ఎలెక్టోరల్ బాండ్ల  గుట్టు విప్పిన యోధుడీయనే...
x

ఎలెక్టోరల్ బాండ్ల గుట్టు విప్పిన యోధుడీయనే...

ఒక మాజీ నేవీ దేశభక్తుడికి 2017 లో కేంద్ర ఎలెక్టోరల్ బాండ్ల స్కీం మీద అనుమానం వచ్చింది. ఇది ప్రజస్వామ్యానికి హాని అనిపించింది. అంతే, యుద్ధం ప్రకటించాడు.నెగ్గాడు


ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని, అధికారపార్టీ కి పారిశ్రామిక వేత్తలకు మధ్య క్విట్ ప్రోకో అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పరువు పోయింది. కీలకమైన కేసుల్లో ఇప్పటి వరకు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వెలువరించడం ద్వారా సుప్రీం కోర్టు పరువు దెబ్బతింటున్నదని అనుకుంటున్న సమయంలో ఈ తీర్పుతో దాని ప్రతిష్ట ఇనుమడించినట్టయింది. ఇది ప్రజాస్వామ్య విజయమని, న్యాయవ్యవస్థ స్వతంత్రతకు తార్కాణమని చాలా మంది విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

ఈ చరిత్రాత్మక మైన తీర్పు వెనక ఒక పెద్ద కథ నడిచింది

న్యాయవ్యవస్థ రాజ్యాంగ బద్దంగా వ్యవహరించడం వల్లనో, దాని స్వతంత్ర వ్యవహారశైలి వల్లనో దాని ప్రతిష్ఠ పెరిగింది కాదు. ఒక వ్యక్తి పట్టుదల, నిరంతర కృషి, ఎదురు దెబ్బలకు బెదరని శౌర్యం ఈ తీర్పుకి పునాది వేశాయి. భారత నౌకాదళంలో కమెడోర్ గా పనిచేసి రిటైరై, ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న లోకేష్ భాత్రా(77) ఆ వ్యక్తి.
బాత్రా ఏడేళ్ళు ఈ వ్యవస్థతొో పోరాటం చేసి సంపాదించిన సమాచారం వల్లే ఈ తీర్పు సాధ్యమయింది. బాత్రా భారత నౌకాదళంలో మొదట హైడ్రోగ్రాఫర్ పని చేశారు. ఆ తర్వాత వివిధ హోదాల్లో పనిచేసి, కమెడోర్ గా రిటైరయ్యారు. 1971లో బంగ్లాదేశ్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. ఏడేళ్ల కిందట 2017 లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర బడ్డెట్ ప్రవేశపెట్టాక ఆయన మరొక యుద్ధం లో ప్రవేశించారు. ఈ సారి ప్రజాస్వామిక పరిరక్షణ యుద్ధం చేపట్టారు. దాని ఫలితమే ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు ‘ఎలెక్టోరల్ బాండ్ల పథకం చెల్లదు’ అని ఇచ్చిన తీర్పు.
ఎలెక్టోరల్ బాండ్ల గురించి బాత్రాకు అనుమానం ఎలా వచ్చింది?
బాత్రా ప్రజా స్వామిక వాది. ప్రభుత్వంలో పారదర్శకత ఉండాలని విశ్వసించేవాడు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2017లో చేసిన బడ్జెట్ ప్రసంగంలో ఎలెక్టోరల్ బాండ్ల గురించి చేసిన ప్రకటనలో ఏదో లోపం కనిపించింది బాత్రాకు. ఎలెక్టోరల్ బాండ్ల పథకాన్ని మొదటి సారి ఈ బడ్జెట్ ప్రసంగం ద్వారానే వెల్లడించారు. మొదట రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల విషయంలో మరింత పారదర్శకత అవసరమని జైట్లీ ప్రకటించారు. ప్రసంగం వింటున్న బాత్ర ఈ ప్రకటనతో సంతోషించారు. తర్వాత ఎలెక్టోరల్ బాండ్ల పథకం ప్రకటించారు. అయితే, అంతలోనే ఈ పథకం కింద విరాళాలు వచ్చేవారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. ఇది పారదర్శకత పెంపొందించడం ఎలా అవుతుంది? నిజానికి దెబ్బతీసే విధంగా ఉంది. ఇలాంటి పథకం గురించి ఎన్నికల కమిషన్ ఏమనింది, రిజర్వు బ్యాంకు ఏమనింది. ఈ పథకం లోతుపాతులు కనుక్కోవాలనుకున్నారు బాత్రా.
లోకేష్ బాత్రా ఆయుధాలేమిటి?
కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ ఫ్రొగ్రెసివ్ ఎలయన్స్ (యుపిఎ) ప్రభుత్వం 2005లో తీసుకు వచ్చిన సమాచార హక్కు చట్టాన్ని ఆయన తన ఆయుధం చేసుకున్నారు. ఈ చట్టం కింద వందకు పైగా విజ్ఞప్తులు చేసి ఎలెక్టోరల్ బాండ్ల గురించిన కీలకమైన వివరాలను లోకేష్ బాత్రా రాబట్టగలిగారు. నిజానికి, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకించినప్పటికీ మోదీ ప్రభుత్వం ఎలెక్టోరల్ బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ పథకం ఏమిటి?
ప్రభుత్వం పార్టీలకు ఎన్నికల ఖర్చుల కోసం నిధులు సమకూర్చుందుకు బాండ్లను విడుదల చేస్తుంది. వీటినే ఎలక్టోరల్ బాండ్లు అంటారు. వాటిని పార్టీలకు విరాళాలు ఇవ్వాలనుకుంటున్నవాళ్లు కొనుగోలు చేస్తారు. ఈ బాండ్లను తమకు ఇష్టమయిన పార్టీలకు ఇవ్వొచ్చు. పార్టీలు వాటిని నగదుగా మార్చుకుంటాయి. ఈ పథకం కింద విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు గోప్యం గా ఉంటాయి.
పోరాటం ఇలా మొదలయింది
ఈ చట్టం గురించిన సమగ్ర సమాచారాన్ని ఆయన సమాచారహక్కు చట్టం కిందే సేకరించడం మొదలు పెట్టారు. ఆయన మొదట దొరికిన సమాచారం, ఎన్నికల కమిషన్ ఈ పథకాన్ని వ్యతిరేకించడానికి సంబంధించినది. లోకేష్ బాత్రా అమెరికాలో ఉండడం వల్ల సమాచారాన్ని రాబట్టడం చాలా కష్టమైంది. ప్రభుత్వ వెబ్ సైట్ లు తెరుచుకోకుండా జియో ఫెన్సింగ్ పెట్టారు. కనీసం భారత ఎన్నికల కమిషన్ సమాచారం కూడా లభించలేదు. చివరకు ఆయన భారతదేశంలో ఉన్న తన మిత్రుల ద్వారా అనేక వెబ్ సైట్ల నుంచి సమాచారం సేకరించడం మొదలుపెట్టారు. దాదాపు నూటికి పైగా సమాచారం చట్టం దరఖాస్తులు వేశారు.

పారదర్శకతపై చేసే ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి సహాయ నిధి, ప్రధాన మంత్రి విదేశీ పర్యటనకు చేసే ఖర్చులలో అపారదర్శకతను బహిర్గతం చేసి, ఆ వివరాల ను కూడా రాబట్టారు. ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా సేకరించిన 12 వందల కోట్ల రూపాయల విరాళాల్లో 55 శాతం ఒక్క అధికార బీజేపీకీ దక్కింది. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కు చేరింది కేవలం 10 శాతమే. అంటే అధికారంలో ఉన్న వాళ్లకి బాగా డబ్బులు తెచ్చే పథకమే ఎలెక్టోరల్ బాండ్లు అని అర్థమయింది బాత్రాకి. ఇది ఎలా ఉందంటే మహాబలుడు ఒక చిన్న బాలుడిపైన ముష్ఠిఘాతం విసిరినట్టుంది. ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత ఉంటే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని, జాతి మరింత బలపడుతుందని లోకేష్ భాత్రా భావించారు. పారదర్శకత అంటే ప్రభుత్వంలోని పార్టీతో పాలుపంచుకోవడం కాదని అంటారాయన.

బాత్రా పోరాటంలో వెల్లడయిన అంశాలు

బాత్ర ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం వల్ల చాలా ఆసక్తికరమయిన విషయాలు వెల్లడయ్యాయి. ఎలక్టోరల్ బాండ్ల విధానం ‘తిరోగమన చర్య’ అని 2017లోనే ఎలక్షన్ కమిషన్ రాసిన లేఖలో చేసిన వ్యాఖ్య వెల్లడైంది.తీగలాగితే డొంకంతా కదిలినట్టు, ఎలక్టోరల్ బాండ్ల విధానం కోసం ఏకంగా మూడు చట్టాలను సవరించిన విషయం బైటపడింది. ఆదాయపన్ను చట్టం, 1951నాటి ప్రజాప్రాతినిధ్య చట్టం, 2013 నాటి కంపెనీల చట్టంలో చేసిన సవరణలను బాత్రా పసిగట్టారు.

ఈ పథకం ప్రకటించేముందు మోదీ ప్రభుత్వం రిజర్వు బ్యాంక్ ను, ఎన్నికల కమిషన్ ను సంప్రదించలేదు. రిజర్వు బ్యాంకు ఈపథకం బ్యాంకింగ్ వ్యవస్థను దెబ్బతీస్తుందని చెప్పింది. దీనిని ప్రభుత్వం ఖాతరు చేయలేదు. అంతేకాదు, ఈ పార్టీలకు ఇలా బాండ్ల రూపంలో వచ్చిన డబ్బును కేవలం ఎన్నికల కోసం ఖర్చు చేయాలన్న నియమం ఈ పథకంలో లేదు. ఈ డబ్బుతో పార్టీ ఆఫీసుకట్టుకోవచ్చు, ప్రకటనలకు వాడుకోవచ్చు.ప్రతికలను మచ్చిక చేసుకునేందుకు వాడుకోవచ్చు.

సుప్రీంకోర్టుకు దారి

‘అసోసియేషన్ ఆఫ్ డెమాక్రటిక్ రిఫార్మ్స్’ తో తన సేకరించిన సమాచారాన్ని ఆయన పంచుకున్నారు. దీనితో సంతృప్తి చెందిన ఎడిఆర్ ఆ సంస్థ నిర్వాహకులు సుప్రీం కోర్టులో కేసు వేశారు. తర్వాత ఆయన కేసులో చేరారు. ఎలక్టోరల్ బాండ్ల పథకం వల్ల డబ్బు రుణాలకు, డబ్బా కంపెనీలకు దారితీస్తుందని, రాజకీయ పార్టీలకు, వారికి విరాళాలిచ్చే వారికి మధ్య క్విట్ ప్రోకో జరుగుతుందని లోకేష్ భాత్రా భావించారు. దీని వెనుక పెద్ద వ్యాపారమే జరుగుతుందని కూడా అనుమానించారు. తానొక ఓటరునని, వాస్తవాలు తెలుసుకునే హక్కు తనకుందని భాత్రా భావించారు. ఎన్నికల్లో పోటీ చేసే వారు తమ ఆస్తులను వెల్లడించినప్పుడు విరాళాలు ఇచ్చే వారు తమ పేర్లను ఎందుకు వెల్లడించకూడదని ప్రశ్నించారు. విరాళాలు ఇచ్చే వాళ్ళు ఆ డబ్బును ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉండదా అని ప్రశ్నించారు. జాతి నిర్మాణానికి పారదర్శకత ఉపయోగపడుతుంది.
లోకేష్ భాత్రా తన వాదనలననన్నిటినీ సుప్రీంకోర్టు ముందు ఉంచడంతో ప్రభుత్వం చాలా ఇబ్బందిపడిపోయింది. తమ తప్పును సమర్థించుకోవడానికి పాత విధానం కూడా లోపభూయిష్టంగా ఉందని సోలిసిటర్ జనరల్ ద్వారా చెప్పించింది. నిజానికి పాత విధానంలో 20వేల రూపాయలకు మించిన విరాళం ఇచ్చే వాళ్ళు తమ పేర్లను వెల్లడించవలసి ఉంటుంది. ఈ కొత్త విధానంలో కోట్ల రూపాయల్లో విరాళం ఇచ్చినా దాత పేరు మాత్రం బైటికి రాదు.

ఇలా ఎన్నికల కోసం వసూలు చేసిన విరాళాలు ఎన్నికల కోసమే వెచ్చించాలని ఎలక్టోరల్ బాండ్ల విధానంలో ఎక్కడా లేదు. ఈ డబ్బును ఎలా ఖర్చుచేసేది, ఎక్కడికి తరలించేది ఓటర్లకు తెలియదు. ఎన్నికల కోసం వసూలు చేసిన విరాళాలు పార్టీ ఆఫీసు నిర్మాణానికి వెచ్చించవచ్చు, ప్రకటనలకు, మీడియాకు వెచ్చించవచ్చు. ఈ విధానం వల్ల పార్టీల మధ్య అసమతౌల్యత చోటుచేసుకుంటుంది.
సమాచార చట్టాన్ని అనుసరించి అనేక వాస్తవాలను వెలికి తీసి సుప్రీంకోర్టులో ఎలక్టోరల్ బాండ్ల గుట్టు రట్టు చేసిన లోకేష్ భాత్రా వాట్సప్ కు ఓ బెదిరింపు హెచ్చరిక వచ్చింది.

‘‘బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకు, మోదీకి వ్యతిరేకంగా ఎవరైనా రాస్తే గౌరీ లంకేష్ కు పట్టిన గతే పడుతుంది.’’
అయితే, బాత్రా దాన్ని ఖాతరు చేయలేదు.


Read More
Next Story