్కృతిని సూచిస్తుందో బీఆర్ఎస్ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ఈ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరో సిట్ దర్యాప్తులో తేలాల్సి ఉందని, నిజాలు బయటకు రావడం ఖాయమని చెప్పారు. రాజకీయ నాయకులు చట్టానికి అతీతులు కాదని, తప్పు చేసిన వారు ఏ పార్టీ వారైనా శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు.
ఈ విచారణలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వారిని కూడా సాక్షులుగా పిలుస్తున్నారని, కేవలం బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేస్తున్నట్లు మాట్లాడటం సరికాదన్నారు. చట్టబద్ధ సంస్థలపై బురద జల్లే ప్రయత్నాలను ప్రభుత్వం సహించదని హెచ్చరించారు. అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు చేసిన వారు ఏ పార్టీ వారైనా సరే శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పారు.
మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, అవినీతి, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని ఛిన్నభిన్నం చేసిన బీఆర్ఎస్ నేతలను ప్రజలు ఎప్పుడో విస్మరించారని మంత్రి అన్నారు. ఇప్పటికైనా కేటీఆర్, హరీష్ రావు తమపై పడ్డ బట్ట కాల్చి ఇతరుల మీద వేసే పనులు మానుకోవాలని హితవు పలికారు.

